ETV Bharat / sports

కుల్‌దీప్‌ను తప్పించడం సరైందే.. అందుకు బాధ లేదు : కేఎల్‌ రాహుల్‌

author img

By

Published : Dec 26, 2022, 7:35 AM IST

kl rahul comments on kuldeep yadav
కుల్‌దీప్‌ యాదవ్​

బంగ్లాతో జరిగిన మొదటి టెస్టులో కులదీప్​ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' సాధించినప్పటికీ.. రెండో మ్యాచ్​లో అతణ్ని తప్పించారు. స్పిన్​కు అనుకూలంగా ఉండే ఆ పిచ్​పై కులదీప్​ను ఆడించనందున తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన టీమ్ ​ఇండియా తాత్కాలిక కెప్టెన్​​ కేఎల్‌ రాహుల్‌.. తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని.. కులదీప్​ విషయంలో ఎలాంటి బాధ లేదని అన్నారు.

Kl Rahul On Kuldeep Yadav : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో కుల్‌దీప్‌ను తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించిన పిచ్‌పై అతణ్ని ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ కుల్‌దీప్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి బాధ లేదని, అది సరైందేనని టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు.

"కుల్‌దీప్‌ను తప్పించేలా తీసుకున్న నిర్ణయంపై బాధ లేదు. అది సరైందే. ఈ పిచ్‌పై మా పేసర్లు కూడా వికెట్లు తీశారు. వీళ్లకూ పిచ్‌ సహకరించింది. అస్థిరమైన బౌన్స్‌ లభించింది. ఇక్కడ వన్డేలు ఆడిన అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. స్పిన్‌, బౌన్స్‌కు సహకారం లభించడం చూశాం. జట్టు కూర్పు సమతూకంతో ఉండాలనుకున్నాం. తొలి టెస్టును గెలిపించిన కుల్‌దీప్‌ను పక్కకు పెట్టాలన్నది కఠిన నిర్ణయం. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ (సబ్‌స్టిట్యూట్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం) అవకాశం ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో అతనితో బౌలింగ్‌ చేయించేవాణ్ని" అని అతను తెలిపాడు.

ఈ సిరీస్‌లో రాహుల్‌ (57 పరుగులు), కోహ్లి (45) విఫలమయ్యారు. ఫార్మాట్లకు తగ్గట్లుగా వేగంగా ఆటను మార్చుకోవడం సవాలేనని ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యానించాడు. "మూడు ఫార్మాట్లు ఆడుతుంటే.. ఒక దాని నుంచి మరొకదానికి మారడం కష్టంగా ఉంటుంది. ఆ ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆటను మార్చుకోవడానికి సమయం పడుతుందని నా అభిప్రాయం. పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటామనేది సవాలే. ఈ సిరీస్‌లో నా ప్రదర్శన గొప్పగా లేదని ఒప్పుకుంటా. దురదృష్టవశాత్తూ మా షెడ్యూల్‌ కూడా తీరిక లేని విధంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు, టెస్టులకు మధ్య కాస్త విరామం ఉండాలి" అని అతను పేర్కొన్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రేయస్‌ ఉత్తమంగా ఆడుతున్నాడని రాహుల్‌ చెప్పాడు.

రాహుల్‌పై వేటు వేయాల్సిందే..
గాయం నుంచి కోలుకున్న రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తే కేఎల్‌ రాహుల్‌పై వేటు తప్పదని మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్‌ అన్నాడు. పేలవ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ బంగ్లాదేశ్‌పై నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 22, 23, 10, 2 పరుగులు చేశాడు. సగటు 17.13 మాత్రమే. "రాహుల్‌ను టెస్టు జట్టు నుంచి తప్పించాల్సిందే. బ్యాటర్‌గా అతడు చాలా పేలవ ప్రదర్శన చేశాడు. రోహిత్‌ వస్తే.. కేఎల్‌ దారివ్వక తప్పదు" అని జాఫర్‌ చెప్పాడు. బంగ్లాపై రాహుల్‌ విఫలం కాగా.. అతడితో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శుభ్‌మన్‌ గిల్‌ ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు శతకం సాధించిన గిల్‌.. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 39.25 సగటుతో 157 పరుగులు చేశాడు. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై టీమ్‌ఇండియా నాలుగు టెస్టులు ఆడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.