ETV Bharat / sports

100 టెస్టులు ఆడాలని ఎంతో కోరుకున్నా.. కానీ: యువీ

author img

By

Published : May 8, 2022, 9:15 PM IST

Yuvraj Singh
yuvraj singh latest news

Yuvraj Singh: వన్డేల్లో స్టార్​ ఆల్​రౌండర్​గా వెలుగొందిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్​.. టెస్టుల్లో మాత్రం సాధారణంగానే ఆడాడు! అతడికి అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. అయితే సుదీర్ఘ ఫార్మాట్​లో దేశం తరఫున 100 టెస్టులు ఆడాలని ఎంతో కోరుకున్నట్లు చెప్పాడు యువీ.

Yuvraj Singh: టీమ్ఇండియా రెండు ప్రపంచకప్‌లను గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో యువరాజ్‌ సింగ్‌ ఒకడు. తెల్ల బంతి క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు, తక్కువ బంతుల్లో అర్ధ శతకం.. ఇలా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే టెస్టు ఫార్మాట్‌కు వచ్చేసరికి పెద్దగా అవకాశాలూ రాలేదు. వచ్చినప్పుడు ఫర్వాలేదనిపించాడు.

సచిన్‌, సెహ్వాగ్‌, ద్రవిడ్, లక్ష్మణ్‌, గంగూలీ వంటి హేమాహేమీలు ఉన్న సమయంలో యువరాజ్‌ అడపాదడపా జట్టులోకి వచ్చేవాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున వంద టెస్టులను ఆడాలనే కోరిక తనకుండేదని మనసులోని మాటను యువరాజ్‌ బయటపెట్టాడు. టెస్టు క్రికెట్‌ ఎక్కువగా ఆడలేకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు.

"దిగ్గజ క్రికెటర్లు ఉన్న సమయంలో తక్కువ అవకాశాలు వచ్చేవి. అయితే సౌరవ్ గంగూలీ రిటైర్‌మెంట్ ప్రకటించాక టెస్టు క్రికెట్‌ అడే ఛాన్స్‌ వచ్చింది. కానీ అదే సమయంలో నేను క్యాన్సర్‌ బారిన పడ్డా. ఇది కేవలం నా దురదృష్టం. 24x7 ప్రయత్నించా. భారత్‌ తరఫున వంద టెస్టులు ఆడాలని బలంగా కోరుకున్నా. రెండు రోజులపాటు బ్యాటింగ్‌ చేయడం, ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడం వంటివాటిపై శ్రమించా. అయితే అవేవీ సరిపోలేదు" అని యువీ వివరించాడు. కేవలం 40 టెస్టులను మాత్రమే ఆడిన యువరాజ్‌ 1900 పరుగులను సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: అందుకే నేను కెప్టెన్‌ అవ్వలేకపోయా: స్పష్టతనిచ్చిన యువీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.