ETV Bharat / sports

అంచనాలకు మించి అదరగొట్టిన గుజరాత్​.. హార్దిక్‌ కెప్టెన్సీ అదుర్స్​

author img

By

Published : May 30, 2022, 6:58 AM IST

Updated : May 30, 2022, 2:25 PM IST

ఇదేం జట్టు.. ఒక్క పెద్ద స్టార్‌ అయినా ఉన్నాడా? ఫామ్‌లో లేని క్రికెటర్లే ఎక్కువ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూర్పు కుదిరేనా? హార్దిక్‌ పాండ్య కెప్టెనా? సారథిగా అనుభవం లేని అతని చేతికి పగ్గాలు ఎందుకు? అసలే కొత్త జట్టు.. పెద్ద పెద్ద ప్రత్యర్థులతో తలపడి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ తమ ప్రదర్శనతో వాటన్నింటికీ దిమ్మతిరిగేలా గుజరాత్‌ సమాధానమిచ్చింది. టీ20 లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి తన ప్రయాణాన్ని ఘనంగా మొదలెట్టింది.

Gujarat titans
గుజరాత్

ఈ ఏడాది పది జట్లతో టీ20 లీగ్‌ సరికొత్తగా మారింది. గుజరాత్‌, లఖ్‌నవూ లీగ్‌లో అడుగుపెట్టాయి. కానీ పాత జట్లతో పోటీపడి ఇవి ఏ మేరకు నెగ్గుకు రాగలవనే సందేహాలు కలిగాయి. ముఖ్యంగా గుజరాత్‌ విజేతగా నిలుస్తుందని సీజన్‌ ఆరంభానికి ముందు ఎవరూ ఊహించి ఉండరు. కానీ సమష్టి కృషితో, తిరుగులేని ప్రదర్శనతో, పక్కా ప్రణాళికలతో అంచనాలను దాటి అదరగొట్టింది. ముందుగానే హార్దిక్‌, శుభ్‌మన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌లను జట్టులోకి తీసుకున్న గుజరాత్‌.. వేలం సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇటీవల పెద్దగా ఫామ్‌లో లేకపోయినా మిల్లర్‌, సాహా, ఫెర్గూసన్‌, షమి లాంటి ఆటగాళ్లపై నమ్మకం పెట్టింది. ఫినిషర్‌గా రాహుల్‌ తెవాతియా ప్రతిభను గుర్తించి ఏకంగా రూ.9 కోట్లకు దక్కించుకుంది. ఇక లీగ్‌లో అడుగుపెట్టాక బ్యాటింగ్‌లో హార్దిక్‌ (15 మ్యాచ్‌ల్లో 487 పరుగులు), గిల్‌ (16 మ్యాచ్‌ల్లో 483), మిల్లర్‌ (16 మ్యాచ్‌ల్లో 481) జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కొంచెం ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన సాహా (11 మ్యాచ్‌ల్లో 317 పరుగులు).. ఆరంభం నుంచి ఆడించనందుకు జట్టు యాజమాన్యం చింతించేలా చేశాడు. బౌలింగ్‌లో పేసర్‌ షమి, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కీలక ప్రదర్శన చేశారు. ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన షమి (16 మ్యాచ్‌ల్లో 20) ఆరంభ, ఆఖరి ఓవర్లలో గొప్పగా రాణించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫెర్గూసన్‌ (13 మ్యాచ్‌ల్లో 12) కూడా సత్తా చాటాడు. ఇక మధ్య ఓవర్లలో రషీద్‌ ఖాన్‌ (16 మ్యాచ్‌ల్లో 19) ఎప్పటిలాగే తన స్పిన్‌తో మాయ చేశాడు.

హార్దిక్‌ 2.0: టీమ్‌ఇండియాకు మరో కపిల్‌దేవ్‌ అవుతాడంటూ కెరీర్‌ ఆరంభంలో హార్దిక్‌పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతని ప్రదర్శన పడిపోతూ వచ్చింది. బ్యాటింగ్‌లో వైఫల్యం, బౌలింగ్‌ చేయలేకపోవడంతో జట్టులో చోటు పోయింది. టతీ20 లీగ్‌లోనూ ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో అతణ్ని జట్టులోకి తీసుకున్న గుజరాత్‌ ఏకంగా కెప్టెన్‌గా నియమించి ఆశ్చర్యపరిచింది. అప్పటివరకూ అతనికి సారథిగా అనుభవం లేకపోయినా జట్టు మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టిన నమ్మకాన్ని హార్దిక్‌ నిలబెట్టాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గా త్రిపాత్రాభినయం పోషించాడు. బ్యాటింగ్‌లో రాణించి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. జట్టుకు అవసరమైన సమయంలో క్రీజులో నిలబడ్డాడు. జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంతితోనూ ఆకట్టుకున్నాడు. గాయం భయంతో మధ్యలో అయిదు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ వేయలేకపోయాడు. కానీ ప్లేఆఫ్స్‌కు ముందు తిరిగి బంతి అందుకున్న అతను ఫైనల్లో నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా జట్టును గెలిపించే ప్రదర్శన చేశాడు. ఇక కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. సహచరులను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలబడ్డాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ భారత కెప్టెన్‌ అంటూ అతణ్ని కొనియాడుతున్నారు.

ముగింపు అదుర్స్‌..: టీ20 మ్యాచ్‌లో ఒక్క ఓవర్లోనే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. అలాంటి ఓవర్లు గుజరాత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో, తీవ్ర ఒత్తిడిలో మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌ లాంటి ఆటగాళ్లు ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో తెవాతియా ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టును గెలిపించాడు. చెన్నైతో పోరులో ముందు మిల్లర్‌.. చివర్లో రషీద్‌ సంచలన ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఛేదనలో 8 మ్యాచ్‌లకు గాను ఏడు మ్యాచ్‌ల్లోనూ చివరి ఓవర్లోనే గుజరాత్‌ గెలిచింది. పెద్దగా అంచనాల్లేకుండా ఈ సీజన్‌లో అడుగుపెట్టిన మిల్లర్‌ సరైన సమయంలో ఫామ్‌ అందుకోవడం మేలు చేసింది. టీ20 లీగ్‌లో దాదాపు పదేళ్లుగా ఆడుతున్న మిల్లర్‌.. ఈ సారి ఎప్పుడూ లేనంత నిలకడ ప్రదర్శించాడు. ఎప్పుడూ బౌలింగ్‌తో బ్యాటర్లకు కళ్లెం వేసే రషీద్‌.. ఈ సారి తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను మరింతగా బయటకు తెచ్చాడు. ఇక కిర్‌స్టెన్‌, ఆశిష్‌ నెహ్రాలతో కూడిన కోచింగ్‌ విభాగం ఆ జట్టుకు పెద్ద బలం. కోచ్‌గా టీమ్‌ఇండియాను 2011 ప్రపంచకప్‌ విజేతగా నిలిపిన కిర్‌స్టెన్‌.. ఇప్పుడు తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటిల్‌ నెగ్గడంలో ప్రధాన భూమిక పోషించాడు. గిల్‌కు తోడుగా సాహాను ఓపెనింగ్‌కు పంపించడం, బ్యాటింగ్‌ ఆర్డర్లో హార్దిక్‌ను ముందుకు తేవడం, పరిస్థితులకు తగ్గట్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.. ఇలా జట్టు కోసం తెరవెనక కోచింగ్‌ సిబ్బంది బాగానే తోడ్పాటునందించారు.

ఇదీ చదవండి: అరంగేట్రంలోనే కప్​ కొట్టిన గుజరాత్​... రాజస్థాన్​కు నిరాశ

Last Updated :May 30, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.