ETV Bharat / sports

'భారత్​కు రావాలంటే లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి'

author img

By

Published : Jun 25, 2020, 6:55 PM IST

భారత్​లో నిర్వహించే 2021, 2023 ప్రపంచకప్​లలో పాల్గొనే పాకిస్థాన్ ఆటగాళ్ల భద్రత కోసం బీసీసీఐ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరింది పీసీబీ. ఓ యూట్యూబ్​ ఛానెల్ ఇంటర్వ్యూలో పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

PCB wants written assurance from BCCI regarding clearance to play in two World Cups in India
పీసీబీ

భారత్‌లో నిర్వహించే 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌ ఆటగాళ్ల భద్రత కోసం బీసీసీఐ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఐసీసీని కోరింది. ఆయా ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌ ఆటగాళ్లకు వీసాల మంజూరుతో పాటు భారత్‌లో ఆడే విషయాలపై స్పష్టతనివ్వాలని ఐసీసీని కోరినట్లు పీసీబీ సీఈవో వసీమ్‌ఖాన్‌ ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, 2021లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఎక్కడ జరుపుతారనే విషయంపై త్వరలోనే ఐసీసీ ఓ సమావేశం ఏర్పాటుచేయనుందని చెప్పారు.

ఇప్పుడున్న కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన 2020 టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడేలా ఉంది. ఒకవేళ అది వాయిదా పడితే వచ్చే ఏడాది నిర్వహించాల్సిన 2021 టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించాలా లేక షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో ఆడించాలా అనే విషయంపై ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే విషయంపై స్పందించిన వసీమ్‌ ఖాన్‌.. 2021 టీ20 ప్రపంచకప్‌ను ఆ రెండు దేశాల్లో ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత లేదన్నారు. ఒకవేళ ఈసారి మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తే దాన్ని 2022లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. అలాగే భారత్‌లో నిర్వహించే ఐసీసీ టోర్నీలకు తమ ఆటగాళ్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు బీసీసీఐ నుంచి భద్రతాపరమైన అంశాలపై లిఖితపూర్వక హామీ కావాలన్నారు.

ఇంతకుముందు భారత్‌లో జరిగిన క్రీడా ఈవెంట్లలో పాక్‌ అథ్లెట్లకు అనుమతులు ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి తాము ముందుగానే హామీ కోరుతున్నట్లు తెలిపారు వసీమ్ ఖాన్. అనంతరం భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక క్రికెట్‌పై స్పందించిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుప్పుడే ఆ విషయం కొలిక్కి రాదన్నారు. బీసీసీఐతో పీసీబీకి మంచి సంబంధాలే ఉన్నా వాస్తవికంగా ఇరుజట్ల మధ్య ఇప్పట్లో క్రికెట్‌ జరగదని స్పష్టంచేశారు. చివరగా ఐసీసీ ఛైర్మన్‌ పోటీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నిలబడితే పీసీబీ స్పందనేంటని ప్రశ్నించగా.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, గంగూలీ బరిలో ఉంటాడో లేదో తమకు తెలీదని సమాధానం దాటవేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.