'బ్యాటింగ్ ఆర్డర్​లో లోపాలను అధిగమించాల్సి ఉంది'

author img

By

Published : Jan 14, 2022, 8:45 PM IST

virat, elgar

Kohli on IND vs SA Series: టీమ్​ఇండియాపై మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది దక్షిణాఫ్రికా. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడాడు టెస్టు సారథి విరాట్ కోహ్లీ. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు.

Kohli on IND vs SA Series: టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్‌ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

"ఈ టెస్టు సిరీస్‌ ఆసాంతం గొప్పగా సాగింది. తొలి టెస్టులో మేం మెరుగ్గా రాణించి పైచేయి సాధించాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులో గొప్పగా పోరాడి విజయం సాధించింది. అదే ఊపుతో మూడో టెస్టులో గెలుపొంది.. సిరీస్‌ను సొంతం చేసుకుంది. కీలక సమయాల్లో మా ఆటగాళ్లు విఫలమయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయించింది. మా జట్టు కంటే మెరుగ్గా రాణించింది. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో మేం కొంచెం వెనుకబడిపోయాం. అలాగే, కీలక సమయాల్లో బౌలర్లు కూడా విఫలమవడంతో పుంజుకోలేకపోయాం. అది చాలా నిరాశకు గురి చేసింది. సఫారీ బౌలర్లు స్థిరత్వంతో బౌలింగ్‌ చేసి భారత్‌ని దెబ్బతీశారు. పక్కా ప్రణాళికతో వచ్చి బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశారు. మా బ్యాటింగ్‌ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో మెరుగ్గా రాణించినంత మాత్రాన.. దక్షిణాఫ్రికాలో అదే విధంగా రాణిస్తామని గ్యారంటీ ఇవ్వలేం!"

-- విరాట్ కోహ్లీ, టెస్టు సారథి.

ఆత్మ విశ్వాసం పెరిగింది..

దక్షిణాఫ్రికా సిరీస్ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కెప్టెన్‌ డీన్ ఎల్గర్‌ కూడా మ్యాచ్‌పై స్పందించాడు. 'మా జట్టులో అనుభవమున్న ఆటగాళ్లు లేకపోయినా భారత్ లాంటి బలమైన జట్టుపై సిరీస్‌ సాధించినందుకు గర్వంగా ఉంది. ఈ సిరీస్‌లో చాలా సార్లు ఒత్తిడికి గురైనా.. మా కుర్రాళ్లు గొప్పగా పుంజుకున్నారు. ఈ విజయంతో కుర్రాళ్లలో ఏ జట్టుపై అయినా గెలవగలమనే నమ్మకం పెరిగింది. సమష్టిగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైంది. కీగన్‌ పీటర్సన్‌ గొప్పగా రాణించాడు. సిరీస్ సాధించినంత మాత్రాన మా జట్టులో లోపాలు ఏం లేవని చెప్పలేం. మా జట్టు ఆటగాళ్లలో కూడా కొన్ని లోపాలున్నాయి. రాబోయే సిరీస్‌ల్లో వాటిని అధిగమిస్తాం' అని డీన్‌ ఎల్గర్‌ వివరించాడు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి:

'ఈ పద్ధతితో కుర్రాళ్లకు రోల్ మోడల్ అవ్వడం కష్టం'

IND vs SA: 'ఒత్తిడిలో టీమ్‌ఇండియా.. అందుకే అలా'

అలవోకగా గెలిచిన దక్షిణాఫ్రికా.. అతిథ్య జట్టుదే సిరీస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.