T20 worldcup: టీమ్​ఇండియాకు ఇబ్బందులు తప్పవా?.. అతడి స్థానంలో ఎవరొస్తారో?

author img

By

Published : Sep 29, 2022, 10:04 PM IST

T20 worldcup

మరో 24 రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడబోతున్న వేళ.. గట్టి దెబ్బ తగలింది. ఇప్పటికే గాయం వల్ల జడేజా దూరమయ్యాడు. ఇప్పుడేమో బుమ్రా వైదొలిగాడు. మరి వీరి స్థానాల్లో ఎవరు ఆడే అవకాశం ఉంది? సహా పలు విషయాలను తెలుసుకుందాం..

గాయాలు మళ్లీ టీమ్‌ఇండియాను కష్టాల్లోకి నెడతాయా..? జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయా..? మరో 24 రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడబోతున్న వేళ.. గట్టి దెబ్బ తగలింది. ఇప్పటికే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమవుతాడనే వార్తలు టీమ్ఇండియా అభిమానుల్లో కలవరం రేపింది. ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని భావించిన శార్దూల్‌ ఠాకూర్‌ కూడా గాయంతో ఆసీస్‌తో సిరీస్‌కు ముందే జట్టు నుంచి వైదొలిగాడు.

సమస్యను తీరుస్తాడనుకుంటే.. గత ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే భారత్ ఇంటిముఖం పట్టింది. అప్పటి సారథి విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదిలేశాడు. దీంతో రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో జట్టు పగ్గాలను అందుకున్నాడు. గత ఆసియా కప్‌లో మినహా పలు ద్వైపాక్షిక సిరీసుల్లో భారత్‌ విజయాలు సాధిస్తూ.. ఆసీస్‌ వేదికగా జరగబోయే మెగా టోర్నీ కోసం సన్నద్ధమవుతోంది. అయితే వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్‌నకు దూరమైన బుమ్రా.. ఆసీస్‌తో సిరీస్‌కు వచ్చాడని సంబరపడ్డాం. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఆడతాడని ఆశగా ఎదురుచూశాం. అయితే మరోసారి వెన్ను నొప్పి తిరగబెట్టడంతో భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. డెత్‌ ఓవర్లలో టీమ్‌ఇండియా ఫోబియాను తొలగిస్తాడని ఆశిస్తే.. జట్టులోనే లేకుండాపోయే ప్రమాదం వచ్చింది. చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆసియా కప్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకొంది. హర్షల్‌, బుమ్రా రాకతో డెత్‌ ఓవర్లలో టీమ్‌ఇండియా బలంగా మారుతుందని ప్రతి ఒక్కరూ భావించారు.

ఆ ఇద్దరిలో ఎవరికో.. గత ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైన భారత్‌.. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో ఉన్న సమయంలోనే పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దూరం కావడం గట్టి షాక్‌. అయితే జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్ సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు అంచనా వేశారు. వారికి తగ్గట్లుగానే అక్షర్ బౌలింగ్‌లో అదరగొట్టేస్తున్నాడు. కానీ బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా సరిగా ఆడలేకపోయాడు. అయితే మంచి బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం మాత్రం అక్షర్‌ సొంతం. అయితే ఇప్పుడంతా బుమ్రాకి బదులు ఎవరు వస్తారు? అనేదానిపై చర్చ సాగుతోంది. మహమ్మద్‌ షమీనే సరైన ఎంపిక అని కొందరు.. హైదరాబాదీ బౌలర్‌ మహమ్మద్ సిరాజ్‌ అయితే బాగుంటుందనే వారూ లేకపోలేదు. మిడిల్‌ ఓవర్లలో వీరిద్దరూ బాగానే బౌలింగ్‌ చేయగలరు. ప్రస్తుతం ఉన్న భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్ డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చారు. కొత్త బంతితో భువీ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు. చివర్లో యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ ఉత్తమంగా బౌలింగ్‌ వేస్తున్నప్పటికీ.. అతడికి తోడుగా మరొక బౌలర్‌ ఉండాల్సిన అవసరం ఉంది. షమీ అయితే అనుభవజ్ఞుడు. కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్‌ వేయాలనేది అతడికి బాగా తెలుసు. అయితే టీమ్‌ఇండియా అభిమానుల మదిలో మరో సందేహం.. ప్రపంచకప్‌ నాటికి ఇంకెంతమంది ఆటగాళ్లు గాయపడతారోనని ఆందోళనతో ఉన్నారు.

స్టాండ్‌బైలోకి ఎవరొస్తారు?.. బుమ్రా స్థానంలో అవకాశం కోసం షమీతోపాటు మీడియం పేసర్‌ దీపక్‌ చాహర్‌ కూడా పోటీ పడే అవకాశం ఉంది. దీపక్‌ చాహర్‌ కూడా ఇటు బ్యాటింగ్‌తోపాటు, బౌలింగ్‌లోనూ అక్కరకొస్తాడు. అయితే ఆసీస్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలం కాబట్టి పేసర్‌ అయితేనే ఉత్తమం. అందుకే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ షమీ వైపు మొగ్గు ఛాన్స్‌ ఉంది. అప్పుడు స్టాండ్‌బై ఆటగాడిగా ఒకరిని భారత్‌ ఎంపిక చేయాలి. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్‌.. యువ బౌలర్‌ ఉమ్రాన్‌ ఖాన్‌.. అవేశ్‌ ఖాన్‌.. ప్రసిధ్ కృష్ణ.. ఇలా ఎవరికి అవకాశం వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. వీరందరిలో సిరాజ్‌ కాస్త ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాడు. నాణ్యమైన పేస్‌ రాబట్టగలడు. కానీ ప్రస్తుతం అతడు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. లేకపోతే ఆసీస్‌ పిచ్‌లకు సరిపోతాడని ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సోషల్‌ మీడియాలో రచ్చ.. "భారత టీ20 లీగ్‌లో మాత్రం అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు బుమ్రాకి ఎలాంటి గాయాలు అడ్డు రావని.. ఇప్పుడే అన్ని వస్తాయి" అని ఓ నెటిజన్‌ తీవ్ర ఆగ్రహం.. ఇదీ నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి కాస్త ముందు వెన్నునొప్పి కారణంగా బుమ్రా తప్పుకోవడంతో వచ్చిన కామెంట్.

* చాలా విరామం తర్వాత బుమ్రా కేవలం రెండు టీ20లను మాత్రమే ఆడాడు. మళ్లీ గాయపడ్డాడు. ఫిట్‌నెస్‌ గురించి జాగ్రత్త తీసుకోకపోవడం గమనార్హం.

* కింగ్‌ ఆఫ్ ఇంజ్యూరీ - ఓ అభిమాని ట్వీట్‌

* అంతర్జాతీయంగా మూడు టీ20లు ఆడలేడు. అదే టీ20 లీగ్‌లో మాత్రం ముంబయి కోసం 14 మ్యాచ్‌లు ఆడేస్తాడు

ఇదీ చూడండి: ఘనంగా 36వ జాతీయ క్రీడల ప్రారంభ వేడుకలు.. క్రీడా శకటంలో మోదీ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.