ETV Bharat / sitara

విశ్వవేదికపైనే కాదు.. బాక్సాఫీస్​ బరిలోనూ 'ఆటగాళ్లు'

author img

By

Published : Jul 23, 2021, 6:46 AM IST

టాలీవుడ్​లో​ క్రీడా నేపథ్యంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో తెరకెక్కుతున్న చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒలింపిక్స్​ జరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి ఈ ప్రత్యేక కథనం.

sports pictures in tollywood recent times
స్పోర్ట్స్ మూవీస్

ఇప్పుడందరి కళ్లు టోక్యో ఒలింపిక్స్‌ పైనే ఉన్నాయి. బ్యాడ్మింటన్‌లో సింధు స్వర్ణ పతకంతో సత్తా చాటుతుందా? ఆర్చరీలో దీపిక కుమారి బంగారు లక్ష్యాన్ని సాధిస్తుందా? మేరీకోమ్‌ తన పంచ్‌ పవర్‌తో మరో పతకం కొల్లగొడుతుందా? ఎక్కడా విన్నా ఇవే చర్చలు. విశ్వ క్రీడల్లో విజయదరహాసం చేసి.. మువ్వన్నెల జెండా రెపరెపలాడించే ఆటగాళ్లెవరని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఆటల సందడి విశ్వవేదికపైనే కాదండోయే.. బాక్సాఫీస్‌ బరిలోనూ కనిపిస్తోంది. వెండితెర వేదికగా తమ ఆటలతో మురిపించేందుకు మన హీరోలు సిద్ధమవుతున్నారు. థియేటర్లలో తమ సినిమాల్లో ఆటగాళ్లుగా సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆ తారలు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి?

బాక్లర్స పోరు..

చిత్ర సీమలో ఆటల సందడి ఇప్పటికే మొదలై పోయింది. 'తుఫాన్‌' సినిమాతో ఫరాన్‌ అక్తర్‌.. 'సార్పట్ట' చిత్రంతో ఆర్య ఓటీటీ వేదికగా తమ పంచ్‌ల పవర్‌తో సినీప్రియుల్ని అలరిస్తున్నారు. బాక్సింగ్‌ కథా నేపథ్యంతో రూపొందిన ఈ రెండు సినిమాలు ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడీ బాక్సింగ్‌ పరంపరను కొనసాగిస్తూ.. బాక్సాఫీస్‌ వేదికగా సత్తా చాటేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు యువ కథానాయకులు విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌.

.
.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లైగర్‌' చేస్తున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పుడీ సినిమా కోసమే చేతికి గ్లౌస్‌ తొడుక్కొని ఫైటింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టారు విజయ్‌. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గని' చిత్రం కోసం బాక్సర్‌గా మారారు మెగాహీరో వరుణ్‌ తేజ్‌. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం నెలలపాటు కఠిన కసరత్తులు చేసి మరీ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అవతారంలోకి మారారు వరుణ్‌. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది.

షూటర్‌ సఖి

'గుడ్‌లక్‌ సఖి' సినిమాతో బాక్సాఫీస్‌ ముందు షూటర్‌గా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది నటి కీర్తి సురేశ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించారు. షూటింగ్‌ నేపథ్యంలో రూపొందుతోన్న క్రీడా నేపథ్య చిత్రమిది. ఇందులో కీర్తి గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఓ మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన ఆమె.. షూటర్‌గా మారి తన ఆటతో ఊరికి, తన కుటుంబానికి ఎలా పేరు తెచ్చి పెట్టిందనేది ఈ చిత్ర కథ. ఈ సినిమాలో కీర్తి కోచ్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.

ప్రచార రేసులో మరికొన్ని..

'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాలో కబడ్డీ ఆటగాడిగా.. 'జెర్సీ' చిత్రంలో క్రికెటర్‌గా సినీప్రియుల్ని అలరించారు కథానాయకుడు నాని. ఇప్పుడాయన్ని ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మార్చేందుకు ఓ యువ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు చిత్ర సీమలో వార్తలు వినిపిస్తున్నాయి. 'ఉప్పెన' సినిమాతో తొలి అడుగులోనే అందరి దృష్టినీ ఆకర్షించారు యువ హీరో వైష్ణవ్‌ తేజ్‌. ఇప్పుడాయన అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్నారు. హాకీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుందని, ఇందులో వైష్ణవ్‌ హాకీ ఆటగాడిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.

.
.

ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో దేశానికి పతకాన్ని అందించిన తెలుగు తేజం కరణం మల్లేశ్వరి. ఇప్పుడామె జీవితకథతో పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కోన వెంకట్‌. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 'ఉప్పెన'తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు బుచ్చిబాబు సాన. ఇప్పుడాయన తన తదుపరి చిత్రం కోసం ఓ స్పోర్ట్స్‌ డ్రామా కథాంశాన్ని సిద్ధం చేశారని ప్రచారం వినిపిస్తోంది.

ఆనాటి మిల్కాసింగ్‌ నుంచి.. నిన్నటి ధోని దాకా ఎందరో క్రీడాకారుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించి బాక్స్‌ఫీసు పంటపండించుకున్నారు. ఇలా వీరి బాటలోనే సాగుతూ ఇంకొంత మంది దర్శక, నిర్మాతలు, కథానాయకులు వెండితెర ఆటగాళ్లగా మారుతున్నారు. క్రేజీ ప్రాజెక్టులతో ఉత్కంఠ రేపుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.