ETV Bharat / sitara

మన హీరోలు అక్కడ.. ఆ దర్శకులు ఇక్కడ!

author img

By

Published : Jul 17, 2021, 8:31 AM IST

మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. మన హీరోలూ పాన్ ఇండియా ఇమేజ్​తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మార్కెట్ పాలిట కల్పతరువుగా కనిపిస్తున్నారు. అందుకే మన హీరోలపై పొరుగు పరిశ్రమలకు చెందిన దర్శకుల దృష్టిపడింది. మన దర్శకులు తయారు చేస్తున్న కథలపైనా పొరుగు హీరోలు మనసు పడుతున్నారు. అందుకే అక్కడి హీరోలు ఇక్కడికీ.. ఇక్కడి దర్శకులు అక్కడికీ అన్నట్టుగా మారింది వరస. ప్రస్తుతం ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారో చూద్దామా..

telugu heros with tamil directors.. tamil heros with telugu directors
మూవీ న్యూస్

తమిళ కథానాయకుడు విజయ్​తో వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరో తమిళ స్టార్ ధనుష్ మన దర్శకుడు శేఖర్ కమ్ములతో జట్టు కట్టనున్నారు. ధనుష్ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకు పచ్చజెండా ఊపేశారు. సూర్య, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి.. ఇలా పలువురు హీరోల కోసం మన తెలుగు దర్శకులు కథలు సిద్ధం చేశారు. అగ్ర దర్శకుడు శంకర్.. మన హీరో రామ్​చరణ్​తో సినిమా చేస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్​తో ప్రభాస్ పనిచేస్తున్నారు. రామ్​తో తమిళ దర్శకుడు లింగుస్వామి జట్టుకట్టారు. మురుగదాస్, లోకేష్ కనగరాజ్.. ఇలా పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ క్షణంలోనైనా తెలుగు కథానాయకులతో సినిమాల్ని ప్రకటించొచ్చని మాట్లాడుకుంటున్నారు.

.
రామ్​చరణ్​- శంకర్​

అందుకే..

సినిమా రూపకల్పనలో నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగిందో.. వ్యాపార విస్తృతి అంతే పెరిగింది. థియేటర్​ రూపేణా కాకుండా.. ఓటీటీ, శాటిలైట్, ఇతరత్రా సామాజిక మాధ్యమాల వేదికల రూపంలోనూ సినిమాకు ఆదాయం సమకూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బహు భాషల్లో గుర్తింపున్న హీరోలతోనూ, దర్శకులతోనూ సినిమాలు చేస్తే అందరికీ లాభదాయకం. నిర్మాతల ఆ వ్యూహాల్ని అనుసరించి కాంబినేషన్లను సెట్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇదివరకెప్పుడూ చూడని కొత్త కలయికలు సెట్ అవుతున్నాయి.

అలాగే కరోనాతో వచ్చిన విరామం వల్ల కూడా దర్శకుల దగ్గర కథలు పేరుకుపోయాయి. ఆ కథల్ని చేయడానికి సరిపడా కథానాయకులు దొరకడం లేదు. దాంతో దర్శకులు పొరుగు భాషలపైనా దృష్టిపెడుతూ అక్కడి కథానాయకులకు చెప్పి ఒప్పిస్తున్నారు. మార్కెట్ పరిధి పెరుగుతుందని తమిళ దర్శకులు తెలుగు కథానాయకులతో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల వాళ్లు మన హీరోలపై మరింత ఆసక్తి చూపుతున్నారు. అందుకు కారణం మన హీరోల ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖంగా కనిపిస్తుండడమే.

.
ప్రశాంత్​ నీల్​, ఎన్​టీఆర్​

రామ్​చరణ్​కు దక్షిణాదితోపాటు, హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న ఆయన.. అగ్ర దర్శకుడు శంకర్​కు ఓ మంచి ఎంపిక అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కలయికలో త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. 'ఖైదీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరించిన లోకేష్ కనకరాజ్.. ప్రభాస్ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఈ కలయికలో సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. మరో దర్శకుడు మురుగదాస్.. అల్లు అర్జున్​తో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

తెలుగు దర్శకులు.. తమిళ హీరోల్ని, తమ కథలతో ఒప్పించడంలో ముందున్నారు. వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల కథలకు విజయ్, ధనుష్ ఇప్పటికే ఫిదా అయ్యారు. సూర్య కోసం బోయపాటి శ్రీను, శివకార్తికేయన్ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కథలు సిద్ధం చేశారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కలయికలో సినిమాలు పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

.
విజయ్​

'రాక్షసుడు 2' చిత్రం కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ ప్రచారం సాగుతోంది. ఈ పరిణామంతో ప్రేక్షకులు కొత్త తరహా వినోదాన్ని ఆస్వాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు చాలామంది దర్శకులు, కథానాయకుల మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రజనీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితర తమిళ కథానాయకులకు తెలుగులో బలమైన మార్కెట్ ఉంది. మిగతా హీరోలు ఇప్పుడు నేరుగా సినిమాలు చేయడం వల్ల తెలుగులో వాళ్లకూ అభిమానగణం ఏర్పడే అవకాశాలున్నాయి. తెలుగు దర్శకులు, తెలుగు కథానాయకులు పొరుగు భాషలపై మరింత ప్రభావం చూపేందుకు ఆస్కారం లభిస్తుంది. దక్షిణాదిలోనే కాదు.. ప్రస్తుతం హిందీలోనూ తెలుగు దర్శకులు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

.
లింగుస్వామి, రామ్​, కృతి శెట్టి

పాన్ ఇండియా మంత్రం

పాన్ ఇండియా సినిమాల రూపకల్పనతో భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. హీరోల్ని ఒక భాషకు పరిమితం చేసి చూడలేం. దర్శకుల్నీ ఫలానా పరిశ్రమకు చెందినవాళ్లు అని ప్రత్యేకంగా అనలేం. దర్శ కులైనా, హీరోలైనా.. ఎవరూ ఎక్కడికీ వెళ్లరు. ఇదివరకటిలా ఒక భాషకు పరిమితం కాకుండా.. చేస్తున్నచోటే రెండు మూడు భాషలు లక్ష్యంగా సినిమాలు చేస్తుంటారు. పాన్ ఇండియా సినిమా సంస్కృతి ప్రభావమే అదంతా! దీని ఫలితంగా సినీ పరిశ్రమల ముఖచిత్రమే మారిపోయింది. ఎవరూ ఊహించని కొత్త కలయికలు వెలుగులోకి వస్తున్నాయి. తరచూ కొత్త జట్లు రంగంలోకి దిగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. దీంతో ఆయా హీరోలు, దర్శకనిర్మాతల వ్యాపార పరిధి కూడా విస్తృతం అవుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.