ETV Bharat / sports

కోహ్లీ ఆవేదన, మానసికంగా కుంగిపోయి అప్పటినుంచి బ్యాట్‌ పట్టలేదంటూ

author img

By

Published : Aug 27, 2022, 2:18 PM IST

Kohli mentally down మానసికంగా కుంగిపోయనని అన్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కొద్ది రోజుల పాటు బ్యాట్​ పట్టలేదు అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే.

Kohli mentally down
మానసికంగా కుంగిపోయిన కోహ్లీ

Kohli mentally down ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టి వెయ్యి రోజుల పైనే అయ్యింది. దీంతో అతడిపై గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు ఆట నుంచి విరామం తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండీస్‌, జింబాబ్వే సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. నేటి నుంచి జరగబోయే ఆసియా కప్‌లో బ్యాట్‌ ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ బ్యాటింగ్‌ కింగ్‌ ఓ క్రీడా ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన కెరీర్‌, వ్యక్తిగతానికి సంబంధించి కీలక విషయాలను పంచుకున్నాడు.

అందుకే విరామం.. "గత పదేళ్లలో నెల రోజుల పాటు నేను బ్యాట్‌ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కన్పించొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు హానికరంగా మారొచ్చు" అని విరాట్ చెప్పుకొచ్చాడు. విరామ సమయంలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపాడు. మానసికంగా కుంగిపోయానని చెప్పుకొనేందుకు తానేమీ సిగ్గుపడనని అన్నాడు.

"మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ.. దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే.. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"

- విరాట్ కోహ్లీ

అదే నా లక్ష్యం.. "ఓకే.. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా పూర్తిగా వివేకం, ఆనందంతో భాగస్వామినవుతా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? ఆ సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. వారికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. నాకు ఆట మీదున్న ప్రేమ. ప్రతి బంతితో జట్టుకు సహకరించాల్సింది ఇంకా ఎంతో ఉందని భావిస్తా. మైదానంలోనూ నా పూర్తి శక్తిని ప్రదర్శిస్తా. ఇదేం అసాధారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా టీం గెలవాలనేదే నా లక్ష్యం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లీ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఆ సిరీస్‌లో ఒక టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 76 పరుగులే నమోదు చేశాడు. ఆ తర్వాత బీసీసీఐ అతడికి విశ్రాంతినివ్వడంతో వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనలకు వెళ్లలేదు. దాదాపు నెల రోజుల తర్వాత ఆసియా కప్‌తో కోహ్లీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఆదివారం జరగబోయే భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. టీ20ల్లో కోహ్లీకి 100వది కావడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో 137.66 స్ట్రైక్‌ రేట్‌తో 3308 పరుగులు చేసిన విరాట్‌.. రేపటి మ్యాచ్‌లో మునుపటి కోహ్లీలా బ్యాట్‌తో విజృంభించాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి: Asia cup ఈ అద్భుతాలు తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.