ETV Bharat / sports

డోంట్​ వర్రీ.. ఇషాన్‌ కిషన్‌కు తప్పకుండా అవకాశం వస్తుంది: గంగూలీ

author img

By

Published : Jan 13, 2023, 9:13 AM IST

భారత్‌-శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఇషాన్‌కిషన్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ దీనిపై విభిన్నంగా స్పందించాడు.

ishan kishan
ishan kishan

శ్రీలంకతో తొలి వన్డేలో భారత జట్టు యాజమాన్యం ఇషాన్‌ కిషన్‌ను పక్కన పెట్టి శుభ్‌మన్‌గిల్‌కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వన్డేల్లో ద్విశతకం సాధించిన ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇవ్వకపోవటం పట్ల భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్ ప్రసాద్‌ సహా మరికొందరు క్రికెటర్లు ఈ నిర్ణయాన్ని విమర్శించారు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. ఇషాన్‌ గొప్ప ఆటగాడని, అయితే అతడికి తప్పకుండా అవకాశం లభిస్తుందని చెప్పాడు.

గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్‌ 131 బంతుల్లో 210 పరుగులు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన యువ ఆటగాడిగా ఇషాన్‌ చరిత్ర సృష్టించాడు. అయినప్పటికీ శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లోనూ అతడికి చోటు దక్కలేదు. కానీ గంగూలీ మాత్రం ఇషాన్‌కు అనుకూలంగా ప్రకటన చేయడం విశేషం. "ఇషాన్‌కి కచ్చితంగా అవకాశం లభిస్తుంది. అతడికీ సమయం వస్తుంది. ఎవరికి స్థానం కల్పించాలో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిర్ణయం తీసుకుంటారు. ఆటతీరుతోనే ఉత్తమంగా నిలుస్తారు" అని గంగూలీ పేర్కొన్నాడు.

శ్రీలంకతో తొలి వన్డేలో కోహ్లి శతకం బాది 45 వన్డే సెంచరీల మైలురాయికి చేరుకున్నాడు. అతడు వన్డేల్లో మరో నాలుగు సెంచరీలు సాధిస్తే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును చేరుకుంటాడు. "కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. 45 శతకాలు సాధించడం చిన్న విషయం కాదు. అతడు స్కోర్‌ చేయని మ్యాచులూ ఉన్నాయి. కానీ, అతడు ఒక ప్రత్యేకమైన ఆటగాడు" అని గంగూలీ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.