ETV Bharat / sports

అవకాశం వస్తే సారథ్యం వహిస్తా: స్మిత్

author img

By

Published : Mar 30, 2021, 12:20 PM IST

Steve Smith
స్మిత్

అవకాశం వస్తే మరోసారి ఆస్ట్రేలియాకు కెప్టెన్​ బాధ్యతలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశాడు స్టీవ్ స్మిత్. బోర్డు ఎవరిని సారథిగా నియమించినా తన మద్దతు ఉంటుందని వెల్లడించాడు.

ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలనందించి కెప్టెన్సీలో దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు స్టీవ్ స్మిత్. కానీ బాల్ టాంపరింగ్ వివాదంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. కెరీర్​ను ఇబ్బందుల్లోకి నెట్టేసుకున్నాడు. ఆ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్.. మళ్లీ బ్యాట్​ పట్టి అదే ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. అతడిని ఆటగాడిగా కొనసాగిస్తున్నా.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడానికి సందేహిస్తోంది ఆసీస్ బోర్డు. తాజాగా తన కెప్టెన్సీ విషయమై స్పందించిన స్మిత్.. అవకాశమిస్తే మళ్లీ సారథ్యం వహిస్తానని తన మనసులోని మాట వెల్లడించాడు.

"నేను దాని గురించి చాలా ఆలోచించా. కెప్టెన్​గా అవకాశం వస్తే మరోసారి బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నా. మేనేజ్​మెంట్​ జట్టుకు ఏది సరైంది అనిపిస్తే అది చేస్తుంది. నేను ఆ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నా. జట్టుకు నాయకత్వం వహించినా.. వహించకపోయినా నా బాధ్యత నేను నిర్వర్తిస్తా. కొన్నేళ్లుగా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నా. కెప్టెన్​గా ఎవరిని నియమించినా ఇంతకుముందు పైన్, ఫించ్​లకు మద్దతు ఇచ్చినట్లుగానే వారికీ మద్దతిస్తా."

-స్మిత్, ఆసీస్ మాజీ సారథి

ఈ ఏడాది టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్​లో ఓటమిపాలైంది ఆస్ట్రేలియా. అప్పటినుంచి టెస్టు కెప్టెన్​ పైన్​పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అతడి స్థానంలో స్మిత్​ను కెప్టెన్​గా నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్మిత్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.