ETV Bharat / sports

IPL 2022 Teams: ఐపీఎల్‌.. ఈ మూడు జట్లకు కెప్టెన్లు వీరేనా..?

author img

By

Published : Feb 14, 2022, 10:53 PM IST

ipl 2021 Teams
ఐపీఎల్ 2022

IPL 2022 Teams: గత కొన్ని రోజుల నుంచి అభిమానుల్లో ఆసక్తిరేపిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) మెగా వేలం రెండు రోజులపాటు కోలాహలంగా జరిగింది. మొత్తం పది ఫ్రాంచైజీలు దాదాపు రూ. 550 కోట్లకుపైగా ఖర్చు చేసి 204 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఏడు జట్లు తమ సారథులను ఎంపిక చేసుకోగా.. ఇంకో మూడు ఫ్రాంచైజీలు మాత్రమే కెప్టెన్‌ ఎవరనేది ప్రకటించాల్సి ఉంది. మరి ఆ మూడు ఫ్రాంచైజీలు ఏవి.. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు ఆ జట్లలో ఎవరున్నారనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం..

IPL 2022 Teams: ఐపీఎల్ 2022లో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను సెలెక్ట్​ చేసుకున్నాయి. ఈ క్రమంలో ఏడు జట్లు తమ సారథులను ఇప్పటికే ఎంపిక చేశాయి. ఇంకో మూడు ఫ్రాంచైజీలు మాత్రమే కెప్టెన్‌ ఎవరనేది ప్రకటించాల్సి ఉంది. మరి ఆ మూడు ఫ్రాంచైజీలు ఏవి.. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు ఆ జట్లలో ఎవరున్నారనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం..

కెప్టెన్‌ను వదిలేసుకుంది.. వేలంలో వద్దనుకుంది

IPL 2022 KKR: గత సీజన్‌లో ఫైనల్‌కు వెళ్లిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైంది. వ్యక్తిగతంగా రాణించని ఇయాన్ మోర్గాన్‌.. నాయకత్వపరంగా కేకేఆర్‌ను అద్భుతంగా నడిపించాడు. అయితే ఫామ్‌లేక ఇబ్బంది పడిన మోర్గాన్‌ను రిటెయిన్‌ చేసుకోకుండా కేకేఆర్‌ వదిలేసుకుంది. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపలేదు. ఇదే క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ను రూ. 12.25 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకుంది. శ్రేయస్‌కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే రిటెయిన్‌ చేసుకున్నవారిలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌, అజింక్య రహానె వంటి సీనియర్లు.. మరోవైపు ప్యాట్‌ కమిన్స్‌, నితీశ్ రాణా, టిమ్‌ సౌథీ ఉన్నా.. ఫ్రాంచైజీ మాత్రం శ్రేయస్‌ వైపే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌ 2020వ సీజన్‌లో దిల్లీని ఫైనల్‌కు చేర్చిన అనుభవం శ్రేయస్‌ సొంతం. ఇటీవల ఫామ్‌ను చూసినా మెరుగ్గానే ఉన్నాడు.

ఏ ఓపెనర్‌ సారథి అవుతాడో..?

IPL 2022 Punjab Kings: ఐపీఎల్ మెగా వేలంలో చాలా తెలివిగా ఆటగాళ్లను ఎంచుకున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. కేఎల్‌ రాహుల్‌ను వదిలేసుకుని మయాంక్‌ అగర్వాల్, అర్ష్‌దీప్‌ సింగ్‌లను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. దీంతో కేఎల్‌ రాహుల్‌ లఖ్‌నవూ జట్టుకు కెప్టెన్‌గా వెళ్లిపోయాడు. మెగా వేలంలో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్ (రూ.8.25 కోట్లు)‌, ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), లియామ్‌ లివింగ్‌ స్టోమ్‌ (రూ.11.50 కోట్లు)లను దక్కించుకుంది. అయితే ఇందులో శిఖర్‌ ధావన్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. మయాంక్‌తో సహా వీరందరూ ఓపెనర్లే కావడం విశేషం. యువ క్రికెటర్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించాలని భావిస్తే మాత్రం మయాంక్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. సీనియర్‌కు అయితే తొలి వరుసలో ధావన్ ఉంటాడు. విదేశీ క్రికెటర్‌కు అయితే లివింగ్‌ స్టోన్‌కు అవకాశం దక్కొచ్చు. మరి పంజాబ్‌ యాజమాన్యం, మెంటార్‌ అనిల్‌ కుంబ్లే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

అందరూ స్టార్లే.. మరోసారి మాజీ కెప్టెన్‌కు తప్పదా..?

ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తికరమైన జట్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ముందు వరుసలో ఉంటుంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్‌ సీనియర్‌ ఆటగాళ్లు. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను వదిలేశాడు. డుప్లెసిస్‌ (36), కార్తిక్‌ (37) అధిక వయస్సు కలిగిన వారు. ఇక మ్యాక్స్‌వెల్‌కు కూడా 33 ఏళ్లు వచ్చేశాయి. మిగతావారిలో సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగ, హేజిల్‌వుడ్‌, షాబాజ్‌ అహ్మద్ మాత్రమే అభిమానులకు పరిచయం ఉన్న పేర్లు. ఈ క్రమంలో మరోసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాలని ఆర్‌సీబీ యాజమాన్యం కోరే అవకాశం లేకపోలేదు. అప్పటికీ ససేమిరా అంటే మాత్రం మ్యాక్స్‌వెల్‌కు అదృష్టం కలిసొచ్చినట్లే. సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉన్నా నాయకత్వంలో అనుభవరాహిత్యం ఉండటం వల్ల వచ్చే సీజన్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: సురేష్ రైనాను అందుకే తీసుకోలేదు: సీఎస్కే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.