ETV Bharat / sports

అప్పుడు యువీ.. ఇప్పుడు బుమ్రా వరల్డ్​ రికార్డ్​.. పాపం మళ్లీ బ్రాడ్​.. ఒకే ఓవర్లో 35 రన్స్​!

author img

By

Published : Jul 2, 2022, 4:19 PM IST

Updated : Jul 2, 2022, 4:33 PM IST

Ind vs Eng
Ind vs Eng

టెస్టు క్రికెట్‌ చరిత్రలో జస్​ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. బర్మింగ్‌హామ్‌ టెస్టులో స్టువర్ట్‌బ్రాడ్ ఒకే ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చాడు. ఇందులో 29 పరుగులు చేశాడు బుమ్రా. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు.

టెస్టుల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు టీమ్​ఇండియా కెప్టెన్ జస్​ప్రీత్ బుమ్రా. సుదీర్ఘ ఫార్మాట్​లో ఒక ఓవర్​లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా నిలిచాడు. ఇంగ్లాండ్​తో రీషెడ్యూల్ టెస్టు సందర్భంగా 85వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో బౌండరీల వరద పారించాడు. దీంతో ఆ ఓవర్లో 35 పరుగులు వచ్చాయి. ఇప్పటివరకు టెస్టుల్లో ఒక ఓవర్లో ఇవే అత్యధిక పరుగులు. అయితే.. ఇందులో ఓ వైడ్​ బాల్​ ఫోర్​గా వెళ్లింది. మరోటి నో బాల్​. మొత్తం 29 పరుగులు సాధించాడు బుమ్రా.

2003లో విండీస్​ దిగ్గజం బ్రియాన్ లారా.. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో పీటర్సన్​ బౌలింగ్​లో ఒక ఓవర్​లో కొట్టిన 28 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత 2013లో అండర్సన్ బౌలింగ్​లో జార్జ్ బెయిలీ (28), 2020లో రూట్ పోర్ట్ బౌలింగ్​లో కే మహారాజ్​ (28) ఉన్నారు.
2007 టీ-20 వరల్డ్​ కప్​లో బ్రాడ్​ బౌలింగ్​లోనే యువరాజ్​ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టగా.. మొత్తం 36 పరుగులు రాబట్టాడు. అది కూడా ప్రపంచ రికార్డ్​. ఇప్పుడు మళ్లీ బ్రాడ్​ బౌలింగ్​లోనే టెస్టుల్లో బుమ్రా వరల్డ్​ రికార్డ్​ సాధించాడు. 35 పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు బ్రాడ్​.

టీమ్​ఇండియా భారీ స్కోరు: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆట పూర్తయింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు. 338/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండోరోజు మహ్మద్‌ షమి(0)తో కలిసి బ్యాటింగ్‌ ఆరంభించిన అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. ఈ క్రమంలోనే షమి(16; 31 బంతుల్లో 3x4)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 80వ ఓవర్‌ చివరి బంతికి షమి షాట్‌పిచ్‌ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 371 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది.

కాసేపటికే జడ్డూ సైతం అండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 375/9గా నమోదైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో మొత్తం రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. అయితే, అండర్సన్‌ వేసిన మరుసటి ఓవర్‌ ఐదో బంతికి సిరాజ్‌ (2) ఔటవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో చివరికి భారత్‌ 416 పరుగులు చేసింది. అంతకుముందు తొలిరోజు టీమ్‌ఇండియా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సయమంలో రిషభ్‌ పంత్‌ (146; 111 బంతుల్లో 20x4, 4x6), జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: నయా 'వీరు'డు పంత్​ రికార్డుల మోత.. దిగ్గజాలను సైతం వెనక్కినెట్టి..

Last Updated :Jul 2, 2022, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.