ETV Bharat / sports

రాత మార్చుకోని సన్​రైజర్స్... తొలి మ్యాచ్​లో ఢమాల్.. రాజస్థాన్​పై ఘోర ఓటమి

author img

By

Published : Apr 2, 2023, 7:22 PM IST

Updated : Apr 2, 2023, 7:51 PM IST

2023 ఐపీఎల్ సీజన్​లో ఆడిన తొలి మ్యాచ్​లో సన్​రైజర్స్ ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్​లో పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపర్చింది.

SUNRISERS VS RAJASTAN ROYALS
SUNRISERS VS RAJASTAN ROYALS

సన్​రైజర్స్ రాత మారలేదు. గత సీజన్​ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ సీజన్ తొలి మ్యాచ్​లో పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘోర ఓటమి మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్​లో మూకుమ్మడిగా విఫలమైంది. మొదట బౌలర్లు చతికిల పడగా.. హైదరాబాద్ జట్టు ముంగిట 204 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది రాజస్థాన్. బ్యాటింగ్​కు అనుకూలించిన పిచ్​పై ఛేదనలోనైనా రాణిస్తారనుకున్న ఫ్యాన్స్ ఆశలను వమ్ము చేస్తూ.. 131 పరుగులకే పరిమితమైంది. ఏ దశలోనూ ఆ జట్టు విజయం సాధిస్తుందనేలా కనిపించలేదు.

మరోవైపు, గత సీజన్​లో రన్నరప్​గా నిలిచిన రాజస్థాన్.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంత పటిష్ఠంగా ఉందనేది తొలి మ్యాచ్​లోనే తేలిపోయింది. గత సీజన్ ఫామ్​ను కొనసాగిస్తూ తొలుత బ్యాటింగ్​లో చెలరేగింది. ఆ జట్టు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (54), జోస్ బట్లర్ (54) ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎడాపెడా ఫోర్లతో జైశ్వాల్ చెలరేగగా... జోస్ బట్లర్ సిక్సులు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు బట్లర్. వీరిద్దరి వేగంతో పవర్​ప్లేలోనే 84 పరుగులు పిండుకుంది రాజస్థాన్. అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తున్న ఈ జంటకు అఫ్గాన్ జాతీయుడు ఫజల్​హక్ ఫారూఖీ బ్రేకులు వేశాడు. సన్​రైజర్స్​కు ఆ ఆనందం కొద్దిసేపే అయింది. రాజస్థాన్ జట్టు సారథి సంజూ శాంసన్ క్రీజులోకి అడుగుపెడుతూనే.. విరుచుకుపడ్డాడు. ఈ ముగ్గురు కలిసి సన్​రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. శాంసన్ 55 పరుగులు చేసి వెనుదిరగగా.. పడిక్కల్, రియాన్ పరాగ్​లను వెంటనే ఔట్ చేసి కాస్త ఊపిరి పీల్చుకుంది హైదరాబాద్.

ఛేదనలో హైదరాబాద్​కు తొలి ఓవర్​లోనే రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి పంపిన ట్రెంట్ బౌల్ట్.. వన్​డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీని సైతం అదే ఓవర్​లో ఔట్ చేశాడు. హోల్డర్ పట్టిన అద్భుతమైన క్యాచ్​కు త్రిపాఠీ వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 27) కాసేపు నిలబడ్డాడు. ఇక రూ.13.5 కోట్లు పెట్టి సన్​రైజర్స్ కొనుక్కున్న హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ టెస్టును తలపించింది. 21 బంతులు ఎదుర్కొన్న అతడు.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి 13 పరుగులు మాత్రమే చేశాడు. వాషింగ్టన్ సుందర్(1), గ్లెన్ ఫిలిప్స్(8) పూర్తిగా నిరాశపర్చారు. ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగిన ఆల్​రౌండర్ అబ్దుల్ సమద్.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మెరుపులు తప్ప పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆదిల్ రషీద్ (18), భువనేశ్వర్ (6) సైతం విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, హోల్డర్, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Last Updated : Apr 2, 2023, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.