ETV Bharat / sports

భారత్ X ఇంగ్లాండ్​ - హర్మన్​ సేనకు పెద్ద సవాలే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 6:54 AM IST

Ind Vs Eng Women :భారత మహిళల క్రికెట్‌ జట్టు ముందు ఓ సవాల్‌ ఉంది. బలమైన ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైన వాంఖడే స్టేడియం పిచ్ ఎలా ఉందో తెలుసుకుందామా.

Ind Vs Eng Womens T20
Ind Vs Eng Womens T20

Ind Vs Eng Women : ఇప్పటి వరకు పురుషుల జట్టు టీ20ల్లో తమ సత్తా చాటగా.. ఇప్పుడు మహిళలు కూడా తామేంటో నిరూపించుకునేందుకు బరిలోకి దిగనున్నారు. ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్​లకు సిద్ధం కానున్నారు. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం జరగనుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలో భారత జట్టు ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ఫామ్​లో ఉంది. ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాకుండా బంగ్లాదేశ్‌పై 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇక సౌతాఫ్రికాలో జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ మహిళల జట్టు ఫైనల్స్​కు చేరింది.

మరోవైపు స్వదేశంలో ఇంగ్లాండ్‌పై భారత్‌కు అంత గొప్ప రికార్డేం నమోదు కాలేదు. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో కేవలం రెండే గెలిచింది. 2018లో చివరిగా ఆ జట్టుపై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రానున్న మ్యాచుల ద్వారా ఈ గణాంకాలను మెరుగుపరుచుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌, స్మృతి మంధానతో పాటు హర్మన్‌ప్రీత్‌ తప్పక రాణించాల్సి ఉంది. ఇటీవలే జరిగిన మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసింది.

'భారత్‌లో ఆడడం పెద్ద పరీక్షే'
భారత పిచ్‌లపై ఆడటం తమకో పెద్ద పరీక్ష అని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. "భారత పరిస్థితుల్లో ఆడి నేను నా ఆట తీరును చాలా మెరుగుపరుచుకున్నాను. ఏ క్రికెటర్‌కైనా ఇక్కడ పిచ్‌లపై ఆడటం ఓ పెద్ద సవాల్‌. భారత్‌లో వేడి, ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కొంటూ మన నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది" అని నైట్‌ తెలిపింది.

అంతే కాకుండా వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అలాంటి పిచ్‌లే పోలి ఉన్న భారత్‌లో ఆడటం తమకు మేలు చేస్తుందని నైట్‌ వివరించింది. "ఆటను మెరుగుపరుచుకోవడానికి భారత్‌ సరైన వేదిక. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్‌ వేదిక బంగ్లాదేశ్‌లో పిచ్‌ల లాగే ఇక్కడి పిచ్‌లు కూడా ఉంటాయి" అని నైట్‌ తెలిపింది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత తేలికేం కాదని ఆమె తెలిపింది.

'భారత్‌ నిర్భయంగా ఆడాలి' : మరోవైపు ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు నిర్భయంగా ఆడాలని చీఫ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ అన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరగనున్న తొలి పోరుకు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. "ఎప్పటి లాగే భారత్‌ తనదైన శైలిలో ఆడాలి. భయం లేకుండా ఆడటాన్నే నేను సమర్థిస్తాను. అలాంటి క్రికెటే ఆడతాం. ఈ విషయంలో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ చాలా కీలకం. వాళ్ల ఇలాగే దూకుడు ఆట కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను" అని మజుందార్‌ తెలిపారు.

నాకు ఆ హక్కు ఉంది.. నేను ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదు : హర్మన్​ప్రీత్ కౌర్

ఇకపై వారికి క్రికెట్​లో నో ఛాన్స్! - పూర్తిగా నిషేధించిన ఐసీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.