ETV Bharat / sports

స్పిన్నర్ల మాయ.. చివరి టీ-20లోనూ విండీస్ చిత్తు

author img

By

Published : Aug 8, 2022, 12:10 AM IST

విండీస్
విండీస్

IND vs WI 5th T20: విండీస్​తో జరిగిన చివరి టీ20లో కూడా టీమ్​ఇండియా ఆధిపత్యాన్ని చెలాయించింది. స్పిన్నర్ల ధాటికి 100 పరుగులకే విండీస్​ ఆలౌట్​ అయింది. రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

IND vs WI 5th T20: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఐదో టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి విండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్‌ను 4-1 తేడాతో చేజిక్కించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ (64; 40 బంతుల్లో 8×4,2×6) మెరుపు ఇన్నింగ్స్‌కు బౌలర్ల సమష్టి కృషి తోడవ్వడంతో ఫ్లోరిడా వేదికగా జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో విజయదుందుభి మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ జట్టు 100 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (11) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించారు. కానీ, డోమినిక్‌ డ్రేక్స్‌ వేసిన 4.3వ బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ఇషాన్‌.. పూరన్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్‌ హుడా (38)తో కలిసి శ్రేయస్‌ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. కానీ, హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో బ్రూక్స్‌ చేతికి చిక్కి దీపక్‌ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జట్టు స్కోరు 122 పరుగులు వద్ద శ్రేయస్‌ కాట్‌ అండ్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్‌ (15), హార్దిక్‌ పాండ్య (28), కార్తిక్‌ (12), అక్షర్‌ పటేల్‌ (9), ఆవేశ్‌ఖాన్‌ (1 నాటౌట్‌) పరుగులు చేశారు.

లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ జట్టు ఆదిలోనే బోల్తా పడింది. ఓపెనర్‌ జేసన్‌ హోల్డర్‌ పరుగులేమీ చేయకుండానే వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ బ్రూక్స్‌ (13)అక్షర్‌పటేల్‌ బౌలింగ్‌లో తక్కువ పరుగులకే స్టంపౌటయ్యాడు. హెట్మెయర్‌ (56) మినహా మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేదు.

ఇదీ చూడండి : పంత్​పై రోహిత్​ ఫైర్​.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.