ETV Bharat / sports

'ముంబయి​ జట్టు నాకెప్పటికీ ప్రత్యేకమే'

author img

By

Published : Feb 19, 2021, 1:10 PM IST

చిన్ననాటి నుంచి తనకు ముంబయి జట్టంటే ప్రత్యేక అభిమానమని అన్నాడు సచిన్ తనయుడు అర్జున్​ తెందూల్కర్​. ప్రస్తుత ఐపీఎల్​లో తాను అదే జట్టు తరఫున ఆడనుండడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. టీమ్​లో ఆడేందుకు తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.

Arjun Tendulkar opens up after Mumbai Indians pick him in the auction
'ముంబయి​ జట్టు నాకెప్పటికీ ప్రత్యేకమే!'

క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలం గురువారం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అనూహ్య ధర పలకగా, మరికొందరు ఊహించిన దానికంటే మరీ తక్కువ మొత్తానికి పరిమితమయ్యారు. ఏయే ఆటగాడికి ఎంత మొత్తం పెట్టాలనే స్పష్టమైన ప్రణాళికలతో వేలంలో పాల్గొన్న ఆయా ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంతైనా పెట్టి కొనుగోలు చేశాయి.

ఈ క్రమంలోనే ఐపీఎల్‌ వేలంలో తొలిసారి పాల్గొన్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌పై అభిమానులు ఆసక్తి చూపించారు. అతడిని ఎవరు తీసుకుంటారు? ఎంత మొత్తం ధర పలుకుతాడనే విషయాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, అందరూ ఊహించినట్లే ముంబయి ఇండియన్స్‌ అర్జున్‌ను తన కనీస ధర రూ.20 లక్షలకే తీసుకుంది. ఇతర జట్లు అతడిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో తొలిసారి వేలంలో పాల్గొన్న అర్జున్‌ తెందూల్కర్‌ సొంతగూటికే చేరాడని అభిమానులు భావిస్తున్నారు.

ఇక గురువారం సాయంత్రం వేలం ముగిశాక అర్జున్‌ మాట్లాడిన ఓ వీడియోను ముంబయి టీమ్‌ తమ ట్విట్టర్‌లో పంచుకుంది.

"చిన్నప్పటి నుంచీ నాకు ముంబయి జట్టంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లకు, జట్టు యాజమాన్యానికి, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ జట్టుతో కలిసి ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా."

- అర్జున్​ తెందూల్కర్​, సచిన్​ తనయుడు

ఇక అర్జున్​ను తమ జట్టులోకి తీసుకోవడంపై ముంబయి టీమ్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ సైతం ఓ వీడియోలో మాట్లాడారు.

అర్జున్‌ నైపుణ్యాల గురించి మహేలా జయవర్ధనె, జహీర్‌ఖాన్‌ తమకు ముందే చెప్పారని ఆకాశ్‌ పేర్కొన్నారు. సచిన్‌ తనయుడు ఎడమచేతివాటం ఫాస్ట్‌బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ అని వివరించారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలా ఎక్కువ మంది లేరని చెప్పుకొచ్చారు. ఇతర యువ ఆటగాళ్లలాగే అర్జున్‌ కూడా ఈ స్థాయికి చేరుకున్నాడన్నారు. ఇక తమ జట్టులో ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి వారిలోని అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తీస్తామని తెలిపారు. అయితే, అదంతా ఆయా ఆటగాళ్లు కష్టపడటంపైనే ఆధారపడి ఉంటుందని, అందుకోసం తగిన ఏర్పాట్లు తాము చేస్తామని వివరించారు. భవిష్యత్‌లో అర్జున్‌ కూడా ఇతరుల్లాగే మెరుగైన క్రికెటర్‌గా తయారవుతాడని ఆకాశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'అర్జున్​ ఎదగడానికి ముంబయి జట్టే సరైనది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.