ETV Bharat / sports

బౌలింగ్​ స్కిల్స్​తో అదరగొట్టిన ఆర్సీబీ విజయ్​..'ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్?'

author img

By

Published : Apr 16, 2023, 8:01 AM IST

ఐపీఎల్‌-16లో శనివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీకి చెందిన ఓ బౌలర్​పై అందరి దృష్టి పడింది. అతడి బౌలింగ్​ స్కిల్క్​కు ఫిదా అయిన ఫ్యాన్స్​ సోషల్​ మీడియాలో వెతుకులాట మొదలెట్టారు. అతడే కర్ణాటకకు చెందిన విజయ్​ కుమార్​ వైశాఖ్​. ఆర్సీబీ టీమ్​లోని ఈ సరికొత్త సెన్సేషన్​ గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

Vijaykumar Vyshak
Vijaykumar Vyshak

'విజయ్‌ కుమార్ వైశాక్'.. ప్రస్తుతం క్రికెట్​ అభిమానుల నోట్లో నానుతున్న పేరు ఇది. అరంగేట్ర ఐపీఎల్ సీజన్​లోనే.. తన అసాధారణ బౌలింగ్​ స్కిల్స్​తో అందరినీ అబ్బురపరిచాడు. దీంతో అందరి దృష్టి ఇతడిపై పడింది. బెంగళూరు వేదికగా శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కుమార్.. తన అత్యద్భుత ప్రదర్శనతో జట్టును విజయ పథంలోకి నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

విజయ్ బౌలింగ్​ చేసిన మొత్తం 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లను పడగొట్టాడు. తన తొలి ఓవర్‌లోనే దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేసిన విజయ్.. మూడో ఓవర్‌ కల్లా మరో దిల్లీ ప్లేయర్​ అక్షర్ పటేల్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఇక చివరి ఓవర్‌లో లలిత్ యాదవ్‌ వికెట్ పడగొట్టి దిల్లీ పతనాన్ని శాసించాడు.

నకుల్ బాల్స్‌, స్లోయర్లతో పాటు యార్కర్లు వేయడంలో స్పెషలిస్ట్ అయిన విజయ్‌ కుమార్.. ఆర్సీబీ సారథ్యంలో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఈ సంచలన ప్రదర్శనతో ఇతని పేరు ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీంతో విజయ్‌ కుమార్ వైశాక్ ఎవరా అంటూ ఇతడి గురించి తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో అతడి గురించి తెలిసిన వివరాలేంటంటే..

  • కర్ణాటకకు చెందిన విజయ్‌‌ కుమర్ వైశాక్.. దేశవాళీ క్రికెట్‌‌లో ఆ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
  • 2020-21 సీజన్‌తో కర్ణాటక జట్టు తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
  • 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు.
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
  • 14 మ్యాచ్‌ల్లో 6.92 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలో 2023 ఐపీఎల్ మిని వేలంలో పాల్గొన్న విజయ్ ​కుమార్​ను మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ముంబయి ఇండియన్స్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు నెట్ బౌలర్‌గా సేవలందించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆయా ఫ్రాంచైజీలు విజయ్ ​కుమార్​ను పట్టించుకోలేదు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అతడికి నెట్‌ బౌలర్‌గా పని చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో బెంగళూరు జట్టు స్టార్ బ్యాటర్ రజత్ పటీదార్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం వల్ల అతడి స్థానాన్ని విజయ్‌ కుమార్ వైశాక్‌కు ఇచ్చారు.

నెట్స్‌లో ఇతని బౌలింగ్ తీరుకు ఫిదా అయిన ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. ఈ మ్యాచ్​లో ఆడేందుకు అవకాశమిచ్చారు. అలా అతని బౌలింగ్‌ వేరియేషన్స్ జట్టుకు ఉపయోగపడతాయని భావించి ఛాన్స్ ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు విజయ్‌కుమార్. మైదానంలోకి దిగిన ఈ ప్లేయర్​ తన బౌలింగ్​ స్కిల్స్​తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇక విజయ్ బౌలింగ్‌కు ఫిదా అయిన ఆర్సీబీ ఫ్యాన్స్​.. అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్​ మీడియాలో సైతం ఇతని గురింతే ట్రెండ్​ నడుస్తోంది. 'ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్?' అంటూ అభిమానులు అడుగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.