ETV Bharat / sports

ఆర్సీబీ X దిల్లీ: రెండో స్థానంలో నిలిచేది ఎవరు?

author img

By

Published : Nov 2, 2020, 5:31 AM IST

ప్లేఆఫ్స్​లో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో బెంగళూరు-దిల్లీ తలపడనున్నాయి. అబుదాబి ఈ పోరు జరగనుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Top-two finish at stake as RCB and DC aim to arrest slide
ఆర్సీబీXదిల్లీ: రెండో స్థానంలో నిలిచేది ఎవరు?

ఐపీఎల్ లీగ్ మ్యాచ్​లు తుదిదశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్స్​లో చోటు కోసం పోటీ మరింత రసవత్తరంగా మారింది. అగ్రస్థానంలో ముంబయి ఇండియన్స్​ ఇప్పటికే అర్హత సాధించగా.. రెండో స్థానం కోసం బెంగళూరు, దిల్లీ మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే మ్యాచ్​లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముఖ్యంగా రెండో స్థానంలో పాగా వేసేందుకు వీళ్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఓడినా ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. కానీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. రెండు జట్లూ వరుస ఓటములతో డీలాపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్నాయి. అబుదాబి వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

దిల్లీ గాడినా పడేనా?

లీగ్ ప్రారంభంలో అదరగొట్టిన దిల్లీ.. చివరి నాలుగు మ్యాచ్​ల్లో వరుసగా ఓడిపోయింది. దీంతో తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకునే పనిలో పడింది. గత మ్యాచ్​లో ముంబయి చేతిలో ఓటమిపాలైన శ్రేయస్ సేన బ్యాటింగ్ లైనప్​పై మరింత దృష్టిపెట్టాలని భావిస్తోంది. ఓపెనర్లు కాంబో సరిగ్గా కుదరడం లేదు. ధావన్​తో కలిసి పృథ్వీ షా, రహానె బరిలో దిగినా అనుకున్నంతగా రాణించలేకపోయారు. ధావన్ కూడా వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన తర్వాత మూడు మ్యాచ్​ల్లో వరుసగా 0,0,6 పరుగులతో నిరాశపర్చాడు. పంత్​, శ్రేయస్, స్టోయినిస్ గాడినపడాల్సిన అవసరం ఉంది.

బెంగళూరు గెలిచేనా?

బెంగళూరు పరిస్థితి దిల్లీలానే ఉంది. ప్రారంభంలో వరుస విజయాలతో జోరుచూపించిన కోహ్లీసేన.. చివరి మూడు మ్యాచ్​ల్లో ఓడింది. కోహ్లీ, డివిలియర్స్​పైనే ఆధారపడిందని మరోసారి నిరూపితమైంది. వీరిద్దరూ గత రెండు మ్యాచ్​ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఫించ్ స్థానంలో ఓపెనర్​గా దిగిన ఫిలిప్పీ పర్వాలేదనిపిస్తున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. మిడిలార్డర్​లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో చాహల్ మినహాయిస్తే అందరూ తేలిపోతున్నారు. మిగిలిన వారు కూడా రాణించాల్సిన అవసరం ఉంది.

టాస్ గెలిస్తే బౌలింగే?

యూఏఈలో వాతావారణం చల్లగా మారుతోంది. దీంతో మ్యాచ్ గెలుపులో తేమ కీలక పాత్ర పోషించనుంది. రాత్రి సమయంలో తేమ వల్ల బంతిపై పట్టు సాధించడం బౌలర్లకు కష్టతరం. కాబట్టి టాస్​ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

జట్ల (అంచనా)

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్

ఫిలిప్పీ, దేవదత్ పడిక్కల్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఉదానా, సిరాజ్, సైనీ, చాహల్

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పంత్, హెట్​మెయర్, స్టోయినిస్, హర్షల్ పటేల్, ప్రవీణ్ దూబే, రబాడ, రవి అశ్విన్, అన్రిచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.