'ఈ చిత్రంలో ఎవ్వరూ చెప్పని ఓ అంశాన్ని చూపించాం'

author img

By

Published : Jan 11, 2022, 7:42 AM IST

director Sriram Aditya
director Sriram Aditya ()

Hero Movie updates: ఓటీటీలో వైవిధ్యభరిత సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకి 'హీరో' కచ్చితంగా నచ్చుతుందని దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య అన్నారు. మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో చిత్ర విశేషాలను ఆదిత్య పంచుకున్నారు.

Hero Movie updates: "అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం మా 'హీరో'. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఓటీటీలో వైవిధ్యభరిత సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. పద్మావతి గల్లా నిర్మించారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

'హీరో' ప్రాజెక్ట్‌లోకి మీరొచ్చారా? మీరే ఈ సినిమా అనుకున్నారా?

"ఓ సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే నిర్మాత పద్మావతి గల్లా నన్ను తొలుత పిలిచారు. అప్పుడే అశోక్‌ గల్లాని నాకు పరిచయం చేశారు. నిజానికి అప్పటికి తనతో సినిమా చేయాలని ఏమీ ఫిక్స్‌ అవలేదు. మామూలుగా మాట్లాడుకున్నామంతే. ఈ క్రమంలో సినిమాల పట్ల అశోక్‌ అభిరుచులేంటో తెలుసుకున్నా. తన మాటలు విన్నాక.. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఇంచుమించు ఒకేలా ఉన్నాయని అర్థమైంది. అప్పుడే ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాం".

అశోక్‌ను దృష్టిలో పెట్టుకునే కథ సిద్ధం చేశారా?

"అలా ఏమీ కాదు. ఈ కథ నేనెప్పుడో రాసి పెట్టుకున్నా. దీనికి ఓ కొత్త హీరో అయితేనే బాగుంటాడు. స్టార్‌తో చేస్తే అసలు వర్కవుటవ్వదు. ఎందుకంటే ఈ చిత్రంలో కథానాయకుడిది సినిమా హీరో అవ్వాలనుకునే పాత్ర. ఇలాంటి పాత్రకు కొత్త వాళ్లు అయితేనే సరిగ్గా సరిపోతాడు".

ప్రయోగాత్మకం, కమర్షియల్‌.. వీటిలో మీకు ఎక్కువ సవాల్‌గా అనిపించేది ఏది?

"నేను ప్రయోగం కూడా కమర్షియల్‌గా ఉండొచ్చనుకుంటా. ఎందుకంటే సినిమా అనేది బిజినెస్‌. ఎలాంటి ప్రయోగాత్మక కథ చెప్పినా.. దాన్ని వాణిజ్యపరంగానూ వర్కవుటయ్యేలా చేయాలి. అందుకే నేను ఏ సినిమా చేసినా కొత్తగా తీయాలి.. అందరికీ నచ్చేలా చేయాలి అనుకుంటా. నేనిప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలు అలా చేసినవే. నేను బలంగా నమ్మిన కథలతోనే చేశా".

సినీ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచమవుతున్నారు అశోక్‌. కథ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

"నేను అనుకున్నది ఒక్కటే.. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎక్కడా ఓ కొత్త అబ్బాయి చేస్తున్నాడు అని అనుకోకూడదు. అందుకే కథా చర్చలు జరుగుతున్నప్పుడే.. అశోక్‌కి చిరంజీవి, మహేష్‌బాబు ఇలా కొందరు హీరోలకు సంబంధించిన సినిమాలు చూడమని ఓ పెద్ద లిస్ట్‌ ఇచ్చా. అన్నీ గమనించమన్నా. వాళ్ల స్ఫూర్తితో ఓ బాడీ లాంగ్వేజ్‌ పట్టుకోమని చెప్పా. అదే సమయంలో స్క్రిప్ట్‌ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకున్నా. కొత్త హీరో కాబట్టి కామెడీ పైనో.. లవ్‌ ట్రాక్‌లపైనో నడిపించే ప్రయత్నం చేయకుండా నటుడిగా తనలోని అన్ని కోణాల్ని చూపించే విధంగా కథ తీర్చిదిద్దుకున్నా. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఓ ఆసక్తికర అంశాన్ని ఇందులో మేము చూపించనున్నాం. ఈ సినిమా కృష్ణ గారు చూశారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు".

రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌..

'హీరో' చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ప్రచార చిత్రంలో కనిపించిన సన్నివేశాల్ని బట్టి సినిమాలో వినోదానికి, యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. "కలల్లో బిర్యానీ వండుకుంటే.. రియాలిటీలో కడుపు నిండదు రా. రియాలిటీలోకి రా", "సినిమాల్లో హీరో అవుదామనుకున్న వాళ్లు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు" అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆఖర్లో నటుడు నరేశ్‌ 'కథేంటో చెప్తారా?" అని ప్రశ్నించగా.. "నాన్న క్రియేటీవ్‌ పీపుల్‌ ఎప్పుడు పడితే అప్పుడు కథలు చెప్పరు" అంటూ అశోక్‌ బదులివ్వడం నవ్వులు పూయించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: టాలీవుడ్ రేంజ్ పెరిగింది.. ప్రపంచం మన 'సినిమా' చూస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.