ETV Bharat / sitara

The Family Man 2: 'రాజీ'.. ఎప్పటికీ ప్రత్యేకమే: సమంత

author img

By

Published : Jun 7, 2021, 9:03 PM IST

'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో చేసిన రాజీ పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పింది ముద్దుగుమ్మ సమంత. ఈ పాత్ర చేసే ఫైట్ సీన్స్ కోసం ఎంతలా కష్టపడిందో వెల్లడిస్తూ, ఇన్​స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్​, ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Samantha Akkineni The Family Man 2
సమంత

ఇప్పటివరకూ గ్లామర్‌ గాళ్‌గా కనిపించిన సమంత ఇప్పుడు తన రూటు మార్చుకుంది. నిజానికి ‘రంగస్థలం’ నుంచే ఆమెలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ఆ పాత్రలకు ప్రాణం పోస్తూ వస్తోందామె. తాజాగా సమంత ఎంచుకున్న మరో సాహసోపేతమైన పాత్ర ‘రాజీ’. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సిరీస్‌లో సమంత పోషించిన పాత్ర అది. సిరీస్‌ ఏ స్థాయిలో అలరిస్తోందో.. అదే స్థాయిలో సమంత నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి.. రాజీ పాత్రలో ఒదిగిపోవడానికి, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించడానికి సమంత ఎంతటి కఠోర సాధన చేసిందో తెలుసా..? దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

‘‘అవును ఇందులో అన్ని స్టంట్స్ నేను సొంతంగా చేశాను. అందుకోసం నాకు శిక్షణ ఇచ్చిన యానిక్‌బెన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్టంట్స్‌ చేసేటప్పుడు నా శరీరంలోని ప్రతి భాగం నొప్పిగా ఉండేది. అయినా.. పెయిన్‌ కిల్లర్స్‌ సాయంతో నేను ముందుకుసాగాను. నిజానికి నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. కానీ.. ఎత్తయిన భవనాల నుంచి నేను దూకాను. ఎందుకంటే నా వెనుకాల ఎవరున్నారో నాకు బాగా తెలుసు’’ అని సమంత ఆ పోస్టులో పేర్కొంది.

థియేటర్లలో ఇన్నాళ్లు కుర్రకారును కేరింతలు పెట్టించిన సమంత తొలిసారిగా డిజిటల్‌ తెరమీద సందడి చేసింది. ‘తెర ఏదైనా.. పాత్ర ఏదైనా.. తాను దిగనంత వరకే’ అన్నట్లుగా ‘రాజీ’గా నటనతో రెచ్చిపోయింది. ఈ సిరీస్‌లో ఆమె శ్రీలంకన్‌ తమిళ ఫైటర్‌గా కనిపించింది. అయితే ఈ సిరీస్‌లో ఆమె మగవారికి దీటుగా ఫైట్‌ సన్నివేశాల్లో నటించింది. ఎటువంటి డూప్‌ లేకుండా ఆమె స్వయంగా ఫైట్‌ సన్నివేశాల్లో స్టంట్స్‌ చేసింది. రాజీ కథ కల్పితమే కావచ్చు కానీ.. అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి, ఆ యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవిస్తున్నవారికి ఇది నివాళిగా భావిస్తున్నా అంటోంది సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ సమంత. ‘రాజీ’గా తన నటనకు వస్తున్న స్పందనపై సమంత సంతోషం వ్యక్తం చేసింది. ‘రాజీ’ తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అని ఆమె చెప్పుకొచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.