ETV Bharat / sports

'క్రీజులో రాహుల్​ ఉంటే బౌలర్లకు చుక్కలే.. శాంసన్​ కన్నా అతడు చాలా బెటర్​!'

author img

By

Published : Apr 20, 2023, 1:43 PM IST

Updated : Apr 20, 2023, 2:32 PM IST

స్టార్​ బ్యాటర్ కేఎల్​ రాహుల్​కు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ వీరేందర్​ సెహ్వాగ్ మరోసాది​ మద్దతుగా నిలిచాడు. శాంసన్​ కన్నా రాహుల్​ బెటర్​ అని చెప్పాడు. సెహ్వాగ్​ ఇంకేం అన్నాడంటే?

kl rahul
kl rahul

టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌ 2023లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌కు సారధ్యం వహిస్తున్న రాహుల్‌.. లీగ్​లోనూ అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో మాత్రం రాహుల్‌ పర్వాలేదనపించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన అతడు.. రాజస్థాన్​తో తలపడ్డ​ మ్యాచ్‌లో 39 పరుగులతో రాణించాడు.

అయితే రాహుల్‌ను పక్కన పెట్టి భారత జట్టులో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కేఎల్‌ రాహుల్‌కు మరోసారి మద్దతుగా నిలిచాడు. సంజూ శాంసన్ కంటే రాహుల్ ఎంతో నయమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

"కేఎల్‌ రాహుల్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండవచ్చు కానీ.. అతడు ఫామ్‌లోకి రావడం లఖ్​నవూకు శుభసూచకం. రాజస్థాన్​ రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్ తప్ప మినహా అంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. అయితే ఆ జట్టులో చాహల్‌, అశ్విన్‌ వంటి స్టార్‌ స్పిన్నర్లు ఉన్నారు. కానీ రాహుల్‌ ఎక్కువ సేపు క్రీజులో వుంటే వారికి కచ్చితంగా చుక్కలు చూపిస్తాడు. సంజూ శాంసన్ కంటే కేఎల్‌ రాహుల్‌ చాలా బెటర్‌ అని నేను భావిస్తాను. అతడు విదేశీ గడ్డపై టెస్టు సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఓపెనర్‌గా మిడిలార్డర్‌లో రాణించే సత్తా అతడికి ఉంది. టీ20ల్లో కూడా చాలా పరుగులు చేశాడు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

గతరాత్రి లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ రాజస్థాన్​ రాయల్స్​తో తలపడింది. ప్రస్తుత సీజన్​లో పూర్తిగా బ్యాటర్​ల ఆధిపత్యం సాగుతోంది. కానీ ఈ మ్యాచ్​లో అందుకు భిన్నంగా ఇరు జట్ల బౌలర్లు వారి సత్తా చాటారు. హేమాహేమీ బ్యాటర్లతో పటిష్ఠంగా ఉన్న రాజస్థాన్.. లఖ్​నవూ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక విజయం ముంగిట చతికిలపడింది. ఫలితంగా సీజన్​లో రెండో ఓటమిని చవిచూసింది.

టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన లఖ్​నవూకు మంచి ఆరంభమే దక్కింది. పూర్తిగా బౌలర్లకు​ సహకరిస్తున్న పిచ్​పై పరుగులు రాబట్టడం బ్యాటర్లకు సవాల్​గా మారింది. మేయర్స్​ (51), రాహుల్ (39)​ రాణించారు. చివర్లో స్టొయినిన్స్ (21)​, పూరన్​ (29) బ్యాట్​ సహకారంతో లఖ్​నవూ 154 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్​ బౌలర్లలో అశ్విన్​కు​ రెండు, బౌల్ట్, సందీప్​, హోల్డర్​లకు తలో వికెట్​ దక్కింది.

అనంతరం ఛేదనలో రాజస్థాన్​ 144 పరుగులే చేసింది. జైస్వాల్ 44, బట్లర్ 40 పరుగులతో మొదటి వికెట్​కు 87 పరుగులు జోడించారు. అద్భుతమైన ఆరంభాన్ని ​​రాజస్థాన్ బ్యాటర్లు అందిపుచ్చుకోలేదు. కెప్టెన్​ శాంసన్​, చివరి​ మ్యాచ్​ హీరో హిట్​మెయర్​ కూడా చెరో 2 పరుగులకే వెనుదిరిగారు. లాస్ట్​లో పడిక్కల్​ 26, రియాన్​ పరాగ్​ 15 నిరాశపర్చారు. దీంతో రాజస్థాన్​కు ఓటమి తప్పలేదు.

జోష్​లో ఉన్న రాహుల్​కు షాక్​..
లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్​పై ఐపీఎల్​ నిర్వాహకులు జరిమానా విధించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ కారణంగా అతడిపై చర్యలు తీసుకున్నారు. స్లో ఓవర్ రేట్ కింద రాహుల్​కు రూ.12 లక్షల ఫైన్​ కట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాహుల్​పై చర్యలు తీసుకుంటున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

"జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు అతడిపై జరిమానా విధించాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లోని మొదటి నేరంగా పరిగణించి, రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా వేశాం" అంటూ ప్రకటనలో పేర్కొంది.

Last Updated : Apr 20, 2023, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.