ETV Bharat / sports

'గెలిచిన టీమ్​ సంబరాలు చేసుకుంటే.. ఓడినవారు నిశ్శబ్దంగా అంగీకరించాల్సిందే'

author img

By

Published : May 4, 2023, 7:37 PM IST

virender sehwag about virat gambhir fight
virender sehwag

ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​లో హాట్​ టాపిక్​గా మారిన కోహ్లీ-గంభీర్ వాగ్వాదంపై తాజాగా టీమ్ఇండియా మాజీప్లేయర్​ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇంతకీ అతను ఎమన్నాడంటే?

ఐపీఎల్ 2023 సీజన్‌లో నడుస్తున్న మ్యాచ్‌ల కంటే ఇప్పుడు గంభీర్ - విరాట్ వాగ్వాదం హైలైట్‌గా నిలుస్తోంది.లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్​నవూపై ఆర్‌సీబీ విజయం సాధించడం వల్లనే ఈ వివాదం మొదలయ్యింది. ఒకరినొకరు మాటలతో దాడి చేసుకున్న ఘటన సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. మైదానంలో వీరు చేసిన హంగామాకు వీరిద్దరిపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. ఈ క్రమంలో గంభీర్ - విరాట్ వ్యవహారంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ఈ విషయంపై ఇటీవలే స్పందించాడు. అయితే ఆయన అందరిలా కాకుండా మరో అడుగు ముందుకేసి కఠిన శిక్ష విధించాలని సూచించాడు. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజేతగా నిలిచిన జట్టు సంబరాలు చేసుకుంటూ వెళ్లాలని, ఓడిన జట్టు నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని పేర్కొన్నాడు.

"మ్యాచ్‌ అయిపోయిన వెంటనే నేను టీవీ ఆఫ్​ చేస్తాను. కాబట్టి విరాట్ - గంభీర్​ ఎపిసోడ్‌ను నేను ఆ సమయంలో చూడలేకపోయా. అయితే మరుసటి రోజు సోషల్‌ మీడియాలో ఈ విషయం హల్‌చల్‌ అయిపోయింది. అక్కడ జరిగింది ఏమాత్రం సరైంది కాదు. ఓడిపోయినవారు నిశ్శబ్దంగా ఓటమిని అంగీకరించి అక్కడ నుంచి వెళ్లిపోవాలి. గెలిచిన టీమ్ సంబరాలు చేసుకుంటూ వెళ్లాలి. ఒకరినొకరు ఏదొక మాట అనుకోవడం ఎందుకు? వారిద్దరూ సెలబ్రెటీలు. వారు ఏం చేసినా.. ఏం మాట్లాడినా లక్షల మంది చిన్నారులు, అభిమానులు చూస్తుంటారు. 'మా ఐకాన్‌ ఇలా చేశాడు కాబట్టి.. నేను కూడా చేయొచ్చు' అని అనుకొనే ప్రమాదాలు లేకపోలేదు. వీటన్నింటినీ మనసులో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది" అని సెహ్వాగ్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

ఇలాంటి ఘటనలపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే వారిపై నిషేధం విధించాల్సిన అవసరమూ ఉందని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. "ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరిపైనైనా బ్యాన్ వేస్తే మరోసారి జరగకుండా చూడొచ్చు. బీసీసీఐ కచ్చితంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం ఉండేలా కూడా చూడాలి. మైదానంలో స్టార్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు మాత్రం ఏ మాత్రం మంచిగా లేదు" అని పేర్కొన్నాడు. ధోనీ రిటైర్‌మెంట్ గురించి వస్తున్న ప్రశ్నలపై కూడా సెహ్వాగ్​ స్పందించాడు. ధోనీ కూడా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. వీడ్కోలుకు సంబంధించిన విషయం ఏదైనా అభిమానులకు తెలిసేలా ధోనీనే సరైన సమయంలో ప్రకటిస్తాడని సెహ్వాగ్‌ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.