ETV Bharat / sports

'దానికింకా సమయముంది.. అప్పుడే తొందరొద్దు'

author img

By

Published : Jul 12, 2020, 5:39 PM IST

ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. తాను ఇంకా చిన్నవాడినే అని ఆ పదవి చేపట్టేందుకు ఇంకా సమయముందని వెల్లడించాడు.

Iam not in hurry for ICC Chairman still young says BCCI President Sourav Ganguly
'దానికింకా సమయముంది.. అప్పుడే తొందరొద్దు'

ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడానికి తాను ఇంకా చిన్నవాడినేనని, ఇప్పుడే తనకు ఆ తొందర లేదని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ ఇటీవల వైదొలిగాడు. అంతకుముందే ఆ పదవి రేసులో గంగూలీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆ స్థానంపై కన్నేసిన ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఇప్పుడు ఆ రేసులో వెనుకబడ్డాడు. ఐసీసీ ఛైర్మన్‌ విషయంపై ఓ ఇంటర్వ్యూులో మాట్లాడిన దాదా పలు విషయాలు వెల్లడించాడు.

"ఐసీసీ ఛైర్మన్‌ పదవి గురించి నాకు తెలియదు. అది బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయం. అలాగే ఇప్పుడు ఐసీసీ నిబంధనలు కూడా మారాయి. ఒకవేళ ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలంటే ఆ వ్యక్తి తన దేశం తరఫున బోర్డులోని పదవుల నుంచి తప్పుకోవాలి. ఇంతకుముందులా రెండు పదవులు చేపట్టే అవకాశం లేదు. అది బీసీసీఐ చేసిన మార్పు కాదు, ఐసీసీ చేసిందే. అయితే, ఇప్పుడున్న బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఇక్కడ పదవిలో ఉంటూనే ఐసీసీ లేదా ఏసీసీలో కొనసాగొచ్చు. కానీ, బీసీసీఐలో మాత్రం రెండు పదవులు చేపట్టకూడదు. అలాగే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్కడా, ఇక్కడా రెండు పదవులు కలిగి ఉండొద్దు."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను బీసీసీఐ నుంచి తప్పుకోవడం కూడా సరికాదని దాదా వెల్లడించాడు. "భారత క్రికెట్‌ బోర్డును ఇలా మధ్యలో వదిలి వెళ్లడం, లేదా వెళ్లాల్సిన పరిస్థితులు రావడం సరైనవో కాదో నాకు తెలియదు. కానీ, ఐసీసీ ఛైర్మన్‌ పదవికి మాత్రం తొందరపడట్లేదు. అందుకు నేనింకా చిన్నవాడిని. అవి ఎంతో గౌరవప్రదమైన పదవులు. జీవితంలో ఒక్కసారే చేసే పనులు. ఇంతకుముందు ఆ పదవుల్లో కొనసాగిన గొప్ప పాలకులంతా ఒక్కొక్కసారే ఆయా బాధ్యతలు చేపట్టారు. క్రీడలకు సంబంధించినంత వరకు ఇతరుల కన్నా నాకు మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసు. ఎందుకంటే నా జీవితమంతా ఆటతోనే ముడిపడి సాగింది. కాబట్టి, ఐసీసీ పదవిని చేపట్టాల్సి వస్తే అది బోర్డు సభ్యులందరి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది" అని దాదా చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.