ETV Bharat / sports

తలపట్టుకున్న సీఎస్​కే! చాహర్​ స్థానంలో అతడేనా?

author img

By

Published : Mar 3, 2022, 1:45 PM IST

Deepak Chahar: డిఫెండింగ్​ ఛాంపియన్స్​ చెన్నైసూపర్​ కింగ్స్​కు వెన్నెముకగా నిలిచిన దీపక్​ చాహర్​ గాయంతో దూరమవడం.. ఆ జట్టు కూర్పును క్లిష్టతరం చేసింది. బ్యాటుతోనూ సత్తాచాటగల అతడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు! కానీ, అతడు సీజన్​ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్న వేళ.. సీఎస్​కే మరో ముగ్గురిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరంటే..

IPL 2022
Deepak Chahar

Deepak Chahar: ఐపీఎల్​ 2022లో అధిక భాగానికి దీపక్​ చాహర్ అందుబాటులో ఉండకపోవడం చెన్నై సూపర్​కింగ్స్​కు పెద్ద ఎదురుదెబ్బ! గత నెల వెస్టిండీస్​తో చివరిదైన మూడో టీ20లో బౌలింగ్ సందర్భంగా అతడి కుడి తొడ కండరానికి గాయమైంది. దీంతో ప్రస్తుత శ్రీలంక సిరీస్​కూ దూరమయ్యాడు చాహర్​. అయితే అతడు ఐపీఎల్​ పూర్తి సీజన్​కూ అందుబాటులో ఉండకపోవచ్చని తాజా సమాచారం.

ఐపీఎల్ మెగావేలంలో రూ.14 కోట్లు పెట్టి చాహర్​ను తిరిగి దక్కించుకుంది సీఎస్​కే. దీంతో ఇషాన్​ కిషన్ (ముంబయి ఇండియన్స్​-రూ.14.25 కోట్లు)​ తర్వాత వేలంలో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా అతడు నిలిచాడు. బహుముఖ ప్రజ్ఞావంతుడైన చాహర్​ సేవలు లభించకపోవడం కచ్చితంగా చెన్నైకి నష్టమే!

చెన్నై ప్రధాన అస్త్రం అతడు!

గతేడాది చెన్నై తన నాలుగో ఐపీఎల్​ టైటిల్ గెలవడంలోనూ దీపక్​ చాహర్​ కీలకపాత్ర పోషించాడు. కొత్త బంతితో పవర్​ప్లేలో వికెట్​ తీయగల నైపుణ్యం అతడి సొంతం. ప్రత్యర్థి టాప్​ ఆర్డర్​ బ్యాటర్లను పెవిలియన్​ చేర్చడం, కీలక సమయాల్లో బ్యాట్​ ఝుళిపించడం అతడి ప్రత్యేకత. అందుకే చాహర్​ స్థానాన్ని భర్తీ చేయడం చెన్నైకి సవాలుగా మారింది.

చాహర్​ కాకుండా సీఎస్​కేలో డ్వేన్​బ్రావో, క్రిస్ జోర్డాన్, ఆడం మిల్నే, తుషార్ దేశ్​పాండే, కేఎం అసిఫ్, సిమర్​జీత్​ సింగ్, ముకేశ్ చౌదరి, రాజ్​వర్ధన్​ హంగార్గేకర్​ లాంటి పేసర్లు ఉన్నారు. శివం దుబే, డ్వేన్ ప్రిటోరియస్ వంటి ఆల్​రౌండర్లు ఉన్నారు.

చాహర్​ గనుక పూర్తి సీజన్​కు దూరమైతే అతడి స్థానంలో వేరొక ప్లేయర్​ను తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాట్​తోనూ రాణించగల పేసర్​ లభించడం కష్టమే అయినా ఈ కింది ముగ్గురిని అతడి స్థానంలో తీసుకునే అవకాశముంది.

ఇషాంత్ శర్మ..

IPL 2022
ఇషాంత్

వేలంలో ఇషాంత్​ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కొన్నేళ్లుగా ఐపీఎల్​లోనూ అతడు పెద్దగా రాణించలేదు. అయితే ఇషాంత్​ అనుభవం, యుక్తి ఉపయోగపడుతుందని ధోని, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ భావించవచ్చు. గత సీజన్​లో ఉతప్ప లాగనే ఇతడినీ ఉపయోగించుకునే అవకాశముంది. లెఫ్ట్​ హ్యాండ్​ బ్యాటర్లకు ఇషాంత్​ లైన్​ అండ్​ లెంగ్త్​ ప్రమాదకరమే!

అర్జాన్ నగ్వస్​వాలా..

IPL 2022
అర్జాన్

దేశవాళీ క్రికెట్​లో అత్యంత ప్రతిభావంతుడైన రేపటి తరం పేసర్​.. అర్జాన్. గుజరాత్​కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్​ సీమర్​.. విదేశాల్లో టీమ్​ఇండియాకు నెట్​బౌలర్​గానూ సేవలందించాడు. ఇప్పటివరకు ఆడిన 20 టీ20ల్లో 28వికెట్లు తీశాడు. అందులో ఒకసారి 6 వికెట్లు పడగొట్టాడు.

సందీప్ వారియర్​..

IPL 2022
సందీప్ వారియర్

సందీప్​ కూడా మెగావేలంలో అన్​సోల్డ్​గా మిగిలాడు. అతడి స్వింగ్ నైపుణ్యం పవర్​ప్లేలో ఉపయోగపడుతుంది. తుది జట్టులో స్థానం లభించకున్నా.. బెంచ్​ బలంగా మారడంలో పనికొస్తాడు. ఆడిన 63 టీ20ల్లో అతడి ఎకానమీ రేట్​ 7.28గా ఉంది.

ఇదీ చూడండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్‌లోకి సురేశ్ రైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.