ETV Bharat / sitara

Varudu kaavalenu review: 'వరుడు కావలెను' ఎలా ఉందంటే?

author img

By

Published : Oct 29, 2021, 1:23 PM IST

పెళ్లి నేపథ్య కథతో తీసిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'. అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

varudu kaavalenu review
వరుడు కావలెను రివ్యూ

ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం 'వ‌రుడు కావ‌లెను`. నాగ‌శౌర్య‌, రీతూ జోడీగా న‌టించ‌డం.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించ‌డం వల్ల సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈవారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ప‌లు చిత్రాల్లో కీల‌క‌మైన ఓ సినిమా ఇది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం ప‌దండి.

క‌థేంటంటే?

హైద‌రాబాద్‌లో స్టార్ట‌ప్ కంపెనీని నిర్వ‌హిస్తుంటుంది భూమి (రీతూవ‌ర్మ‌). ఆఫీస్‌లో ఆమె చాలా స్ట్రిక్ట్. ఎవ‌రి ప‌నీ ఒక ప‌ట్టాన న‌చ్చ‌దు. రాక్ష‌సి అంటూ ఆఫీస్ ఉద్యోగులు తిట్టుకుంటుంటారు. ఇంట్లో పెళ్లి చేయాల‌ని త‌ల్లి (న‌దియా) సంబంధాలు చూస్తుంటుంది. భూమి మాత్రం పెళ్లికి తిరస్క‌రిస్తూ వస్తుంది. అప్పుడే ఓ ప్రాజెక్ట్ ప‌నిమీద ఆకాష్ (నాగ‌శౌర్య‌) హైదరాబాద్ వ‌స్తాడు. ప్యారిస్‌లో ఆర్కిటెక్ట‌ర్‌గా సెటిల్ అయిన ఓ తెలుగు కుర్రాడు ఆకాష్‌. భూమి ప‌నిచేస్తున్న కంపెనీ బిల్డింగ్ కోసం ప్లాన్ కూడా ఇస్తాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక‌రిపై మ‌రొక‌రికి ప్రేమ పుడుతుంది. ఇక వాళ్ల ప్రేమ‌క‌థ కంచికి చేరుతుంద‌న‌గానే క‌థ‌లో ఓ మ‌లుపు. ఆకాష్‌కి, భూమికీ మ‌ధ్య అంత‌కుముందు కాలేజీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు తెర‌పైకొస్తాయి. ఇంత‌కీ వాళ్లిద్ద‌రికీ ఎక్క‌డ ప‌రిచ‌యం ఏర్ప‌డింది? అప్పుడు ఏం జ‌రిగింది? చివ‌రికి ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

.
.

ఎలా ఉందంటే?

మ‌న‌సులోని ప్రేమ‌ను బ‌య‌టకు చెప్ప‌కుండా న‌లిగిపోయే ప్రేమికుల క‌థ ఇది. దాన్ని పెళ్లితోనూ... వ‌యసొచ్చిన బిడ్డ‌ల‌కు పెళ్లి చేసి భారం దించుకోవాల‌ని మ‌ధ‌న‌ప‌డే త‌ల్లిదండ్రుల క‌థ‌తోనూ ముడిపెట్టి తీశారు. రెండు ద‌శ‌ల్లో సాగే ప్రేమ‌క‌థ‌ల సమాహారమే అయినా, మొత్తంగా చూస్తే ఇందులో ఉన్న‌ది స‌న్న‌టి క‌థే. ఆరంభ స‌న్నివేశాలు భూమి పాత్ర చుట్టూనే సాగుతాయి. ఆమె ఆఫీస్ వాతావ‌ర‌ణం, ఆమె బాసిజం నేప‌థ్యంలో స‌ర‌దాగా సాగుతాయి. ఆ స‌న్నివేశాలు మ‌న్మ‌థుడు సినిమాను గుర్తు చేస్తాయి. కాక‌పోతే అక్క‌డ బాస్ హీరో, ఇక్క‌డ హీరోయిన్‌. అంతే తేడా. ఆకాష్ పాత్ర ప‌రిచ‌యం త‌ర్వాత కూడా క‌థ‌లో వేగమేమీ పెర‌గ‌దు. భూమి... ఆకాష్‌ను ప్రేమించిన త‌ర్వాతే క‌థ‌లో ఓ అడుగు ముందుకు ప‌డిన‌ట్టు అనిపిస్తుంది. ఆ వెంట‌నే వ‌చ్చే విరామ స‌న్నివేశాల‌తో అనూహ్యంగా ఓ మ‌లుపు. అక్క‌డ ఆకాష్‌తో త‌న‌కున్న బంధం గురించి భూమి చెప్పే మాట‌లు ఆస‌క్తికి గురిచేస్తాయి. త‌దుప‌రి క‌థ‌పై ఆత్రుత‌ని పెంచుతాయి. ద్వితీయార్థం ఫ్లాష్‌బ్యాక్‌తో మొద‌ల‌వుతుంది. అక్క‌డ మ‌రో ప్రేమ‌క‌థ మొద‌లైన‌ట్టు అనిపించినా అందులో కొత్త‌దన‌మేమీ లేదు. కాక‌పోతే నాయ‌కానాయిక‌లు క‌నిపించిన విధానం మాత్రం ఆక‌ట్టుకుంటుంది. ఫ్లాష్‌బ్యాక్ త‌ర్వాత ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా మ‌ధ్య ఇంట్లో కూతురి పెళ్లి గురించి జ‌రిగే చర్చ హ‌త్తుకునేలా ఉంటుంది. ఆ త‌ర్వాత భూమి ఆఫీస్‌లో ప‌నిచేసే ఉద్యోగుల పెళ్లి హంగామా మొద‌ల‌వుతుంది. అక్క‌డ స‌ప్త‌గిరి చేసే లాగ్ కామెడీ క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. హీరోహీరోయిన్ల మ‌ధ్య స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు ఊహ‌కు తగ్గ‌ట్టే సాగినా కుటుంబ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే అంశాలు పుష్క‌లంగా ఉండ‌టం సినిమాకు క‌లిసొచ్చే విష‌యం. మాట‌లు, పాట‌లు సినిమాకి ప్ర‌ధాన బ‌లం.

.
.

ఎవ‌రెలా చేశారంటే?

నాగ‌శౌర్య , రీతూవ‌ర్మ అందంగా క‌నిపించారు. వాళ్లు ఆయా పాత్ర‌ల్లో ఒదిగిపోయిన తీరు, ప‌లికించిన భావోద్వేగాలు కూడా ఎంతో ప‌రిణ‌తితో కూడుకుని ఉంటాయి. ఆయా పాత్ర‌ల‌కు స‌రైన ఎంపిక అనిపిస్తారు నాయ‌కానాయిక‌లు. విరామానికి ముందు, క్లైమాక్స్‌కు ముందు స‌న్నివేశాల్లో ఆ ఇద్ద‌రి న‌ట‌న హత్తుకుంటుంది. పాట‌ల్లోనూ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అల‌రించింది. స‌ప్త‌గిరి, వెన్నెల కిశోర్‌, హిమ‌జ, ప్ర‌వీణ్ త‌దిత‌రులు న‌వ్వించే బాధ్య‌త‌ని తీసుకున్నారు. స‌ప్త‌గిరి కామెడీ క‌డుపుబ్బా న‌వ్వించింది. ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా క‌థానాయిక త‌ల్లిదండ్రులుగా చ‌క్క‌టి పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వంశీ ప‌చ్చిపులుసు కెమెరా ప‌నిత‌నం, త‌మ‌న్‌, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం ఆక‌ట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. గ‌ణేశ్ రావూరి మాట‌ల్లో మెరుపు క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కురాలు ల‌క్ష్మీసౌజ‌న్య‌కి ఇదే తొలి చిత్ర‌మైనా ఎంతో ప‌రిణ‌తితో స‌న్నివేశాల్ని తెర‌పైకి తీసుకొచ్చారు.

.
.

బలాలు

  • కుటుంబ వినోదం
  • నాగ‌శౌర్య‌, రీతూ జోడీ
  • ద్వితీయార్థంలో కామెడీ
  • పాట‌లు

బ‌ల‌హీన‌త‌లు

  • సాగ‌దీత‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాలు
  • ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే క‌థ

చివ‌రిగా: భూమి.. ఆకాష్‌లు మెప్పిస్తారు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.