ETV Bharat / sports

లంకపై పోరుకు సిద్ధమైన భారత్​.. నిలవాలంటే గెలవాల్సిందే..

author img

By

Published : Sep 6, 2022, 6:55 AM IST

India vs Srilanka match
India vs Srilanka match

ఎన్నో అంచనాలతో.. మరెన్నో ఆశలతో ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌ కొట్టాలని బరిలో దిగిన టీమ్‌ఇండియాకు సంకటస్థితి. రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్‌కు కఠిన పరీక్ష. ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ది చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో రోహిత్‌ సేన తలపడుతుంది. సూపర్‌-4లో తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమితో దెబ్బతిన్న జట్టు.. లంకతో పోరులో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. బౌలింగ్‌ ప్రదర్శన మారితేనే జట్టు విజయం సాధించే అవకాశం ఉంది.

ఆసియా కప్‌ గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌, హాంకాంగ్‌పై వరుస విజయాలతో టోర్నీని ఘనంగా మొదలెట్టిన భారత్‌.. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. సూపర్‌-4లో పాక్‌ చేతిలో ఓటమి జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టైటిల్‌ పోటీలో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన తన సూపర్‌-4 రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మంగళవారం శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ రోహిత్‌సేనకు చావోరేవో లాంటిది. సూపర్‌-4లో ఒక్కో జట్టు.. మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ చొప్పున ఆడుతోంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే భారత్‌పై పాక్‌, అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక గెలిచాయి. ఇప్పుడు లంక చేతిలోనూ భారత్‌ ఓడితే.. ఫైనల్‌ దారి దాదాపుగా మూసుకుపోయినట్లే.

చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై నెగ్గినా చాలా సమీకరణాలు కలిసి రావాలి. అఫ్గానిస్థాన్‌పై పాక్‌ గెలిచే అవకాశాలే ఎక్కువ. అలా జరిగితే పాక్‌, శ్రీలంక మధ్య జరిగే చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. మూడు విజయాలతో అగ్రస్థానంలోకి వెళ్తుంది. ఓడిన జట్టు రెండో స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. ఇక భారత్‌ ఒకే విజయంతో టోర్నీని వీడాల్సి వస్తుంది. అందుకే లంకతో మ్యాచ్‌లో విజయం మనకు అత్యావశ్యకం. ఈ మ్యాచ్‌లో గెలిచి, చివరి పోరులో అఫ్గానిస్థాన్‌ను ఓడిస్తే భారత్‌కూ తుదిపోరు చేరే అవకాశాలుంటాయి. భారత్‌ కన్నా ముందే అఫ్గాన్‌తో పాక్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

మిడిలార్డర్‌పై దృష్టి..: ఇక బ్యాటింగ్‌లో టాప్‌ఆర్డర్‌ జోరు అందుకోవడం శుభపరిణామం. దాదాపు నెల రోజుల విరామం తర్వాత సరికొత్తగా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన కోహ్లి.. తిరిగి ఫామ్‌ అందుకుంటూ పరుగుల వేటలో సాగుతున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించాడు. అలవోకగా బౌండరీలు సాధిస్తున్న అతని ఆటతీరు చూస్తుంటే మునుపటి లయ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. కానీ అతను ఇంకా ఒకప్పటి దూకుడును బ్యాటింగ్‌లో మళ్లీ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇదే నిలకడ కొనసాగిస్తూ అతను మరింత వేగంగా ఆడాలి. ఇక గత మ్యాచ్‌లో జట్టుకు ధనాధన్‌ ఆరంభాన్నిచ్చిన ఓపెనర్లు రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ భారీ భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది.

ఇప్పుడు సమస్యంతా మళ్లీ మిడిలార్డర్‌తోనే వచ్చింది. గత మ్యాచ్‌లో పంత్‌, హార్దిక్‌, దీపక్‌ హుడా విఫలమవడంతో భారత్‌ భారీస్కోరు చేయలేకపోయింది. మరోవైపు పంత్‌, దినేశ్‌ కార్తీక్‌లో ఎవరిని ఆడించాలనే చర్చ సాగుతూనే ఉంది. ఈ మ్యాచ్‌లో పంత్‌కు బదులు మళ్లీ దినేశ్‌కు అవకాశం ఇస్తారా? అక్షర్‌ రాకతో రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌కే పరిమితమవక తప్పదా? అవేశ్‌ కోసం దీపక్‌పై వేటు పడుతుందా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పటిష్ఠమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ దిశగా జట్టు మేనేజ్‌మెంట్‌ సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలి.

లంక తక్కువేం కాదు..: సంధి దశలో ఉన్న శ్రీలంక క్రికెట్‌ జట్టు ఇటీవల ఉత్తమ ప్రదర్శనతో మళ్లీ పుంజుకుంటోంది. గ్రూప్‌లో తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో కంగుతిన్న లంక ఆ తర్వాత గాడిలో పడింది. గ్రూప్‌లో బంగ్లాదేశ్‌పై, సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయాలు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కెప్టెన్‌ శనక, నిశాంక, కుశాల్‌ మెండిస్‌, గుణతిలక, రాజపక్స బ్యాటింగ్‌లో కీలకంగా మారారు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బాదుడు మొదలెడుతున్నారు. వీళ్లను భారత బౌలర్లు ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచిది. ఇక లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ పట్ల మన బ్యాటర్లు జాగ్రత్త వహించాల్సిందే.

ప్రయోగాలు కొనసాగిస్తారా?

ఆసియా కప్‌ ముగిసే సరికి టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టు కూర్పుపై తుది అంచనాకు రావాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. అందుకే ఈ టోర్నీలో ప్రయోగాలు చేస్తోంది. కానీ బౌలింగ్‌ బలహీనత జట్టుకు ప్రతికూలంగా మారింది. బుమ్రా, హర్షల్‌ ముందే దూరమవడం, మధ్యలో జడేజా గాయంతో నిష్క్రమించడంతో కావాల్సినన్ని బౌలింగ్‌ వనరులు జట్టుకు లేకుండా పోయాయి. పాక్‌తో గత మ్యాచ్‌లో ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కనిపించలేదు. స్పిన్‌ వేసే దీపక్‌ హుడా ఉన్నా రోహిత్‌ ఉపయోగించుకోలేదు. దీంతో హార్దిక్‌, చాహల్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నా వాళ్లతోనే బౌలింగ్‌ కొనసాగించాల్సి వచ్చింది. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.

మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న భువనేశ్వర్‌ ఆఖర్లో తేలిపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో లంకపై గెలవాలంటే భారత బౌలింగ్‌ మెరుగుపడాల్సిందే. జడేజా స్థానంలో జట్టుతో చేరిన అక్షర్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. అతని రాకతో ఆరో బౌలర్‌ లోటు తీరడమే కాకుండా, జట్టు కూర్పు కూడా కుదిరే ఆస్కారముంది. ఇక టోర్నీలో నిరాశపరుస్తున్న చాహల్‌ స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను మైదానంలో దింపుతారేమో చూడాలి. అనారోగ్యం కారణంగా పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన పేసర్‌ అవేశ్‌ కూడా అందుబాటులో ఉన్నాడు. మరి అంతగా ఆకట్టుకోలేకపోతున్న అతనికి మరో అవకాశం ఇస్తారా? అన్నది సందేహమే. ఏది ఏమైనా మెరుగైన బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలతో బరిలో దిగి జట్టు ఉత్తమ ప్రదర్శన చేయాలి.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, దినేశ్‌ కార్తీక్‌/పంత్‌, హార్దిక్‌, అక్షర్‌, భువనేశ్వర్‌, అవేశ్‌/రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌/అశ్విన్‌.
శ్రీలంక: నిశాంక, కుశాల్‌, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, శనక, హసరంగ, చామిక కరుణరత్నె, తీక్షణ, అసిత, దిల్షాన్‌ మదుశంక.

పిచ్‌ ఎలా ఉంది?
ఆసియా కప్‌లో ఇప్పటివరకు దుబాయ్‌లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో హాంకాంగ్‌తో భారత్‌ పోరు మినహా ఛేదన చేసిన జట్లే గెలిచాయి. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్‌ ఎక్కువ అనుకూలంగా మారే అవకాశం ఉంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపొచ్చు. స్పిన్నర్లకు పిచ్‌ ఎక్కువగా సహకరిస్తుంది.
17 శ్రీలంకతో ఆడిన 25 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ సాధించిన విజయాలు. ప్రత్యర్థి 7 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఇదీ చదవండి:

స్పెషల్‌ పర్సన్‌కు 'టీచర్స్‌ డే' విషెస్​​ చెప్పిన గంగూలీ.. ఎవరంటే..?

రోహిత్​ భయ్యా దూకుడు లోపించిందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.