ETV Bharat / sports

వెంకటేశ్ అయ్యర్​.. ఐపీఎల్ యువ సంచలనం!

author img

By

Published : Sep 21, 2021, 5:19 PM IST

కోల్‌కతా నైట్​ రైడర్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌. బెదురులేని బ్యాటింగ్​తో బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభానికి ముందు విజయ్‌ హజారే టోర్నీలో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కోల్​కతాకు కొత్త భరోసా ఇచ్చిన ఈ యువ ఆటగాడి క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందంటే..

venkatesh iyer
వెంకటేష్ అయ్యర్

సహజంగా ఎవరైనా సినిమా తారలు అనుకోకుండా తాము నటులమయ్యామని అంటారు. కానీ, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా అదే డైలాగ్‌ చెబుతున్నాడు. తాను చిన్నప్పటి నుంచి చదువులో మెరిట్‌ అని, కానీ.. ఎప్పుడూ ఇంట్లో ఉంటూ చదవుకోకపోతే బయటకు వెళ్లి ఆటలు ఆడమని తన తల్లి చెప్పడం వల్లే ఇప్పుడు క్రికెటర్‌ అయ్యానని అంటున్నాడు. అసలీ వెంకటేశ్‌ ఎవరు? అతడి నేపథ్యం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

తొలి మ్యాచ్‌తోనే అదరగొట్టాడు..

సోమవారం రాత్రి జరిగిన కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌. ఐపీఎల్‌-14 తొలి దశలో గిల్‌కు తోడుగా నితీశ్‌ రాణాను ఓపెనర్‌గా పంపిన ఆ జట్టు.. రెండో దశలో అనూహ్యంగా ఈ కొత్త బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇచ్చింది. అయితే, ఈ ప్రయోగం మంచి ఫలితమే ఇచ్చింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. బెదురు లేని బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. అనుభవజ్ఞులైన బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌కు సరిపోయే విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తున్న వెంకటేశ్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభానికి ముందు విజయ్‌ హజారే టోర్నీలో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. మధ్యప్రదేశ్‌ తరఫున ఓపెనింగ్‌ చేసి పంజాబ్‌పై 146 బంతుల్లో 198 పరుగులు చేశాడు. దాంతో కోల్‌కతా దృష్టిలో పడి ఇప్పుడు బెంగళూరుపై అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌గిల్‌ (48; 34 బంతుల్లో 6x4, 1x6) పరుగులు చేయగా వెంకటేశ్‌ (41 నాటౌట్‌; 27 బంతుల్లో 7x4, 1x6) చివరి వరకూ క్రీజులో నిలిచాడు.

తొలుత చదువు వదిలేసి..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వెంకటేశ్‌ 2015 నుంచి ఆ రాష్ట్ర స్థాయి జట్టులో కొనసాగుతున్నాడు. ఇదే క్రమంలో ఎంబీఏ పూర్తి చేశాడు. అంతకుముందు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అవ్వాలని ఆశించిన అతడు.. ఆ కోర్సులో చేరితే క్రికెట్‌కు దూరమవ్వాల్సి వస్తుందని ఆలోచించాడు. దీంతో ఎంబీఏలో చేరి ఆ చదువును పూర్తి చేశాడు. సహజంగానే మెరిట్‌ విద్యార్థి అయిన అతడు.. తనపై ఉన్న ఆత్మవిశ్వాసంతో తరగతులకు కూడా తక్కువగా హాజరయ్యేవాడు. ఈ క్రమంలోనే అతడి ఆట చూసి ఫిదా అయిన అధ్యాపకులు అతడికి నోట్సు తయారు చేసివ్వడం, అటెండెన్స్‌ నష్టపోకుండా చూడటం లాంటివి సహాయం చేసేవారు. దీంతో మిగిలిన సమయమంతా ప్రాక్టీస్‌కే కేటాయించిన వెంకటేశ్‌ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా తయారయ్యాడు. అలా చదువును కొనసాగిస్తూనే క్రికెటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

డెలాయిట్‌లో ఉద్యోగం వదిలొచ్చి..

వెంకటేశ్‌ ఎంబీయే పూర్తి చేశాక డెలాయిట్‌ లాంటి ఉన్నత సంస్థలో మంచి ఉద్యోగం సంపాదించాడు. అయినా, దాన్ని వదులుకొని క్రికెటర్‌గా కొనసాగేందుకే సిద్ధపడ్డాడు. అదే సమయంలో 2018లో తొలిసారి ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గా ఎంపికై దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. మధ్యప్రదేశ్‌ జట్టులో అండర్‌ 23 జట్టుకు కెప్టెన్‌గానూ చేశాడు. ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకొని గతేడాది ఐపీఎల్‌లో తొలిసారి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికయ్యాడు. అయితే, అతడికి ఆ సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ వేలానికి ముందు వెంకటేశ్‌.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే టోర్నీల్లో చెలరేగాడు. తొలుత సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో 75.66 సగటుతో 277 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. ఇక విజయ్‌ హజారేలో పంజాబ్‌పై 198 పరుగులు చేసి తన కెరీర్‌కు ఉపయుక్తమైన బాటలు వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఎంపికై ఒక్క మ్యాచ్‌తో ఫేమస్‌ అయిపోయాడు. వెంకటేశ్‌ బ్యాటింగ్‌ ఒక్కటే కాకుండా మీడియం పేసర్‌గానూ రాణిస్తాడు. అతడిని సరైన విధంగా తయారు చేస్తే టీమ్‌ఇండియాకు మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ దొరికినట్లే అని క్రికెట్‌ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

Mithali Raj News: తొలి మహిళా క్రికెటర్​గా మిథాలీ రాజ్​ రికార్డు

మసాజ్​ థెరపిస్టుతో ఆర్సీబీ ఆల్​రౌండర్​.. ఫొటోలు వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.