ETV Bharat / sitara

Kargil War: మాధురీ దీక్షిత్‌ను ఇచ్చేయమన్న పాక్‌..!

author img

By

Published : Aug 15, 2021, 4:04 PM IST

madhuri-dixit
మాధురీ దీక్షిత్‌

అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో ఇటీవల 'షేర్‌షా' పేరుతో కార్గిల్‌ యుద్ధవీరుడు విక్రమ్‌ బాత్రా జీవితగాథను తెరకెక్కించారు. కార్గిల్‌ పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకొనేందుకు పాక్‌ సైన్యంతో పోరాడుతున్న సన్నివేశంలో మాధురీ దీక్షిత్‌ ప్రస్తావన వస్తుంది. 'మాధురీ దీక్షిత్‌ను మాకు అప్పగిస్తే పర్వత శిఖరాలను(Kargil War) వదిలేసి వెళ్లపోతాం' అని ఓ పాక్‌ సైనికుడు అంటాడు. వాస్తవంగా ఇటువంటి ఘటన కార్గిల్‌ యుద్ధ సమయంలో చోటు చేసుకొంది. అయితే.. అసలు కార్గిల్​ యుద్ధానికి, మాధురీ దీక్షిత్​కు సంబంధమేంటి?

కార్గిల్‌ పర్వతాల్లో(Kargil War) దాదాపు 17వేల అడుగుల ఎత్తున ఉన్న4875 శిఖరాన్ని ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకొనేందుకు విక్రమ్‌ బాత్రా బృందం భీకర యుద్ధం చేసింది. జులై 7వ తేదీన జరిగిన పోరులో విక్రమ్‌ బృందంలోని కెప్టెన్‌ నవీన్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. కానీ, ఓ గ్రెనేడ్‌ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విక్రమ్‌ స్వయంగా ఛార్జ్‌ తీసుకొన్నారు. ఈ ఆపరేషన్‌లో విక్రమ్‌ కోడ్‌ నేమ్‌ 'షేర్‌షా'. విక్రమ్‌ రేడియో కమ్యూనికేషన్‌లోకి పాక్‌ బృందం తరచూ చొచ్చుకొచ్చి భారత సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించేది. 'షేర్‌షా పేరు పెట్టుకుంటే ఎవరూ సింహం కాలేరు' అంటూ కామెంట్లు పాస్‌ చేశారు. ఈ క్రమంలో వారు విక్రమ్‌ బృందాన్ని చిరాకుపర్చేందుకు ''మాధురీ దీక్షిత్‌ను మాకు అప్పగిస్తే మేం ఈ శిఖరాన్ని ఖాళీ చేస్తాం'' అని పేర్కొన్నారు. దీనికి విక్రమ్‌ సమాధానమిస్తూ 'ఇది మాధురీ వైపు నుంచి ప్రేమతో' అంటూ శత్రువులపై భీకరంగా ఫైరింగ్‌ మొదలుపెట్టారు. ఈ ఆసక్తికర విషయాన్ని రిటైర్డ్‌ కెప్టెన్‌ నవీన్‌ నాగప్ప స్వయంగా వెల్లడించారు.

బాంబులపై సరదా కామెంట్లు..

కార్గిల్‌ యద్ధంలో(Kargil War) వాయుసేన పర్వత శిఖరాల్లోనక్కిన ముష్కరులపై భీకర దాడులు చేసింది. ఈ క్రమంలో వాయుసేన ఆపరేషన్‌ 'సఫేద్‌ సాగర్​'లో ఉపయోగించిన పలు బాంబులపై పాక్‌ను వెక్కిరిస్తూ సరదా కామెంట్లను కూడా రాసింది. వాటిల్లో చాలా ఫొటోలు వైరల్‌ అయ్యాయి. నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఫేవరెట్‌ నటి రవీనా టండన్‌. ఈ నేపథ్యంలో వాయుసేన ఉపయోగించిన ఓ బాంబుపై 'రవీనా టండన్ నుంచి నవాజ్‌ షరీఫ్‌కు' అని రాసి మిగ్‌-27 విమానానికి అమర్చారు. దానితో కార్గిల్‌ పర్వత శిఖరాల్లో నక్కిన ముష్కరుల అంతు చూశారు. మరో బాంబుపై 'జోర్‌ కా ఝట్కా ధీరేసే లగే' వంటి కామెంట్లు రాశారు.

KARGIL WAR
ఓ బాంబుపై 'రవీనా టండన్ నుంచి నవాజ్‌ షరీఫ్‌కు' అని రాసి మిగ్‌-27 విమానానికి అమర్చిన భారత సైనికులు

మందుగుండుపై కామెంట్లు రాయవచ్చా..

ముందుగుండుపై కామెంట్లు రాసే సంస్కృతి చాలా కాలంగా ఉంది. అమెరికా సంకీర్ణ సేనలు ఐసిస్‌పై దాడుల సమయంలో 'పారిస్‌ కోసం' అంటూ బాంబుపై రాయడం వైరల్‌గా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌కు ఈస్టర్‌ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు రాశారు. ఈ ఫొటోలు ఇప్పటికీ అమెరికా ఆర్కీవ్స్‌ విభాగం భద్రపర్చింది. ఇక ప్రత్యర్థి సైనికులను హతమారిస్తే వారికి సంబంధించిన ఐడీ కార్డులు, ఇతర గుర్తులను కూడా వీటిపై అంటిస్తుంటారు.

KARGIL WAR
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌కు ఈస్టర్‌ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు

ఇవీ చూడండి: ఈ పంద్రాగస్టుకు.. ఈ వెబ్​సిరీస్​లు చూసేయండి

గాంధీ 'సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం'తోనే స్వాతంత్ర్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.