ETV Bharat / sports

'ధోనీ వీడ్కోలు​ తర్వాతే నాకు వరుస అవకాశాలు'

author img

By

Published : May 26, 2021, 6:52 PM IST

ధోనీ రిటైర్మెంట్ తర్వాతే తనకు ఎక్కువగా టీమ్ఇండియాలో అవకాశాలు వచ్చాయని తెలిపాడు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. భారత జట్టు విజయాలు సాధిస్తున్నంత వరకు తాను రిజర్వ్ బెంచ్​పై ఉన్నా సంతోషమేనని వెల్లడించాడు.

Wriddhiman Saha, indian cricketer
వృదిమాన్ సాహా, భారత క్రికెటర్

భారత మాజీ కెప్టెన్ ధోనీ వీడ్కోలు పలికాకే తనకు టీమ్‌ఇండియాలో వరుసగా చోటు దక్కిందని వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా తెలిపాడు. పూర్తి స్థాయిలో తనకు అవకాశాలు రాకున్నా తానేం బాధపడలేదన్నాడు. తుది జట్టులో చోటు రాకున్నా.. భారత్‌ విజయం సాధిస్తే సంతోషిస్తానని తెలిపాడు. యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌లో ప్రస్తుతం ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. కరోనా వైరస్‌ నుంచి సాహా ఈ మధ్యే కోలుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లాండ్‌ సిరీసుకు ఎంపికయ్యాడు.

"బాగా ఆడితే అవకాశాలు వస్తాయని నేను నమ్ముతా. జట్టుకు సమతూకం, కూర్పు అత్యవసరం. అలాంటప్పుడు కొందరికి తుది జట్టులో చోటు దక్కదు. విజయాలు సాధిస్తున్నంత వరకు నేను రిజర్వు బెంచీపై ఉన్నా సంతోషమే. ధోనీ భాయ్‌ జట్టులో ఉంటే అన్ని మ్యాచుల్లో అతడే ఆడతాడని అందరికీ తెలుసు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు నేను సన్నద్ధం అయ్యేవాడిని. 2010లో నా అరంగేట్రం అలాగే జరిగింది. మొదట అవకాశం లేదని తర్వాత హఠాత్తుగా చోటిచ్చారు. ప్రతి మ్యాచ్‌ ఆడుతానని భావించే సాధన చేస్తాను."

-వృద్ధిమాన్ సాహా, టీమ్ఇండియా క్రికెటర్.

"కెరీర్‌ మొదట్లో నేను రెండో ప్రాధాన్య కీపర్‌గా ఉండేవాడిని. ఆటగాళ్లకు గాయాలు తప్పవు. ఆ సందర్భాల్లో మరొకరు అవకాశం అందిపుచ్చుకుంటారు. రిషభ్ పంత్‌ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఒకప్పుడు నాకు సమయం దొరికింది. 2014-2018 మధ్య ప్రధాన వికెట్‌ కీపర్‌గా కొనసాగాను. ఇప్పుడు రిషభ్ వచ్చాడు. అయితే జట్టు యాజమాన్యం ఏం చెబితే అది చేయడం నా పని. వరుసగా మ్యాచులు ఆడటం వల్ల రిషభ్‌కు ఆత్మ విశ్వాసం పెరిగింది. మొదట్లో పొరపాట్లు చేసేవాడు. ఇప్పుడు చాలా మెరుగయ్యాడు" అని సాహా వెల్లడించాడు.

ఇదీ చదవండి: లంక బౌలర్లపై ఊచకోత- ఆ రికార్డుకు 22 ఏళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.