టాలీవుడ్‌ బాలీవుడ్‌ కాదు.. ఇండీవుడ్‌..!

author img

By

Published : Jan 2, 2022, 8:48 AM IST

Updated : Jan 2, 2022, 9:34 AM IST

Tollywood Pan India Movies

ఒకప్పుడు తెలుగువాళ్లమని చెబితే మదరాసీనా అనేవారట... దాన్ని పోగొట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు ఎన్టీఆర్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ అని మనం చెప్పుకున్నా సౌత్‌ సినిమా అని మాట్లాడేవారు ఉత్తరాది వారు. 'కాదు... తెలుగు సినిమా' అని గర్వంగా చాటారు రాజమౌళి. ఇప్పుడు దేశమంతా 'సిద్ధాంత్‌ నందన్‌ 'సాహో' ప్రభాస్‌ తెలుసు... 'పుష్పరాజ్‌' అల్లు అర్జున్‌ తెలుసు. యువత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల 'దోస్తీ'తో గొంతు కలుపుతోంది. 'నాచో నాచో...' అంటూ స్టెప్పులేస్తోంది. ఈ సినిమాల పాటలూ ట్రైలర్లూ దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోనూ వైరల్‌ కాగా 'ఏయ్‌ బిడ్డా... ఇది నా అడ్డా...' అని తెలుగు సినిమా అంటోంటే ఊ... అనక ఊహూ... అనగలరా ఎవరైనా..!

Tollywood Pan India Movies: నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా.. ఇప్పుడీ పాట తెలుగు సినిమా పరిశ్రమకి సరిగ్గా సరిపోతుంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ కచ్‌నుంచి కోల్‌కతా వరకూ డిసెంబరు చలిలోనూ సినిమా ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది 'పుష్ప'. శ్రీవల్లీ పుష్పరాజ్‌లను చూసి పంజాబీ సోదరులు 'సామీ సామీ...' అంటూ భాంగ్రా ఆడేస్తున్నారు. మరాఠీ ప్రేక్షకులు 'మన్‌ ఫూలా ఫూలా ఫిరే' అంటూ మైమరిచిపోతున్నారు. ఆ జోరూ హుషారూ తగ్గక ముందే మీసం మెలేస్తూ వచ్చిన బెంగాలీ బాబు 'శ్యామ్‌ సింగరాయ్‌' పునర్జన్మ కథ చెబితే కళ్లు విప్పార్చుకుని చూసింది దేశం. బెంగాలీ వనితగా సాయిపల్లవీ, అందమైన నవ్వుతో కృతి శెట్టీ చేసిన మ్యాజిక్‌ అందరినీ మైమరిపించింది.

Tollywood pan india movies
ప్రభాస్​

Tollywood Pan India Movies: ఇక, అటు అల్లూరి... ఇటు కొమురం భీమ్‌. రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన ఇద్దరు యోధులతో ఏకంగా 'ప్రియభారత జనని' కోసం సాగే స్వాతంత్య్రోద్యమ నేపథ్యం... కథ ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతోందో టీజర్లూ ట్రైలర్లూ ఊరించి చూపించాయి. ఎప్పుడెప్పుడు ఈ పాటల్ని థియేటర్లో చూడగలమా అని ఎదురుచూసినవారి కోరిక తీరే సమయం వచ్చేసింది.

Tollywood pan india movies
నాటు.. నాటు పాటలో జంటగా స్టార్ హీరోలు

RRR Movie Updates: 'ఆర్‌ఆర్‌ఆర్‌'గా త్వరలో దేశమంతటా వెండితెరలమీద వెలిగిపోనుంది దర్శకుడు రాజమౌళి కన్న కల. యువ హీరోలిద్దర్నీ వెంటేసుకుని నగరాలన్నీ చుట్టేస్తూ ఆయన చేసిన ప్రమోషనూ, హోరెత్తిన అభిమానుల ఈలలూ, మార్కెట్‌ని ముంచెత్తిన మర్చెండైజూ.. మార్కెటింగ్‌ ఒక రేంజ్‌లో సాగిన సంగతి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిక సినిమా వసూళ్లకు రెండు వేల కోట్ల క్లబ్బే లక్ష్యం..! ఎక్కడా తగ్గేదే లే..!

Tollywood pan india movies
రామ్ చరణ్​

Prabhas New Movie: ఈ సినిమాల పండుగ ఇలా హుషారుగా నడుస్తుండగానే మన సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. అసలే సంక్రాంతిదీ సినిమాదీ విడదీయరాని బంధమాయె...! ఎంతమంది చుట్టాలొచ్చినా ఎన్ని పిండివంటలతో విందుభోజనం చేసినా చివరాఖరున కొత్తగా విడుదలైన ఓ సినిమా చూసేస్తే తప్ప తృప్తిగా ఉండదు తెలుగు వాళ్లకి. ఇప్పుడా ఆనందాన్ని దేశానికంతా పంచడానికి వస్తున్నాడు 'రాధేశ్యామ్‌'. పాన్‌ ఇండియా యువ హీరోగా ప్రభాస్‌ ఇప్పటికే అందరికీ పరిచయం కావడమూ, అతడి పక్కన పూజాహెగ్డే హీరోయిన్‌గా ఉండడమూ ఈ సినిమా మీద అభిమానుల ఆశలను పెంచేశాయి. కుర్రకారంతా 'ఆశికీ ఆ గయీ...' అంటూ గోలపెట్టేస్తున్నారు. ప్రభాస్‌దే మరో సినిమా 'సలార్‌' కూడా కొద్ది నెలల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Tollywood pan india movies
ఆర్ఆర్ఆర్​

ఏమిటిదంతా.. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాకుండా దేశమంతా విడుదలవడం ఏమిటీ.. భాషాప్రాంత భేదాలు లేకుండా అందరూ వాటిని ఆదరించడం ఏమిటీ అంటే- దాన్నే 'పాన్‌ ఇండియా మ్యాజిక్‌' అంటోంది సినీ పరిశ్రమ. ఆ మ్యాజిక్‌ ముందూ వెనకలేమిటో చూద్దామా మరి..!

Tollywood pan india movies
లైగర్

అప్పుడూ ఉంది..!

మనదేశంలో ప్రధాన భాషలన్నిటికీ ఆయా రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమలు ఉన్నాయి. వాటిని ప్రాంతీయ పరిశ్రమలంటాం. మిగతావాటితో పోలిస్తే దక్షిణాది పరిశ్రమలన్నీ కాస్త పెద్దవి. అవి కాకుండా ముంబయిలో హిందీ చిత్రాలు తయారవుతాయి. హిందీ దేశభాష కాబట్టి సహజంగానే ఆ భాషా చిత్రాలకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉంటారు. అందుకే బాలీవుడ్‌ అన్నిటికన్నా పెద్ద పరిశ్రమ అయింది. ఇతర పరిశ్రమలపై దాని ఆధిక్యం ఉండేది. అయితే ఇరుగుపొరుగు కుటుంబాల మధ్య ఉన్నట్లే ఈ చిత్ర పరిశ్రమల మధ్య కూడా మొదటినుంచీ ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేవి. తెలుగులో హిట్టయిన సినిమాని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోకి డబ్‌ చేయడం, ఆ భాషల్లో మంచి సినిమాలనుకున్నవాటిని తెలుగులోకి తెచ్చుకోవడం తరచూ చేసేవారు. అలాగే ఇటు పక్క నుంచి ఎందరో నటీనటులూ దర్శకులూ బాలీవుడ్‌కి వెళ్లారు. సినిమాలనూ తీసుకెళ్లారు. సువర్ణసుందరిలాంటి సినిమాలు హిందీలో డబ్బింగ్‌ చేస్తే, రాముడు-భీముడు, మూగమనసులు లాంటి సినిమాలను రీమేక్‌ చేశారు. వైజయంతి మాల, వహీదా రెహ్మాన్‌, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి, ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొనే, విద్యా బాలన్‌ తదితర తారలంతా దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లి వెండితెరపై మెరిసినవారే. అంతెందుకు, హిందీ సినిమాని కొత్తదారి పట్టించిన గురుదత్‌ కన్నడిగుడే.

Tollywood pan india movies
పవన్ కల్యాన్​

ఎందరో సంగీతకారులూ గాయనీగాయకులూ కూడా ఈ పరిశ్రమల మధ్య అనుబంధాల వారధి వేశారు. 'నిదురపోరా తమ్ముడా' అంటూ లతా మంగేష్కర్‌, 'నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై...' అంటూ మహమ్మద్‌ రఫీ తెలుగు పాటలు పాడినా, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెళ్లి 'తేరే మేరే బీచ్‌ మే కైసా హై యే బంధన్‌' అంటూ హిందీ పాట పాడినా.. ఆ ఇచ్చిపుచ్చుకోవటాల్లో భాగమే.

Tollywood pan india movies
ప్రపంచ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న తెలుగు సినిమాలు

ఒక భాషలో హిట్టయిన సినిమాని ఇతర భాషల్లోకి డబ్బింగ్‌ చేయడమే కాక, చాలా బాగుందీ అనుకుంటే హక్కుల్ని కొనుక్కుని స్థానిక నటీనటులతో రీమేక్‌ చేసేవారు. కన్నడలో రాజ్‌కుమార్‌ నటించిన మహిషా సురమర్దిని(1959) సినిమాను ఆరోజుల్లోనే ఏడు భాషల్లోకి డబ్‌ చేసి విడుదల చేశారట. మూడు నాలుగు భాషల్లోకి డబ్‌ చేయడం సాధారణం. కానీ అంతకన్నా ఎక్కువ భాషల్లోకి అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. అలా మళ్లీ 2005లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని తొమ్మిది ఇతర భాషల్లో పునర్నిర్మించారట. హిందీలో వచ్చిన మైనే ప్యార్‌కియా, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి చిత్రాలను తెలుగులోకి డబ్‌ చేసినా ఒరిజినల్‌ చిత్రానికి వచ్చిన ఆదరణ డబ్బింగ్‌ చిత్రాలకు రాలేదు. 'రోబో' లాంటి చిత్రాలను ఒరిజినల్‌ చిత్రంతోపాటు ఒకేసారి ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ లాంటి నటుల చిత్రాలను హిందీలో డబ్బింగ్‌ చేసినా రీమేక్‌ చేసినా దేశమంతటా ఆదరణ ఉండేది. దక్షిణాది నుంచి తొలి పాన్‌ ఇండియా నటుడిగా చెప్పాలంటే రజినీకాంత్‌నే చెప్పాలి. ఆయన సినిమాలను భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఎక్కువగా చూసేవారు. క్రమంగా కళాకారులు పరిశ్రమల పరిధులు దాటి చేయీ చేయీ కలిపి పనిచేయడం పెరిగింది. రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ల తర్వాత చిరంజీవి, నాగార్జున, ప్రభుదేవా, ఐశ్వర్యరాయ్‌, దీపికా పదుకొనె, కాజోల్‌, టబు, రవీనా... లాంటివాళ్లు వేర్వేరు భాషల చిత్రాల్లో కలిసి నటించారు. కన్నడ, తమిళ నటులు తెలుగులో నటించడం, తెలుగు కథానాయికలు పలువురు తమిళంలో మలయాళంలో నటించడం మామూలు విషయమైంది.

Tollywood pan india movies
పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్​

ఇటు నుంచి అటు...

చాలాకాలం పాటు దక్షిణాది సినిమాలు ఇతర దక్షిణాది భాషల్లోకీ, హిందీ సినిమాలూ దక్షిణాది భాషల్లోకే డబ్ అవుతూ రాగా 2010 తర్వాత ట్రెండ్‌ మారింది. దక్షిణాది చిత్రాలను హిందీలోకి డబ్‌ చేయడం బాగా పెరిగింది. ప్రత్యేకించి తమిళ, తెలుగు సినిమాలు దాదాపుగా అన్నీ విడుదలైన వెంటనే అటు హిందీలోకీ వెళ్లడం, ఆదరణ పొందడం మొదలైంది. ఈ ట్రెండ్‌ ఇలా కొనసాగుతున్నప్పుడే 2015లో 'బాహుబలి' సినిమా వచ్చి ఒకే సమయంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమై హిందీలోనూ డబ్బింగ్‌ పూర్తిచేసుకుని దేశవ్యాప్తంగా విడుదలైంది. 180 కోట్లతో తయారై ఏకంగా 650 కోట్లు సంపాదించిన ఈ సినిమా మొత్తం దేశం దృష్టిని తెలుగు చిత్రసీమవైపు మళ్లించింది. రెండేళ్ల తర్వాత వచ్చిన దాని రెండోభాగం మరో మెట్టు పైకి ఎక్కి ఏకంగా 1500 కోట్ల వసూళ్లు దాటింది. ఆ ఏడాది అది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది. మొత్తంగా చిత్రసీమని బాహుబలికి ముందు- తర్వాత అన్న రెండు దశలుగా చెప్పుకునేలా చేశాయి ఈ సినిమాలు. వీటితో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్‌ కథానాయకుడిగా ఆ తర్వాత వచ్చిన 'సాహో' వాణిజ్యపరంగానూ మంచి విజయం సాధించింది. దక్షిణాదిన మిగతా పరిశ్రమలతో పోలిస్తే కన్నడ చిత్రపరిశ్రమలో కొంచెం హడావుడి తక్కువ. అలాంటిది 2018లో ఆ చిత్రసీమ నుంచి వచ్చిన కేజీఎఫ్‌ చాప్టర్‌-1 దేశవ్యాప్తంగా మరో సంచలనమైంది. ఇప్పుడు 'రాకీ భాయ్‌' యశ్‌ అభిమానుల కోసం కేజీఎఫ్‌-2 సిద్ధమవుతోంది.

Tollywood pan india movies
పాన్ ఇండియా స్థాయిలో పుష్ప

బాహుబలి, కేజీఎఫ్‌, సాహో చిత్రాల అనూహ్య విజయం మొత్తంగా దక్షిణాది చిత్రపరిశ్రమ హోదానే పెంచేసింది. పాన్‌ ఇండియా అన్నమాటను అందరికీ చేరువ చేసింది. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తయారై విడుదలయ్యే సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా వ్యవహరించడం మామూలయ్యింది. ఆ మధ్యకాలంలోనే వచ్చిన రజినీకాంత్‌ తమిళ సినిమా 'రోబో 2.0', ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటించిన తెలుగు సినిమా 'సైరా'లను కూడా దక్షిణాది భాషలతో పాటు హిందీలోకీ డబ్చేసి ఒకేసారి విడుదల చేశారు. అయితే ఇలా ఒకేసారి అన్ని భాషల్లో సినిమాని విడుదల చేస్తే అది పాన్‌ ఇండియా సినిమా అయిపోతుందా అంటే- కాదనే చెప్పాలి.

Tollywood pan india movies
రాధేశ్యాస్​లో ప్రభాస్​

కథనమే మారిపోతుంది!

పాన్‌ ఇండియా సినిమాకీ మామూలు ప్రాంతీయ సినిమాకీ చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయ పరిధులు దాటడం మాత్రమే కాదు, భాష, సంస్కృతీ సంప్రదాయాల్లాంటివాటినీ అధిగమించాలి. ఆ తారతమ్యాలన్నిటినీ అధిగమించగల సత్తా కథకి ఉండాలి. అది ఒక ప్రాంతానికో ఒక సంస్కృతికో చెందినట్లు కాకుండా అందరికీ అర్థమయ్యేలా టేకింగ్‌ ఉండాలి. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌, బాగ్‌బన్‌, కభీ ఖుషీ కభీ గమ్‌ లాంటి హిందీ సినిమాలను దేశమంతా చూశారు. నిజానికి 'కార్వాచౌత్‌' అనే ఉత్తరాది మహిళల వ్రతం గురించి తెలుగువారికో తమిళులకో తెలియడానికి కారణం ఆ సినిమాలేనంటే అతిశయోక్తి కాదు. కథల్లో సంప్రదాయాన్ని చొప్పించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో లీనమయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలన్నిటిలోనూ కథ కుటుంబమూ ప్రేమానుబంధాల చుట్టూనే తిరుగుతుంది. భాషతో పనిలేకుండా నటులు చూపే ఉద్వేగపూరితమైన నటనతోనే ఎవరికైనా కథ అర్థమైపోతుంది. పాన్‌ ఇండియా సినిమాల్లో ఉండాల్సిన ప్రధాన అంశం... బలమైన భావోద్వేగాలు.

Tollywood pan india movies
అల్లు అర్జున్​

Allu Arjun New Movie 2021: కథల్లో కొత్తదనం మరో అంశం. 'పుష్ప' సినిమాలో హీరోది డీగ్లామరస్‌ పాత్ర. అయినా జనాల్ని ఆకట్టుకుందంటే కథలో కొత్తదనమే కారణం. అయితే ప్రేమకథలూ లేకపోతే అండర్‌వరల్డ్‌ మాఫియా డాన్‌ కథలూ తప్ప సినిమాల్లో మరో కొత్త విషయం కన్పించని పరిస్థితుల్లో వచ్చిన ఈ ఎర్రచందనం స్మగ్లర్‌ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌ అన్నది శేషాచలం కొండలకు పరిమితమైన సమస్య కాదు. దేశమంతా తెలిసిన సమస్య. మొన్నటి బాహుబలి కథకి నేపథ్యం రాచరికం. అందులోని కక్షలూ కార్పణ్యాలూ. దాన్నో దృశ్యకావ్యంగా మలచడంతో ప్రాంతీయ పరిధులను తేలిగ్గా దాటగలిగింది. రేపు రాబోయే ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా అంతే. కథానాయకులు తెలుగు ప్రాంతంవారే అయినా వారి కథకు నేపథ్యం దేశమంతా ఎరిగిన స్వాతంత్య్రసమరం.

బలమైన కథని ఎంచుకుని దాన్ని చెప్పే విధానంలో కొత్తదనం చూపిస్తే సినిమా సరిహద్దుల్ని చెరిపేస్తుంది. అదే పాన్‌ ఇండియా సినిమాకి ప్రధాన అర్హత.

Tollywood pan india movies
పుష్పలో అల్లు అర్జున్​

అన్నీ మారతాయి!

నటీనటులు విభిన్న చిత్రపరిశ్రమలకు చెందినవారై ఉండడాన్నీ ఒక అవసరంగా భావిస్తున్నారు కొందరు పాన్‌ ఇండియా చిత్ర నిర్మాతలు. ఏ ప్రాంతం వారు చూసినా వారికి పరిచితమైన ముఖాలు ఒకటో రెండో ఉండటం వల్ల చిత్రాన్ని తమదిగా భావించి ఆదరిస్తారన్నది దాని వెనక ఉన్న సూత్రం. అందుకే సైరాలో హిందీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ని, తమిళం నుంచి విజయ్‌ సేతుపతిని, కన్నడనుంచి సుదీప్‌ని, భోజ్‌పురి చిత్రపరిశ్రమకు చెందిన రవికిషన్‌ని... ఇలా వేర్వేరు భాషలనుంచి నటులను ఎంపిక చేశారు. రోబోలో కూడా బాలీవుడ్‌ నుంచి అక్షయ్‌కుమార్‌నీ ఆదిల్‌ హుస్సేన్‌, సుధాంశుపాండేలాంటి వారినీ తీసుకున్నారు. సాహోలో ప్రభాస్‌తో పాటు శ్రద్ధా కపూర్‌, జాకీష్రాఫ్‌ తదితరులు కన్పిస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో హిందీ నటులు అజయ్‌దేవ్‌గణ్‌, ఆలియాభట్‌; పుష్పలో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ లాంటివారు ఉన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నమేమీ లేకుండా అచ్చంగా ఒకే పరిశ్రమకు చెందినవారు నటించిన చిత్రాలూ విజయం సాధించిన దాఖలాలున్నాయి. కథాబలం, చిత్రీకరణల ముందు ఇవన్నీ సెకండరీనే అంటారు నిపుణులు. ఎప్పుడైతే సినిమా పరిధి పెరుగుతుందో అప్పుడు సహజంగానే దాంట్లో పనిచేసే కళాకారుల పరిధీ విస్తృతమవుతుంది. వారికి దేశమంతటా అభిమానులు పెరుగుతారు. కథలు మారాలి కాబట్టి కొత్త కథకులు వస్తారు. పలు భాషల్లో సిద్ధంచేయాలి కనుక నిర్మాతలకు బడ్జెట్‌ ఎక్కువవుతుంది. కథలకు తగినట్లుగా దర్శకుల విజన్‌ మారుతుంది. నటీనటులూ సంగీతకారులూ గాయనీగాయకులూ అందరికీ గుర్తింపు పెరుగుతుంది. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు సంగీత, నృత్యబాణీలను అందించింది తెలుగువాళ్లే. ట్యూన్లకు తగిన సాహిత్యాన్ని మాత్రమే ఆయా భాషల్లో రాయించి వేర్వేరు గాయకులతో పాడించారు. ఆ పాటలకు యూట్యూబ్‌లో వచ్చిన కోట్లాది వీక్షణలూ వేలల్లో వచ్చిన వ్యాఖ్యలే అవి విజయం సాధించాయనడానికి నిదర్శనం.

Tollywood pan india movies
సమంత

మార్కెట్‌... వేలకోట్లు!

ఒకప్పుడు సినిమా వందకోట్లు వసూలు చేస్తే విజయం సాధించిన సినిమాగా పరిగణించేవారు. క్రమంగా వందకోట్ల క్లబ్‌ రెండొందలకీ ఐదొందలకీ పెరిగింది. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలకు వెయ్యికోట్ల క్లబ్‌ అన్నది విజయానికి మైలురాయిగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. బాహుబలి-2 దేశంలో అన్ని భాషల్లోనూ కలిపి 1400 కోట్లకు పైగా సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లు దాటిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1500 కోట్ల మార్క్‌నీ అధిగమించింది. హిందీలో కేవలం 70 కోట్లతో నిర్మితమై మెల్లగా ఒక్కో భాషలోకీ డబ్‌ చేసి విడుదల చేస్తూ వచ్చిన 'దంగల్‌' సినిమా ఆ రికార్డునూ దాటింది. క్రీడా చిత్రంగానూ, ఇంగ్లిష్‌ కాని ఇతర భాషాచిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ 'దంగల్‌' చరిత్ర సృష్టించడానికీ కారణం- కథకి ఉన్న విస్తృతే. క్రీడాకారులకు భాషతో పనేముంది... ఆ రంగంలో ఉండే సమస్యల్నీ ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్ని అద్భుతంగా చిత్రించినందువల్లే ఈ చిత్రం దేశవిదేశాల్లోనూ ఆదరణ పొంది రెండు వేల కోట్ల క్లబ్‌కి ద్వారాలు తెరిచి, 2100 కోట్లతో రికార్డు సృష్టించింది. ఈ ట్రెండ్‌ని బట్టి చూస్తే ఇక మన పాన్‌ ఇండియా చిత్రాల లక్ష్యం వేల కోట్ల వసూళ్లేనన్నది సుస్పష్టం.

Tollywood pan india movies
ప్రభాస్​

అంతేకాదు, ఈ చిత్రాలకోసం వేసిన సెట్లు కూడా పర్యటక ఆసక్తిని సృష్టిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో బాహుబలి సెట్‌ ఇప్పటికీ టూరిస్టు అట్రాక్షన్‌గానే ఉంది. రేపు దానికి ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌ కూడా తోడు కావచ్చు.

Pawan Kalyan New Movie: ఈ పరిస్థితులన్నీ కలిసి తెలుగు చిత్రపరిశ్రమ నుంచి వచ్చే పాన్‌ ఇండియా సినిమాలపై ఆశల్ని పెంచేస్తున్నాయి. ఇప్పటికే మరెన్నో కొత్త సినిమాలను పాన్‌ ఇండియా సినిమాలుగా తీయనున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌, పవన్‌ కల్యాణ్‌- క్రిష్‌, విజయ్‌ దేవరకొండ- పూరిజగన్నాథ్‌, అడివి శేష్‌- శశికిరణ్‌, సమంత- హరి హరీశ్‌ల కాంబినేషన్లలో సినిమాలు తయారవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

భాషాప్రాంత భేదాలను అధిగమించి ఇలా సినిమాలన్నీ దేశమంతటా అందరికీ అర్థమయ్యేలా తయారైతే ఏమిటీ లాభం... అంటారా..? అప్పుడిక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌, మాలీవుడ్‌ లాంటివేవీ లేకుండా ఒకే ఒక్క ‘ఇండీవుడ్‌’ ఉంటుందేమో... హాలీవుడ్‌కి దీటుగా..! ఏమంటారూ..!

ఇదీ చదవండి: అగ్గిబరాటాల కథతో.. ఆస్కార్‌కు!

Last Updated :Jan 2, 2022, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.