ETV Bharat / sports

అదరగొడుతున్న అభినవ్​.. టీమ్ఇండియాకు కొత్త ఫినిషర్ దొరికినట్టేనా?

author img

By

Published : Apr 26, 2023, 8:52 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ సీజన్​16లో భాగంగా మంగళవారం ముంబయి ఇండియన్స్​ గుజరాత్ టైటాన్స్​ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​తో మరో యవ కెరటం బాహ్య ప్రపంచానికి పరిచయం అయింది. అతడే అభినవ్​ మనోహర్​. అతడి గురించే ఈ కథనం..

abhinav manohar innings ipl 2023
abhinav manohar innings ipl 2023

ఐపీఎల్ ఎందరో యువ ఆటగాళ్లను టీమ్​ఇండియాకు అందించింది. ప్రతిభ ఉన్నా.. అవకాశాలు రాని ఎందరికో ఈ మెగాలీగ్​​ వేదికగా నిలిచింది. హార్దిక్​ పాండ్య, శుభమన్​ గిల్​, రుతురాజ్​ గైక్వాడ్, సంజు శాంసన్​, పృథ్వీ షా, రిషభ్​ పంత్​, శ్రేయస్​ అయ్యర్​, మహమ్మద్​ సిరాజ్​ , బుమ్రా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే​ ఉంది. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి అభినవ్​ మనోహర్ పేరు చేరనుందా..

గుజరాత్​ టైటాన్స్.. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ​2.6 కోట్లకు అభినవ్​ మనోహర్​ను దక్కించుకొంది. గతేసీజన్​లో ఏడు ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్​ చేయగా.. ఈ సీజన్​లో ఇప్పటివరకు నాలుగు సార్లు బ్యాటింగ్​కు దిగాడు. మొత్తం 11 ఇన్నింగ్స్​లు ఆడిన అభినవ్​ 159 స్ట్రయిక్​రేట్​తో 194 పరుగులు చేశాడు. తాజాగా ముంబయితో మ్యాచ్​లో 21 బంతుల్లోనే 42 రన్స్​ చేశాడు. ఇందులో బౌండరీల ద్వారానే 30 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్​లో గుజరాత్​ 200 పైచిలుకు పరుగులు చేయడంలో అభినవ్​ది కీలక పాత్ర.

టీమ్​ఇండియాను ఎప్పటి నుంచో మిడిలార్డర్​ సమస్య వేధిస్తోంది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఆయా ఆటగాళ్లను పరిశీలించినా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. భారత యువ క్రికెటర్లు షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, రియాన్ పరాగ్, అబ్దుల్ సమద్ వంటి వారు అభినవ్ కంటే ముందు వరసలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వీరెవరూ గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన చూపలేదు. టీ20ల్లో టీమ్​ఇండియాకు మిడిలార్డర్​తో పాటు మంచి ఫినిషర్​గా ఆ స్థానాన్ని భర్తీ చేయగల ప్లేయర్​ ఇంతవరకు రాలేదు. దీంతో ఇప్పుడు అభినవ్ గురించి పలువురు చర్చిస్తున్నారు.

అభినవ్​ మనోహర్​ మ్యాన్​ అఫ్ ది మ్యాచ్
అభినవ్​ మనోహర్​ మ్యాన్​ అఫ్ ది మ్యాచ్

ఇంతకీ ఎవరీ మనోహర్....

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అభినవ్​ 2021లో 27 ఏళ్ల యువకుడిగా దేశీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు 160 స్ట్రైక్ రేట్‌తో 488 పరుగులు చేసి... మిడిలార్డర్​ బ్యాటర్​గా పర్వాలేదనిపించాడు. ఐపీఎల్​లో గతేడాది నుంచి గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. అయితే తాజాగా మ్యాచ్​లో చేసిన ప్రదర్శనతో పాటు దేశవాలీ క్రికెట్​లో ఆడిన రెండు కీలక ఇన్నింగ్స్​లే ఈ చర్చకు సరైన సమాధానం అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఆ ఇన్నింగ్స్​ ఏంటంటే...

1. అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్​లోని అభినవ్ ఇన్నింగ్స్​. ఈ మ్యాచ్​లో అతడు పియూష్ చావ్లా, గ్రీన్‌ బౌలింగ్​లో భారీ సిక్సర్లు బాదాడు. డెత్ ఓవర్లో గుజరాత్ రన్​రేట్​ పెరగడంలో అతడు కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

2. 2021లో దిల్లీ వేదికగా సయ్యద్​ ముస్తక్​ అలీ ట్రోర్నీ క్వార్టర్-ఫైనల్‌లో కర్ణాటక సౌరాష్ట్రతో తలపడింది. ఈ మ్యాచ్​ ఛేదనలో కర్ణాటక 34-3తో కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్​కు వచ్చాడు అభినవ్​. ఈ మ్యాచ్​లో అభినవ్ 49 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేసి తన జట్టును సెమీస్​కు చేర్చాడు. కాగా ఈ మ్యాచ్​లో అభినవ్... అనుభవజ్ఞులైన జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియాల బౌలింగ్ ఎదుర్కోవడం విశేషం.

3. 2022లో ఈడెన్​ గార్డెన్​ వేదికగా సయ్యద్​ ముస్తక్​ అలీ ట్రోర్నీలో భాగంగా కర్ణాటక కోల్​కతా మధ్య పోరులో అభినవ్ 29 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. జట్టు ఒక దశలో 18-3 స్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు మైదానంలో తుఫాను ఇన్నింగ్స్​తో చెలరేగాడు. తమ జట్టును విజయం అంచుల దాకా తీసుకెళ్లి.. ప్రత్యర్థుల వెన్నులో ఓటమి భయం పుట్టించాడు.

ఇలా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి మిడిలార్డర్​లో రాణించిన అభినవ్​ ఆటతీరు.. అందర్నీ అతడి వైపు తిప్పుకుంటోంది. భవిష్యత్​లో ఇలాంటి ప్రదర్శనలు చేసి టీమ్​ఇండియాలోకి రావాలంటూ క్రికెట్​ ప్రేమికులు ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.