ETV Bharat / sports

సచిన్Xకోహ్లీ: పరుగుల ప్రవాహం కొనసాగిందిలా!

author img

By

Published : Dec 5, 2020, 3:23 PM IST

అంతర్జాతీయ వన్డేల్లో రన్​ మెషీన్స్​గా పేరు తెచ్చుకున్న దిగ్గజ సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్​ను అందుకునే క్రమంలో ఎలాంటి గణాంకాలు నమోదు చేశారు? స్వదేశంలో, విదేశాల్లో ఎన్నెన్ని పరుగులు చేశారు? అనే అంశాల గురించే ఈ ప్రత్యేక కథనం.

Kohli vs Sachin: The numbers game after 12,000 ODI runs
వన్డేల్లో రన్​మెషీన్స్.. సచిన్, కోహ్లీలలో ఎవరు గొప్ప?

ఆధునిక క్రికెట్​లో గొప్ప ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న వస్తే అందరూ దాదాపుగా చెప్పే సమాధానం విరాట్ కోహ్లీ! ఎందుకంటే టీమ్​ఇండియా కెప్టెన్​గా, బ్యాట్స్​మన్​గా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, దిగ్గజ సచిన్ తెందుల్కర్​ నెలకొల్పిన రికార్డులను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాడు. వన్డేల్లో ఇటీవల 12 వేల పరుగుల మార్క్​ను అందుకున్న కోహ్లీ.. సచిన్​ను కూడా వెనక్కు నెట్టేశాడు. మాస్టర్​ బ్లాస్టర్​ మిగతా రికార్డులను చెరిపేసేందుకు విరాట్ సిద్ధమవుతున్నాడు.​

అయితే సచిన్ ఆడినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అలా అని ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ-సచిన్.. 12 వేల పరుగులు చేయడంలో ఎలాంటి గణాంకాలు నమోదు చేశారు? ఎన్ని ఇన్నింగ్స్​ల్లో ఆ మార్క్​ను అందుకున్నారు? స్ట్రైక్​ రేట్ ఎంత? తదితర అంశాల సమాహారమే ఈ కథనం.

12 వేల పరుగుల కోసం

వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్​ను అందుకునేందుకు కోహ్లీకి 242 ఇన్నింగ్స్​లు అవసరమయ్యాయి. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో 23వ పరుగులు చేసి, ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో 63 పరుగులు చేసిన కోహ్లీ.. విజయంలో కీలకపాత్ర పోషించాడు.

సచిన్​.. 12 వేల పరుగులు చేయడానికి 300 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. 2003 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో లీగ్​ పోరు​లో ఈ మార్క్​ను చేరుకున్నాడు. ఈ మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలవడం విశేషం.

Kohli vs Sachin: The numbers game after 12,000 ODI runs
కోహ్లీ, సచిన్

ఎన్ని ఫోర్లు, ఎన్ని సిక్సర్లు?

వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్​ను అందుకునేటప్పటికి సచిన్ ఖాతాలో 1249 ఫోర్లు, 135 సిక్సులు ఉన్నాయి. కోహ్లీ విషయానికొస్తే 1130 ఫోర్లు, 124 సిక్సులు బాదాడు.

స్వదేశంలో ఎన్ని, విదేశాల్లో ఎన్ని?

12 వేల వన్డే పరుగుల మార్క్​ను అందుకున్నప్పటికి సచిన్.. స్వదేశంలో 4015 పరుగులతో ఉండగా, కోహ్లీ 4865 పరుగులు చేశాడు. విదేశీ పిచ్​లపై మాస్టర్ 8000 పరుగులు చేయగా, విరాట్ 7175 పరుగులతో ఉన్నాడు. ఈ విషయంలో దాదాపు సరిసమానంగా ఉన్నారు!

స్ట్రైక్​రేట్ ఎంతెంత?

సరిగ్గా 12 వేల పరుగుల మార్క్​ను అందుకున్న తర్వాత సచిన్ కెరీర్​ స్ట్రైక్​రేట్ 86.65గా ఉంది. స్వదేశంలో(4015 పరుగులు) 88.55గా, విదేశాల్లో 79.69, తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్​ల్లో 89.57గా ఉంది.

అదే కోహ్లీ విషయానికొస్తే 12 వేల వన్డే పరుగులు చేసిన తర్వాత 93.24గా కెరీర్​ స్ట్రైక్​రేటు ఉంది. స్వదేశంలో ఆడిన మ్యాచ్​ల్లో 96.89.. విదేశాల్లో 91.13... తటస్థ వేదికల్లో 90.43 గా ఉంది.

Kohli vs Sachin: The numbers game after 12,000 ODI runs
కోహ్లీ

వన్డేల్లో ఎవరు ఎన్ని పరుగులు?

ఇప్పటికే రిటైర్మెంట్​ ప్రకటించిన సచిన్.. టీమ్​ఇండియా తరఫున 463 వన్డేలాడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 251 వన్డేలాడిన కోహ్లీ.. 12,040 పరుగులతో ఉన్నాడు. ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. మరో కొన్నేళ్లు ఆడే అవకాశమున్న నేపథ్యంలో విరాట్ ఇదే ఊపు కొనసాగిస్తే సచిన్​ను పరుగులు, శతకాలు విషయంలో అధిగమించడం పెద్ద కష్టమేమి కాదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.