ETV Bharat / sports

ఆసుపత్రిలో తండ్రి.. మైదానంలో బట్లర్

author img

By

Published : Aug 10, 2020, 6:44 AM IST

పాకిస్థాన్​తో తొలి టెస్టులో తీవ్ర ఒత్తిడిలోనూ మంచి ఇన్నింగ్స్​ ఆడాడు ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్. ఆసుపత్రిలో తండ్రి ఓవైపు, జట్టులో చోటు పోతుందేమోనన్న భయం మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో కీలక అర్ధశతకం చేశాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Jos Buttler hid heartache of dad being in hospital during heroic innings
ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్

అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఎలా ఉన్నాడోననే భయం ఓ వైపు.. వరుసగా విఫలమవుతుండటం వల్ల జట్టులో స్థానం పోతుందేమోనన్న ఒత్తిడి మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ గొప్ప పట్టుదల ప్రదర్శించాడు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని విలువైన అర్ధశతకంతో తన జట్టును విజయం దిశగా నడిపించాడు. పాకిస్థాన్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను చేసిన 75 పరుగులు ఇంగ్లాండ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. 277 పరుగుల ఛేదనలో 117కే సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రిస్‌ వోక్స్‌ (84 నాటౌట్‌)తో కలిసి ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించాడు.

buttler with stokes
స్టోక్స్​తో బట్లర్

పాకిస్థాన్‌తో రెండో ఇన్నింగ్స్‌కు ముందు వరకూ బట్లర్‌ గత 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్క అర్ధశతకం మాత్రమే సాధించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌గా మూడు అవకాశాలను వృథా చేశాడు. ఈ మ్యాచే తనకు చివరి టెస్టు అవుతుందేమోనన్న భయంతో మైదానంలో అడుగుపెట్టానని బట్లర్‌ తెలిపాడు.

"టెస్టుల్లో నా ప్రదర్శన గురించి ఆలోచిస్తూ కొన్ని ఒంటరి రాత్రుళ్లు గడిపా. పాక్‌తో మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోతే అదే నా చివరి టెస్టు అవుతుందనే ఆలోచనలు బుర్రలో తిరిగాయి. కీపింగ్‌ సరిగా చేయకపోవడం వల్ల బ్యాటింగ్‌లోనైనా వీలైనన్ని పరుగులు సాధించాలనుకున్నా. అలా చేసినందుకు ఆనందంగా ఉంది. ఆ ఛేదనను వన్డేలాగా భావించి ఆడమని రూట్‌ చెప్పాడు"

-జోస్ బట్లర్‌, ఇంగ్లాండ్ క్రికెటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.