ETV Bharat / sports

హెచ్​సీఏలో 'ఐపీఎల్'​ మంటలు- శివలాల్​కు అజార్ సవాల్​

author img

By

Published : Mar 10, 2021, 7:04 AM IST

రానున్న ఐపీఎల్​కు ఆతిథ్య వేదికగా భాగ్యనగరానికి చోటు దక్కకపోవడం వల్ల హైదరాబాద్​ క్రికెట్ సంఘం (హెచ్​సీఏ)లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. అందుకు ప్రస్తుత అధ్యక్షుడు అజహర్ కారణమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్​సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ యాదవ్​ ఆరోపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన అజహర్​.. శివలాల్​ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా? అంటూ సవాలు విసిరారు. ​

story on hyderabad cricket association
ఐపీఎల్​ ఆతిథ్యం దక్కకపోవడంపై హెచ్​సీఏలో మంటలు

‌ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఆతిథ్యం దక్కకపోవడం హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో మంటలు రేపుతోంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్‌యాదవ్‌.. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఉప్పల్‌ స్టేడియానికి ఐపీఎల్‌ మ్యాచ్‌లు కేటాయించకపోవడంపై శివలాల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెచ్‌సీఏకు ఇది సిగ్గుచేటు అని ధ్వజమెత్తాడు. క్రికెట్‌ నిర్వహణకు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ దగ్గర సమయం లేకపోతే తక్షణం తప్పుకోవాలని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అజహరుద్దీన్‌ మండిపడ్డాడు. హెచ్‌సీఏలో 24 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేసిన శివలాల్‌ క్రికెట్‌ అభివృద్ధికి ఏం చేశాడని జింఖానా మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించాడు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరాడు. శివలాల్‌, అజహర్‌ మాటల యుద్ధంతో హెచ్‌సీఏ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

క్రికెట్‌ను చంపేస్తున్నారు..

"హైదరాబాద్‌కు ఐపీఎల్‌ ఆతిథ్యం దక్కకపోవడం సిగ్గుచేటు. ఈ పరిణామం తీవ్రంగా బాధించింది. అజహర్‌లో నిబద్ధత లేదు. బీసీసీఐతో అతడు చర్చించాల్సింది. హైదరాబాద్‌కు అనుకూలంగా వాదనను బలంగా వినిపించాల్సింది. బోర్డు పెద్దలను ఒప్పించాల్సింది. హైదరాబాద్‌లో అన్ని వసతులు ఉన్నాయి. కాని హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాటలు హైదరాబాద్‌కు ఐపీఎల్‌ను దూరం చేశాయి. అసలు హైదరాబాద్‌కు ఏం తక్కువ? ఐపీఎల్‌లో నాలుగు సార్లు ఉప్పల్‌ స్టేడియాన్ని బీసీసీఐ అత్యుత్తమ మైదానంగా ప్రకటించింది. నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఆతిథ్యమిచ్చేందుకు హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో కొవిడ్‌ కేసులు కూడా తక్కువే.

story on hyderabad cricket association
శివలాల్ యాదవ్

ఇన్ని సానుకూలతలు ఉన్నా ఆతిథ్యం దక్కకపోవడం హెచ్‌సీఏ సభ్యుల వైఫల్యమే. 2019 సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత కమిటీ ఇప్పటి వరకు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించలేదు. ఇప్పటిదాకా సీఈఓ, సీఎఫ్‌ఓలను నియమించలేదు. సెలెక్షన్‌ కమిటీలను ఎంపిక చేయలేదు. లోథా కమిటీ సిఫార్సులను ఇలా ఎగతాళి చేస్తుంటే హెచ్‌సీఏకు అనుకూలంగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని ఎలా అనుకుంటాం? క్రికెట్‌ నిర్వహణకు సమయం లేనప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఎందుకు? ఎపెక్స్‌ కౌన్సిల్‌లోని సభ్యులంతా తక్షణం రాజీనామా చేయాలి. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాటలు హైదరాబాద్‌ క్రికెట్‌ను చంపేస్తున్నాయి" అని శివలాల్​ యాదవ్​ మండిపడ్డాడు.

ఎంత మందిని తయారు చేశాడు..

"క్రికెట్‌ గురించి తెలియని వాళ్లు హెచ్‌సీఏపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లంతా నోరుమూసుకుంటే మంచిది. ఐపీఎల్‌ వేదికల్లో హైదరాబాద్‌ లేదని తెలియగానే హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మాట్లాడా. హైదరాబాద్‌ వేదికను పరిశీలిస్తానని అతడు హామీ ఇచ్చాడు. అయితే తర్వాత ప్రకటించిన వేదికల్లో హైదరాబాద్‌ లేదు. బీసీసీఐని కోరడం వరకే మనం చేయగలం. వారి నుంచి లాక్కొని రాలేం. ఇతర వేదికల్లో ఏమైనా సమస్యలుంటే హైదరాబాద్‌ను ప్రత్నామ్నాయ వేదికగా పరిశీలిస్తామని మాటిచ్చారు. 24 ఏళ్లు హెచ్‌సీఏలో వివిధ పదవుల్లో ఉన్న శివలాల్‌ హైదరాబాద్‌ క్రికెట్‌కు ఏం చేశాడు? ఏ రోజైనా నెట్స్‌లో పిల్లలకు శిక్షణ ఇచ్చాడా? ఎంత మంది ఆటగాళ్లను తయారు చేశాడు? ఆయన హయాంలో హెచ్‌సీఏకు రూ.200 కోట్లు వచ్చాయి. ఆ డబ్బంతా ఏం చేశాడు?

story on hyderabad cricket association
మహమ్మద్ అజహరుద్దీన్

దేశంలో ప్రతి క్రికెట్‌ సంఘం ఖాతాలో రూ.100 కోట్లు నుంచి రూ.150 కోట్లు ఉన్నాయి. హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి లేకుండా చేశారు. గతంలో హెచ్‌సీఏ సభ్యుల అవినీతిపై బీసీసీఐలో ప్రశ్నించినప్పుడు తలెత్తుకోలేకపోయా. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు హెచ్‌సీఏలో అన్ని రకాల పదవుల్ని శివలాల్‌ చేపట్టాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై శివలాల్‌ ఎందుకు బోర్డు సభ్యులతో మాట్లాడలేదు? మూడేళ్ల కాలానికి ఎన్నికైన మేమెందుకు రాజీనామా చేయాలి? వాళ్లు చేసిన తప్పుల్ని 90 శాతం సరిచేశాం. మీపై ఎన్నో కేసులు ఉన్నాయి. మీ హయాంలో జరిగిన అవినీతిపై బీసీసీఐ, రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తా. విచారణకు సిద్ధమా?" అని అజహర్​ తీవ్రంగా స్పందించాడు.

బ్యాటు పట్టుకోవడం కూడా రావట్లేదు..

"నా దగ్గర మంత్రదండం లేదు. ఒక్కసారిగా అన్నీ మార్చేయలేను. క్రికెట్‌ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తున్నా. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలాసార్లు నెట్స్‌కు వెళ్లా. ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ.. చిట్కాలు చెప్పా. ఎ-డివిజన్‌ లీగ్‌లో సెంచరీలు కొట్టామంటూ ఆటగాళ్లు వస్తున్నారు. వారికి నెట్స్‌లో సరిగా బ్యాట్‌ పట్టుకోవడమే రావట్లేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ పరిస్థితి అలా ఉంది. కరోనా కారణంగా లీగ్‌ క్రికెట్‌ను సరిచేయలేకపోయాం. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలామంది సీనియర్‌ ఆటగాళ్లతో మాట్లాడా. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)లో ఉండమని కోరా. ఆ పదవిలో ఉంటే డబ్బులు రావు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు. రానున్న ఏజీఎంలో అన్ని కమిటీలను నియమిస్తాం. ఎవరూ ఆసక్తి చూపకపోతే వేరే రాష్ట్రాల నుంచి మాజీ ఆటగాళ్లను తీసుకొస్తాం" అని అజహర్ సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి: కోహ్లీకే దక్కని రికార్డు.. స్మృతి మంధాన సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.