ETV Bharat / sports

'ఎంత కాలం ఈ బుడగల్లో.. మా వల్ల కావట్లేదు'

author img

By

Published : Nov 10, 2020, 6:41 AM IST

బయో బుడగల్లో ఎక్కువ కాలం ఉండటం క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌. ఇది సరికాదని అభిప్రాయపడ్డాడు.

Mitchell Starc
మిచెల్‌ స్టార్క్

కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు దూరంగా బయో బుడగల్లో ఉండటం క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అన్నాడు. బయటి ప్రపంచంతో అనుబంధం లేకుండా కట్టదిట్టమైన నిబంధనల మధ్య ఎక్కువ కాలం ఉండలేరని స్పష్టం చేశాడు. బుడగ తర్వాత బుడగ భయంకరంగా అనిపిస్తుందని వెల్లడించాడు.

'బుడగల్లో ఎక్కువ కాలం కొనసాగలేం. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా హోటల్‌ గదిలోనే ఉండాలి. కొందరు ఆటగాళ్లైతే వారి కుటుంబాలు, పిల్లలను చూసి చాలా కాలమైంది. అలాంటివారు ఐపీఎల్‌లో చాలామంది ఉన్నారు. క్రికెట్‌ ఆడాలి కాబట్టి వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. కానీ ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు ఎంతకాలమని బుడగల్లో ఉండగలరు? వీటికి సమాధానాలు చెప్పాల్సిందే. కేవలం ఐపీఎల్‌ ఆడేవారు మళ్లీ ఐపీఎల్‌కే వస్తారు. డబ్బు తీసుకుంటారు. వారికి ఫర్వాలేదు. కానీ మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?' అని స్టార్క్‌ ప్రశ్నించాడు.

ఇప్పటికే చాలామంది క్రికెటర్లు బయో బుడగలపై మాట్లాడారు. ఐపీఎల్‌లో ఇలాంటి వాతావరణంలో ఉన్నందువల్లే బిగ్‌బాష్ లీగులో తాము ఆడలేమని డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ స్పష్టం చేశారు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం బుడగల్లో కష్టమేనని ఇటీవల అన్నాడు.

ఇదీ చూడండి : ముంబయిXదిల్లీ : ఐపీఎల్​ ట్రోఫీని ముద్దాడేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.