ETV Bharat / sports

ధోనీ వల్ల రిటైరవ్వాలనుకున్నా.. సచిన్​ మధ్యలో వచ్చి..: సెహ్వాగ్

author img

By

Published : Jun 1, 2022, 7:32 PM IST

Dhoni Sehwag: 2008లో మహేంద్ర సింగ్​ ధోనీ తనను జట్టు నుంచి తప్పించినప్పుడు వన్డేల నుంచి రిటైరవ్వాలని భావించినట్లు తెలిపాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఆ నిర్ణయం తీసుకోకుండా సచిన్​ తనను ఆపినట్లు వివరించాడు.

Dhoni Sehwag
virender sehwag dhoni

Dhoni Sehwag: 2008లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో నాటి భారత కెప్టెన్ ఎం.ఎస్‌. ధోనీ కొన్ని మ్యాచ్‌లకు తనను తప్పించడంతో వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. అప్పుడు తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా సచిన్ తెందూల్కర్ అడ్డుకున్నాడని సెహ్వాగ్ వివరించాడు.

Dhoni Sehwag
సెహ్వాగ్-సచిన్

"2008లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఆలోచన నా మదిలో మెదిలింది. అప్పటికి టెస్టు సిరీస్‌లో పునరాగమనం చేసి 150 పరుగులు చేశాను. వన్డేల్లో మూడు-నాలుగు ప్రయత్నాల్లో అంత స్కోరు చేయలేకపోయా. కాబట్టి ధోనీ నన్ను తుది జట్టు నుంచి తప్పించాడు. అప్పుడు వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలనే ఆలోచన నా మదిలోకి వచ్చింది. టెస్టు క్రికెట్‌లో మాత్రమే ఆడాలనుకున్నాను. ఆ సమయంలో సచిన్ నన్నుఅడ్డుకున్నాడు. 'ఇది నీ జీవితంలో ఒక చెడు దశ. వేచి చూడు. ఈ పర్యటన తర్వాత ఇంటికి వెళ్లి ఏం చేయాలో బాగా ఆలోచించి ఆపై నిర్ణయం తీసుకో' అని సలహా ఇచ్చాడు. అదృష్టవశాత్తూ నేను ఆ సమయంలో నా రిటైర్మెంట్‌ని ప్రకటించలేదు" అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

"ఆటగాళ్లు రెండు రకాలుగా ఉంటారు. అందులో ఒక రకం సవాళ్లను ఇష్టపడేవారు. వీరు కఠిన పరిస్థితుల్లో సరదాగా ఉంటారు. వీరిలో విరాట్ కోహ్లీ ఒకరు. అతడు అన్ని విమర్శలను వింటాడు. మైదానంలో పరుగులు చేయడం ద్వారా అవి తప్పు అని నిరూపిస్తాడు. మరొక రకం. విమర్శలను పట్టించుకోనివారు. ఎందుకంటే వారికి ఏమి చేయాలో తెలుసు. నేను అలాంటి ఆటగాడినే. నన్ను విమర్శించే వాళ్లను పట్టించుకోను. మంచి పరుగులు సాధించి ఇంటికెళ్లాలని కోరుకుంటా" అని వీరూ చెప్పుకొచ్చాడు. 2008లో జరిగిన ట్రై సిరీస్‌లో టీమ్‌ఇండియా మొదటి నాలుగు మ్యాచ్‌లలో సెహ్వాగ్‌ 6, 33, 11, 14 స్కోర్లు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో సెహ్వాగ్‌ని కెప్టెన్‌ ధోనీ తుది జట్టు నుంచి తప్పించాడు.

ఇదీ చూడండి: గంగూలీ సంచలన ప్రకటన.. త్వరలోనే పొలిటికల్ గేమ్ షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.