ETV Bharat / sports

మా అమ్మ చెప్పిన మాట వినాల్సింది!: దినేశ్​

author img

By

Published : Feb 19, 2021, 7:06 AM IST

my mom had suggested me to become a fast bowler says Dinesh Karthik
మా అమ్మ చెప్పిన మాట వినాల్సింది!: దినేశ్​

తన అమ్మ చెప్పిన మాట విని.. ఫాస్ట్​బౌలర్​ అయ్యి ఉంటే బాగుండేదని అంటున్నాడు టీమ్ఇండియా క్రికెటర్​ దినేశ్​ కార్తిక్​. ప్రస్తుత ఐపీఎల్​ వేలంలో ఫాస్ట్​బౌలర్లకు భారీ ధర పలకడం వల్ల.. గతంలో తన తల్లి చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

'మా అమ్మ చెప్పిన మాట వినాల్సింది' అని భారత క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ వాపోయాడు. "నువ్వు ఫాస్ట్‌ బౌలర్‌వి కావాలని మా అమ్మ నాకు సూచిస్తూ ఉండేది. కానీ.. నేను మా నాన్న మాట విన్నాను. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అయ్యాను. మా ఇంట్లో అమ్మకు ముందు చూపు ఎక్కువ. ఆ విషయం నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది" అని కార్తిక్‌ తెగ బాధపడుతున్నాడు.

సరే ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? గురువారం ఐపీఎల్‌ 2021 వేలంపాట జరిగింది. అందులో ఫాస్ట్‌బౌలర్లకు భారీగా ధర పలికింది. క్రిస్‌ మోరిస్‌కు రూ.16.25 కోట్లు. కైల్‌ జెమీసన్‌కు రూ.15కోట్లు, రిచర్డ్‌సన్‌కు రూ.14కోట్లు దక్కాయి. ఈసారి వేలంలో ఫాస్ట్‌ బౌలర్లపై జట్టు యాజమాన్యాలు ఆసక్తి చూపించి ఎక్కువ పెట్టుబడి పెట్టాయి. అందుకే.. ఈ వేలంపాటను ఉద్దేశించి.. తాను వాళ్ల అమ్మ చెప్పినట్లుగా ఫాస్ట్‌బౌలర్‌ అయ్యుంటే తనకు కూడా భారీ ధర వచ్చేదని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం దినేశ్‌కార్తిక్‌ కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు జట్టును ముందుండి నడిపించాడు. అయితే.. జట్టు సత్ఫలితాలు రాబట్టలేకపోవడం వల్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. దీంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఇంగ్లాండ్‌ ఆటగాడు మోర్గాన్‌ తీసుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌కు కోల్‌కతా జట్టు గతేడాది రూ.7.4 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది కూడా ఆ జట్టుకే అతడు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఫామ్‌లేమితో పాటు భారత జట్టు వికెట్‌కీపర్‌ స్థానానికి విపరీతమైన పోటీ ఉండటం వల్ల భారత జట్టులో దినేశ్‌ కార్తిక్‌ చోటు దక్కించుకోలేకపోతున్నాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ 2021: ఏ జట్టులో ఎవరెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.