ETV Bharat / sports

IPL eliminator 2022: బెంగళూరు లక్కా.. లఖ్​నవూ మ్యాజిక్కా..?

author img

By

Published : May 25, 2022, 12:02 PM IST

ipl eliminator 2022
ఐపీఎల్ ఎలిమినేటర్​

IPL 2022: తమ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ ఒకటి.. కాస్త అదృష్టం కలిసొచ్చి ఇతర జట్ల ఫలితంపై ఆధారపడి మరీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్టేమో మరొకటి. ఈ క్రమంలో మే 25న (బుధవారం) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్‌లో ఓడిన రాజస్థాన్‌తో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. మరి ఎలిమినేటర్‌లో తలపడే ఆ జట్లేవి.. వాటి బలాలు, బలహీనతలు, ఆటగాళ్ల ఫామ్‌ వంటి విషయాలను ఓ సారి పరిశీలిద్దాం..

IPL Eliminator match: మెగా టీ20 టోర్నీలో సుదీర్ఘంగా జరిగిన లీగ్‌ దశ ముగిసింది. తొలి క్వాలిఫయిర్‌లో రాజస్థాన్‌పై గుజరాత్‌ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓడిన రాజస్థాన్‌కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్‌ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. లఖ్‌నవూ (3) - బెంగళూరు (4) జట్ల మధ్య ఇవాళ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది.

ఛేజింగ్‌లో బహు జాగ్రత్త లఖ్‌నవూ..: ప్రస్తుత సీజన్‌లో శతకాలను సాధించిన వీరుల్లో కేఎల్ రాహుల్ రెండో ఆటగాడు. బట్లర్ (3) తర్వాత అత్యధికంగా రెండు సెంచరీలను రాహుల్ బాదాడు. లీగ్‌ దశలో 14 మ్యాచులకుగాను 9 విజయాలు సాధించి ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, డికాక్, దీపక్‌ హుడా, స్టొయినిస్‌, కృనాల్ పాండ్య, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని వంటి బ్యాటింగ్‌ దళంతో లఖ్‌నవూ అద్భుత విజయాలను సాధించింది. అయితే ఛేజింగ్‌లో టాప్‌ఆర్డర్‌ చేతులెత్తేయడంతో మిడిల్, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీంతో నాలుగు మ్యాచ్‌లను ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్టొయినిస్, హోల్డర్‌, దీపక్‌, బదోని రాణిస్తున్నా ఓటమి తప్పలేదు. కాబట్టి నాకౌట్‌ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన ఇంటి ముఖం పట్టక తప్పదు.

ఇక టాప్‌స్కోరర్‌ జాబితాలో రాహుల్ (537) రెండో స్థానం, డికాక్ (502) మూడో స్థానంలో ఉన్నారు. ఇక మిడిలార్డర్‌ బ్యాటర్ దీపక్‌ హుడా (406) కూడా టాప్‌-10లో ఉండటం విశేషం. బౌలింగ్‌ విభాగానికి వస్తే చమీర, అవేశ్‌ ఖాన్‌, మోహ్‌సిన్‌ ఖాన్‌, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్‌, హోల్డర్‌, స్టొయినిస్‌ కలిసి కట్టుగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. వీరిలో అవేశ్‌ ఖాన్ (17) ఒక్కడే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా టాప్‌-10లో చోటు సంపాదించాడు. జాసన్ హోల్డర్ (14), మోహ్‌సిన్ ఖాన్‌ (8 మ్యాచుల్లోనే 13 వికెట్లు), రవి బిష్ణోయ్ (12), కృనాల్ పాండ్య (9), చమీర (9) రాణించారు. లఖ్‌నవూలో దీపక్‌ హుడా, జాసన్‌ హోల్డర్, స్టొయినిస్‌, కృనాల్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం.

ipl eliminator 2022
ఐపీఎల్ ఎలిమినేటర్​

ఈసాలా కప్‌ నమదే.. సాధించాలంటే..: ఈసాలా కప్‌ నమదే.. నినాదంతో బెంగళూరు అభిమానులు ప్రతి సీజన్‌కు రావడం.. వెనుదిరగడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత సీజన్‌లోనూ లీగ్‌ దశకే పరిమితమై ఇంటిముఖం పడుతుందని భావించినా ఆఖరికి దిల్లీపై ముంబయి విజయంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుని ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. నాలుగో స్థానంతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూతో తలపడనుంది. జట్టును చూస్తే తక్కువ అంచనా వేయడానికి వీల్లేని విధంగా ఉంది. కానీ మైదానంలో తేలిపోతుండటమే అసలు సమస్య. మరి అదృష్టం కలిసొచ్చి నాకౌట్‌కు చేరుకున్న బెంగళూరు అభిమానుల చిరకాల అభీష్టాన్ని తీర్చాలంటే ఇక కష్టపడాల్సిందే.

ipl eliminator 2022
ఐపీఎల్ ఎలిమినేటర్​

బ్యాటింగ్‌పరంగా చూస్తే ఆరంభంలో కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అదరగొట్టాడు. తర్వాత నుంచి తన స్థాయి ఆటను ఆడలేకపోయాడు. ఇక మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఒకటి అరా మ్యాచుల్లో తప్ప పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే బ్యాటింగ్‌లో మిడిల్‌, లోయర్‌ఆర్డర్‌ను సమన్వయం చేసుకుంటూ దినేశ్‌ కార్తిక్‌ రెచ్చిపోయాడు. 14మ్యాచుల్లో 191.33 స్ట్రైక్‌రేట్‌తో 287 పరుగులు సాధించాడు. అయితే కార్తిక్‌ మాత్రమే కాకుండా మిగతా బ్యాటర్లూ లఖ్‌నవూతో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాణించాల్సిందే. లేకపోతే గెలవడం అంత సులువేం కాదు. బౌలింగ్‌లో బెంగళూరు పరిస్థితి ఫర్వాలేదు. వహిండు హసరంగ (24) మోస్ట్‌ వికెట్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హర్షల్‌ పటేల్ (18), జోష్ హేజిల్‌వుడ్ (15) కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మద్‌ సిరాజ్ (8) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. షాహ్‌బాజ్‌ ఆల్‌రౌండ్ పాత్రను సమర్థంగా పోషించాలి.

ఒకేసారి తలపడ్డాయి.. పైచేయి ఎవరిదంటే?: ప్రస్తుత సీజన్‌లో లఖ్‌నవూ, బెంగళూరు ఒకే ఒక సారి తలపడ్డాయి. అందులోనూ బెంగళూరుదే పై చేయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు డుప్లెసిస్‌ (96) విజృంభించడంతో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 163/8 స్కోరుకే పరిమితమై 18 రన్స్‌తో ఓటమిపాలైంది. కృనాల్ పాండ్య (42), కేఎల్ రాహుల్ (30), మార్కస్ స్టొయినిస్ (24) ఫర్వాలేదనిపించారు. కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో లఖ్‌నవూకు ఓటమి తప్పలేదు. జోష్‌ హేజిల్‌వుడ్‌ (4/25) అదరగొట్టేశాడు. మరోసారి లఖ్‌నవూ-బెంగళూరు జట్లు తలపడనున్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారో.. క్వాలిఫయర్‌-2లోకి వెళ్లి అక్కడా గెలిచి ఫైనల్‌కు ఎవరు చేరుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ipl eliminator 2022
ఐపీఎల్ ఎలిమినేటర్​

ఇదీ చదవండి: వచ్చే ఐపీఎల్​ సీజన్​కు ఈ ఐదుగురు ఆటగాళ్లు డౌటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.