ETV Bharat / sports

జట్టులో ఉన్న ఆ సమస్యను సిరాజ్​ పోగొట్టాడు: రోహిత్​

author img

By

Published : Jan 16, 2023, 7:26 AM IST

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్​ సిరాజ్​ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రదర్శనపై మాట్లాడారు. ఏం అన్నారంటే.

Rohith sharma siraj
జట్టులో ఉన్న ఆ సమస్యను సిరాజ్​ పోగొట్టాడు: రోహిత్​

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ ఇండియా 317 పరుగుల భారీ విజయం అందుకుంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో విరాట్‌ కోహ్లీ భారీ సెంచరీతో అదరగొట్టగా.. సిరాజ్‌ వండర్‌ఫుల్‌ ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్లు రోహిత్‌ శర్మ, డాసున్‌ శనక, సిరాజ్​ మాట్లాడారు.

"ఈ సిరీస్‌లో మా బౌలింగ్‌ అద్భుతం. కీలక సమయాల్లో మా బౌలర్లు వికెట్లు తీసి మ్యాచ్‌లు గెలిపించారు. బ్యాటర్లు అయితే సిరీస్‌ మొత్తం అదరగొట్టారు. వన్డేల్లో స్లిప్‌ ఫీల్డర్లను పెట్టి బౌలింగ్‌ చేయడం తక్కువ. కానీ సిరాజ్‌ బౌలింగ్‌లో వాడి చూసేసరికి స్లిప్‌ కార్డన్‌ పెట్టాలనిపించింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు ఐదో వికెట్‌ దక్కాలని చాలా కష్టపడ్డాం, కానీ రాలేదు"

- రోహిత్‌ శర్మ, టీమ్‌ ఇండియా కెప్టెన్‌

సిరాజ్‌ గురించి చెబుతూ... "గత కొన్నేళ్లుగా సిరాజ్‌లో చాలా మార్పు వచ్చింది. రోజురోజుకీ రాటుదేలుతున్నాడు. బంతిని చక్కగా స్వింగ్‌ చేస్తున్నాడు. బంతితో సిరాజ్‌ పరిగెత్తుకు వస్తుంటే అతనిలో కాన్ఫిడెన్స్‌ కనిపిస్తుంది. కొత్త కొత్త ట్రిక్స్‌తో పవర్‌ ప్లేలో వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. టీమ్‌ ఇండియాకు గతకొన్ని రోజులుగా ఉన్న పవర్‌ ప్లే వికెట్ల తీయలేకపోయే సమస్యను సిరాజ్‌ పోగొట్టాడు" అని రోహిత్‌ చెప్పాడు.

"ఈ పరాజయం మమ్మల్ని బాగా నిరాశాకు గురి చేస్తోంది. ఇలాంటి ఆట కావాలని మేం కోరుకోలేదు.. కానీ ఈ రోజు జరిగింది. సరైన ప్రారంభం దక్కినా.. దానిని కొనసాగించలేకపోతున్నాం. ఇలాంటి పిచ్‌ల మీద వికెట్లు ఎలా తీయాలి, పరుగులు ఎలా చేయాలి అనే విషయంలో మా టీమ్‌ ఇంకా చాలా నేర్చుకోవాలి. అయితే పాజిటివ్‌ క్రికెట్ ఆడాలి అని నేను మా టీమ్‌కి చెబుతాను"

- డాసున్‌ శనక, శ్రీలంక కెప్టెన్‌

ఇక ఈ మ్యాచ్​లో తాను ఐదు వికెట్ల కోసం చేసిన ప్రయత్నాల గురించి సిరాజ్ మాట్లాడాడు. "గత కొన్ని రోజులుగా నా రిథమ్‌ బాగుంది. నా ఆయుధం అవుట్‌స్వింగర్‌ అద్భుతంగా పని చేస్తోంది. కొత్తగా బంతిని లోపలకు మూవ్‌ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ రోజు నాలుగు వికెట్లు పడగొట్టడం చాలా ఆనందంగా ఉంది. ఐదో వికెట్‌ తీయడానికి చాలా ప్రయత్నించాను కానీ కుదర్లేదు. మనకు ఎంత రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుంది అంటారు కదా.. అలా ఈ రోజు నాకు నాలుగు వికెట్లే రాసి పెట్టున్నాయేమో. రోహిత్‌ కూడా ఐదు కోసం ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు" అని చెప్పాడు. కాగా, 391 పరుగుల విజయలక్ష్యంతో మూడో వన్డేలో బరిలోకి దిగిన శ్రీలంకను సిరాజ్‌ బేంబేలెత్తించాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో అవిష్క ఫెర్నాండోను పెవిలియన్‌కు పంపిన సిరాజ్‌.. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో కుశాల్‌ మెండీస్‌ను ఔట్‌ చేశాడు. నువనిదు ఫెర్నాండోను ఎనిమిదో ఓవర్‌లోను, హసరంగను పదో ఓవర్‌లోను సిరాజ్‌ పెవిలియన్‌కు పంపించాడు. తన ఆఖరి రెండు ఓవర్లలో ఆ ఐదో వికెట్‌ కోసం ట్రై చేసినా కసున్‌ రజిత, లహిరు కుమార ఆ అవకాశం ఇవ్వలేదు. ఆఖరి బంతికి అవకాశం వచ్చినా రివ్యూ తీసుకొని రజిత బతికిపోయాడు.

ఇదీ చూడండి: IND VS SL: మూడో వన్డేలో ఎన్ని రికార్డులో.. తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.