ETV Bharat / sports

రోహిత్‌ కెప్టెన్సీని MI అసలెలా వదులుకుంది? కోహ్లీ 'కామెంట్స్'​ గుర్తున్నాయా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 9:39 AM IST

Mumbai Indians Rohit Sharma
Mumbai Indians Rohit Sharma

Mumbai Indians Rohit Sharma : ఐపీఎల్​లో సంచలన నిర్ణయంతో ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. రోహిత్​ను తప్పించి హార్దిక్ పాండ్యకు అప్పగించడంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అయితే రోహిత్​ను అలా ఎలా వదులుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒకానొక సమయంలో రోహిత్ గురించి కోహ్లీ అన్న మాటలను గుర్తుచేసుకుంటున్నారు.

Mumbai Indians Rohit Sharma : సాధారణంగా క్రికెట్ టీ20 ఫార్మాట్​లో దూకుడైన ఆట కావాలి. ఆ విషయంలో రోహిత్​ శర్మ సూపర్​ అని చెప్పొచ్చు. బౌలర్లపై కనికరం లేకుండా రోహిత్ విరుచుకుపడుతుంటాడు. దీంతో హిట్​ మ్యాన్​ అనే బిరుదు కూడా కొట్టేశాడు. ఇప్పటి వరకు క్రికెట్​లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ రికార్డును ఇప్పట్లో ఎవరూ దాటలేరు కూడా.

సెంచరీకి ఒక్క పరుగే ఉన్నా
రోహిత్ ఎప్పుడూ తన పర్సనల్ రికార్డులను లెక్క చేయడు. సెంచరీ సాధించేందుకు ఒక్క పరుగే ఉన్నా గాల్లో లేపి మరీ షాట్స్ కొడుతుంటాడు. ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు మిస్ అయినా జట్టుకు వేగంగా పరుగులు అందిస్తుంటాడు. తన తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లకు ఒత్తిడి తగ్గాలని చూస్తుంటాడు. ఇలా తన కెప్టెన్సీతో ఇప్పటి వరకు ఐదు సార్లు ముంబయి ఇండియన్స్​కు కప్పు అందించాడు. ఐపీఎల్​లో అత్యధిక బ్రాండ్ ఉన్న జట్టుగా ముంబయిని నిలిపాడు.

టీమ్​ఇండియా కెప్టెన్ ఒక ఐపీఎల్ జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడంటే అది ఆ టీమ్​ బ్రాండ్ ఇమేజ్​ను పెంచుతుందని పక్కాగా చెప్పొచ్చు. మూడన్నరేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్​గా ఎంఎస్​ ధోనీ కొనసాగుతున్నాడు. అతడే కాదు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడారు, ఆడుతున్నారు.

మరో రెండు సీజన్లు ఆడిస్తే!
అలాంటిది ఇంకా అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్న రోహిత్​ను ముంబయి కెప్టెన్సీ నుంచి తప్పించడం క్రికెట్ అభిమానులకు తీవ్రంగా కోపం తెప్పించింది. మరో రెండు సీజన్లు రోహిత్‌ను కెప్టెన్‌గా ఆడిస్తే బాగుండేదని చాలా మంది భావన. ఇంతలో జట్టులోని సీనియర్లు బుమ్రా, సూర్యకుమార్‌ను వారసులుగా తీర్చిదిద్దే అవకాశం కూడా ముంబయి జట్టుకు ఉంది. ఇవేం పరిశీలించకుండా హార్దిక్‌ పాండ్యను గుజరాత్ జట్టు నుంచి తీసుకువచ్చేసి ముంబయి జట్టులో చేర్చడం సరైంది కాదనే మెజార్టీ అభిప్రాయం. ఇప్పటిదాకా జట్టులో ఆటగాళ్లకు అండగా ఉండి, ముంబయి ఇండియన్స్‌లో కుటుంబ వాతావరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా తప్పించడం జట్టు సభ్యులకు కూడా నచ్చలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

సూర్య తప్ప ఎవరూ!
అయితే పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలపై జట్టులోని సభ్యులెవరూ పెద్దగా స్పందించలేదు. సూర్యకుమార్ యాదవ్ మాత్రమే రోహిత్​ను తప్పించిన తర్వాత హార్ట్ బ్రేక్ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్ ఏ సందర్భాన్ని అనేది వెల్లడించకుండా పోస్టు చేయడంతో అభిమానులు పలు రకాలుగా భావిస్తున్నారు.

ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ వైదొలగగానే బలవంతంగా రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయాన్ని కొన్నిరోజుల క్రితమే వెల్లడించాడు. రోహిత్‌ గురించి విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.

అసలు కోహ్లీ ఏమన్నాడంటే?
"టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోకి రోహిత్‌శర్మ అనే యంగ్ ప్లేయర్‌ వస్తున్నాడు, అతను అంత గొప్ప, ఇంత గొప్ప అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అరే మనం కూడా యంగ్ ప్లేయరే కదా? ఎందుకు నా గురించి మాట్లాడుకోవట్లేదు అనుకున్నాను. కానీ టీ20 మ్యాచ్‌లో రోహిత్ బాదుడు చూస్తే మాటలు రాలేదు నాకు. ఆ తర్వాత ఇంకెప్పుడు రోహిత్‌శర్మ గురించి మరోలా ఆలోచించలేదు" అని కోహ్లీ చెప్పాడు.

ప్రత్యక్షంగా దగ్గరుండి అతడి ఆటను చూసిన సహచరుడి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం రోహిత్‌ సత్తాకు నిదర్శనం. టీ20 జట్టులోకి రోహిత్ అరంగేట్రం సమయంలో జ్ఞాపకాలను కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో అతిశయోక్తి లేదని తాజా వరల్డ్ కప్‌లోనూ నిరూపితమైంది. ఇలాంటి రోహిత్ శర్మను సడెన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం సరైంది కాదనేది అనేక మంది అభిమానులతోపాటు మాజీల అభిప్రాయం కూడా.

'ముంబయిపై నీ ముద్ర చెరగనిది- ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్​'

రోహిత్​కు గుడ్​బై!- టీ20 కెప్టెన్​గా పాండ్య?- అసలేం జరుగుతుందబ్బా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.