ETV Bharat / sports

ఐపీఎల్2021: ఈ స్టార్ ఆటగాళ్లకు భారీ ధర!

author img

By

Published : Jan 21, 2021, 12:56 PM IST

IPL 2021
ఐపీఎల్2021

ఐపీఎల్ మినీ వేలానికి అంతా సిద్ధమైంది. ఈ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లను ప్రకటించాయి. దీంతో ఈసారి వేలానికి వెళ్లనున్న స్టార్ ఆటగాళ్లు ఎవరో తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో 2021 మినీ వేలంలో భారీ ధర పలికే అవకాశమున్న స్టార్ ఆటగాళ్లెవరో చూద్దాం.

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ 2021కు సన్నద్ధమవుతున్నాయి. వేలం నేపథ్యంలో తాము జట్టులో అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. కొందరిని వదిలేసుకున్నాయి. జట్లు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో కొందరు స్టార్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మినీ వేలంలో అందరి దృష్టినీ ఆకర్షించనున్న టాప్ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

క్రిస్ మోరిస్

గతేడాది ఐపీఎల్ వేలానికి ముందు అసలు క్రిస్ మోరిస్​ను ఏ జట్టైనా తీసుకుంటుందా? అనే అనుమానం ఉండేది. కానీ ఇతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సీజన్​లో గాయం కారణంగా అన్ని మ్యాచ్​లు ఆడని మోరిస్.. ఆడిన 9 మ్యాచ్​ల్లో 11 వికెట్లు దక్కించుకున్నాడు. బ్యాట్​తోనూ రాణించాడు. కానీ ఈసారి మినీ వేలానికి ముందు అంటిపెట్టుకున్న ఆటగాళ్లను ప్రకటించిన ఆర్సీబీ మోరిస్​ను వదిలేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆల్​రౌండర్ల విభాగంలో మోరిస్​కు ఈసారి కూడా భారీ ధర దక్కే అవకాశం ఉంది.

Morris
మోరిస్

స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్​ స్టీవ్ స్మిత్​కు అనూహ్యంగా మొండిచేయి చూపించింది రాజస్థాన్ రాయల్స్. బ్యాట్స్​మన్​గానే కాకుండా గతేడాది కెప్టెన్​గానూ ఈ జట్టుకు స్మిత్ సేవలందించాడు. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ అతడికున్న అంతర్జాతీయ అనుభవంతో ఈసారి వేలంలో కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

Smith
స్మిత్

గ్లెన్ మ్యాక్స్​వెల్

కింగ్స్​ ఎలెవన్ పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు మ్యాక్స్​వెల్. ఇతడిని పంజాబ్ 10.75 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆ డబ్బుకు, జట్టు నమ్మకాన్ని వమ్ము చేస్తూ గత సీజన్​లో ఇతడు 106 బంతుల్లో 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్​ మొత్తంలో ఒక్క సిక్స్​ కూడా కొట్టకపోవడం గమనార్హం. దీంతో ఇతడిని వదులుకుంది పంజాబ్. కానీ ఒక్క సీజన్​తో మ్యాక్స్​వెల్ సామర్థ్యానికి ఎలాంటి ముప్పు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 క్రికెట్​లో అతడికున్న అనుభవమే ఇందుకు కారణం. ఈసారి కూడా ఇతడు భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

Maxwell
మ్యాక్స్​వెల్

శివం దూబే

టీమ్ఇండియాకు అరంగేట్రం చేయకముందే యువ ఆటగాడు శివం దూబేను 2018 సీజన్​లో 5 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ సీజన్​లో ఎక్కువ అవకాశాలు దక్కకపోయినా భారత జట్టులో చోటు దక్కించుకున్న కారణంగా గతేడాదీ అతడిని అట్టిపెట్టుకుంది. కానీ వారి నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో మినీ వేలానికి ముందు దూబేను వదిలేసింది బెంగళూరు. కానీ ఇది అతడికి మేలు చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

Dubey
దూబే

ఆరోన్ ఫించ్

రాజస్థాన్​.. కెప్టెన్ స్మిత్​ను వదిలేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్​ ఫించ్​ను వదిలేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ జట్టు. గతేడాది ఇతడిని 4.8 కోట్లకు దక్కించుకుంది కోహ్లీసేన. కానీ గత సీజన్​లో అంత గొప్ప ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 268 పరుగులు చేసి రెండో అర్ధ భాగంలో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ అతడి ఐపీఎల్ గణాంకాలు చూస్తే.. మొత్తం 87 మ్యాచ్​లు ఆడి 127 స్ట్రైక్ రేట్​తో 2005 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ఇతడికి మినీ వేలంలోనూ మంచి ధర పలికేలా చేసే అవకాశం ఉంది.

Finch
ఫించ్

మిగిలిన వారిలో!

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వదిలేసిన ఆల్​రౌండర్ ముజిబుర్‌ రెహ్మన్‌ ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. అలాగే కోల్‌కతా ఆటగాడు క్రిస్‌ గ్రీన్‌ కూడా విలువైన ఆటగాడిగా నిలవొచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల గత సీజన్​ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ ఈ టోర్నీలోనే అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీ క్యాపిటల్స్‌ వదిలేసిన జేసన్‌ రాయ్‌ ముంబయి వదిలేసిన నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: మలింగను వదులుకున్న ముంబయి​.. రాజస్థాన్ కెప్టెన్​గా శాంసన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.