IPL 2021: కేకేఆర్​ సారథిగా దినేశ్​ కార్తిక్​!

author img

By

Published : May 29, 2021, 1:02 PM IST

దినేశ్​ కార్తిక్

ఐపీఎల్(IPL 2021)​ రెండో దశలో కోల్​కతా నైట్​రైడర్స్(Kolkata Knight Riders)​​ సారథిగా మళ్లీ దినేశ్ కార్తిక్​ బాధ్యతలు స్వీకరిస్తాడని తెలుస్తోంది. కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2021) వాయిదా పడటం వల్ల కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు(Kolkata Knight Riders)కు పెద్ద చిక్కే వచ్చిపడింది! యూఏఈ వేదికగా జరిగే రెండో దశలో నాయకుడు ఎవరన్న సందిగ్ధత నెలకొంది. ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పరిస్థితులను గమనిస్తుంటే మళ్లీ దినేశ్ కార్తీక్‌కే పగ్గాలు చిక్కేలా కనిపిస్తోంది.

తాజా సీజన్‌ సగం ముగిశాక ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఫలితంగా బయో బుడగ బలహీన పడింది. క్రికెటర్లు ఆందోళనకు గురవ్వడం వల్ల అప్పటికప్పుడు ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. మిగిలిన సీజన్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పుడు దారులు వెతుకుతోంది. ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటన ముగిశాక రెండో దశను పూర్తి చేయాలని భావిస్తోంది. అంటే సెప్టెంబర్‌, అక్టోబర్​లో మిగతా మ్యాచులు నిర్వహించాలన్నది బోర్డు ఉద్దేశం.

టీమ్‌ఇండియాతో ఐదు టెస్టుల తర్వాత ఇంగ్లాండ్‌కు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. ఇవన్నీ ముందే నిర్ణయించుకున్నవి కాబట్టి క్రికెటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయబోమని ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ స్పష్టం చేశారు. అంటే ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, మొయిన్‌ అలీ, జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌ సహా చాలామంది ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరు. మోర్గాన్‌ ఉండడు కనుక కోల్‌కతాకు నాయకత్వ సమస్య ఏర్పడింది.

గత సీజన్‌ మధ్య వరకు దినేశ్‌ కార్తీక్‌(Dinesh Karthik) కేకేఆర్‌కు సారథ్యం వహించాడు. ఆశించిన రీతిలో అతడు జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. దాంతో మోర్గాన్‌ను జట్టు యాజమాన్యం కెప్టెన్‌గా ప్రకటించింది. డీకే వైస్‌కెప్టెన్‌గా అతడికి తోడుంటాడని తెలిపింది. ఇప్పటికే కోల్‌కతాకు 37 మ్యాచుల్లో సారథ్యం వహించిన డీకే కేవలం 21 విజయాలే అందించాడు. అయితే మోర్గాన్‌ కూడా ఈ సీజన్​లో ఆ జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు. 7 మ్యాచులకు 2 గెలిపించాడు. ఇంకా ఆడాల్సినవి ఏడే కాబట్టి మిగిలిన సీజన్‌లో డీకేకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి కొవిడ్ రూల్స్ బ్రేక్- కేకేఆర్ ఆటగాడికి ఫైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.