ETV Bharat / sitara

'మా అభిప్రాయాలు వేరైనా భావజాలం ఒక్కటే!'

author img

By

Published : Apr 13, 2021, 6:37 AM IST

Updated : Apr 13, 2021, 11:30 AM IST

Prakash Raj interview about Vakeel Saab
'మా అభిప్రాయాలు వేరైనా భావజాలం ఒక్కటే!'

పవన్​కల్యాణ్​కు, తనకు భిన్నాభిప్రాయాలున్నా.. తామిద్దరి భావజాలం ఒక్కటేనని అంటున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం 'వకీల్​సాబ్​' ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా ప్రకాశ్​రాజ్​ మీడియాతో ముచ్చటించారు.

ప్రకాశ్​రాజ్‌.. ఓ భావాల పుట్ట. అభినయంలో దిట్ట. ఆయనో చిన్న సంభాషణ చెబితే చాలు.. ఆయనకొక చిన్న ముఖ కవళిక చాలు.. ఆ సన్నివేశం తన వశం కావల్సిందే. చేసే పాత్రకు ప్రత్యేకమైన వన్నె చేకూరాల్సిందే! అవలీలగా పాత్రల్లో ఒదిగిపోయే విలక్షణ నటుడు.. ప్రకాశ్​రాజ్‌. ఇటీవల విడుదలైన 'వకీల్‌సాబ్‌'తో మరోసారి నందాగా మెరిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో ముచ్చటించారు.

"తెలుగు ప్రేక్షకులకు జీవితంలో ఓ భాగం సినిమా. ఇప్పుడొచ్చిన సినిమానే కాదు, వాటి వెనకటి సినిమాల్ని కూడా గుర్తు చేసుకుంటుంటారు. 'బద్రి' సినిమాలో ఉన్న నందానీ, బద్రిని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. నువ్వు నందా అయితే నేను బద్రి అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. అదొక అందమైన విషయం. అందుకే ఆ పాత్రల్ని సృష్టించిన పూరి జగన్నాథ్‌కు మరోసారి థ్యాంక్స్‌ చెప్పా. 'వకీల్‌సాబ్‌' విషయంలో నా పాత్రకు నందకిశోర్‌ అనే పేరు పెట్టడం దర్శకుడు శ్రీరామ్‌ వేణు మాస్టర్‌ స్ట్రోక్‌ అని భావిస్తాను. సినిమాలో నందాజీ అని పవన్‌కల్యాణ్‌ డైలాగ్‌ చెప్పేసరికి ప్రేక్షకులు 'బద్రి' సినిమాను గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా మంచి జ్ఞాపకాల్ని తీసుకురావడం మంచి పరిణామం కదా".

Prakash Raj interview about Vakeel Saab
ప్రకాశ్​రాజ్​
  • పవన్‌కల్యాణ్‌లాంటి ఓ కథానాయకుడు సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకులు దేని కోసం థియేటర్‌కు వస్తారో తెలుసుకొని, వాళ్లకు ఆ కోణంలో సంతృప్తినిస్తూనే చెప్పాల్సిన కథనూ చెప్పాలి. ఆ విషయాన్ని దర్శకనిర్మాతలు అర్థం చేసుకుని ఈ సినిమాను చేశారు. ఆఖరికి థియేటర్‌ నుంచి బయటికొచ్చేసరికి చెప్పిన విషయమే జనాల్లో ఉంటుంది కదా. పవన్‌ ఆలోచలకు తగ్గ కథ ఇది. అభిమానులు పాటలు, ఫైట్లను ఆశిస్తారు కాబట్టి అవి కూడా జోడిస్తూ సినిమాను తీర్చిదిద్దారు. ఓకే అయిన సన్నివేశాల్ని మాత్రమే తెరపై చూస్తున్నారు కానీ.. దాని వెనక చాలా పెద్ద ప్రయాణం ఉంది. దర్శకుడు సందర్భాల్ని, సంభాషణల్ని సృష్టించిన విధానం, ఈ సినిమా కోసం ఆయన చేసిన హోమ్‌ వర్క్, మేం చేసిన రిహార్సల్స్‌ ఇలా చాలా కథే ఉంది. మేం ఈ సినిమా సెట్‌కు, కోర్టుకు వచ్చినట్టుగానే వచ్చేవాళ్లం. లంచ్‌కు అందరూ కూర్చుని స్క్రిప్ట్‌ గురించి మాట్లాడుకునేవాళ్లం. అంత నిబద్ధతతో పనిచేశాం కాబట్టే సినిమా ఇంతగా ప్రేక్షకులకు చేరువైంది. మహిళల నేపథ్యంలో సాగే ఇలాంటి కథలు ఇంకా రావాలి, మగాళ్లు మారాలి, గౌరవించడం నేర్చుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు రాక్షసుల్లా బతుకుతాం? తల్లిదండ్రుల పెంపకంలోనే ఆ ఆలోచనా విధానం రావాలి. రాబోయే తరాలకు అది చాలా అవసరం.

"ఈ ఏడాది నా దర్శకత్వంలో సినిమాను మొదలు పెడతా. మూడు కథలు సిద్ధం చేసుకున్నా. నటనకీ, దర్శకత్వానికీ, రాజకీయాలకీ, వ్యక్తిగత జీవితానికీ ఇలా అన్నింటికీ ఓ సమయం ఉంది. చేసుకుంటూ వెళ్లడమే. ప్రతి రోజునీ పండగలా జరుపుకోండి. నా జీవితంలో నాకు ప్రతి రోజూ, ప్రతి క్షణం సంబరమే".

  • నాకూ, పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నేను పవన్‌ను ప్రేమిస్తాను కాబట్టి నాకలా ఉంటుంది. తనొక నాయకుడు. తనకున్న అభిమానులు వేరు. ఆయన ఇంకొకరితో వెళ్లడం నాకు నచ్చలేదు. ఆయన కూడా అంతే వినమ్రతతో నా అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఆ సంస్కృతి రావాలి. మా ఇద్దరి భావజాలం మాత్రం ఒక్కటే. జనాలకు మంచి చేయడం. జనం పట్ల, దేశం పట్ల, తెలుగువాళ్ల పట్ల మాకున్న ప్రేమ ఒక్కటే. మా చుట్టూ ఎవరెవరు ఉన్నారనే విషయంపైనే మాలో భిన్నాభిప్రాయాలు. ఒక నాయకుడికి ఉన్న బలం, ఓపిక పవన్‌కు ఉంది. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలతో ఓపికతో మెలగాలి. ప్రజలు మంచిని ఎంచుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మనం అనుకున్నదానికంటే పెద్దది రాజకీయం. 'నేను చేస్తున్నా కదా, మీరేంటి?' అని ప్రజలతో అనడానికి లేదు. వాళ్లలో మార్పుకు సమయం పడుతుంది".

ఇదీ చూడండి: 'సినిమాలకు దూరమైపోదామనుకున్నా.. కానీ'

Last Updated :Apr 13, 2021, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.