KBC season 13 : కళ్లు సరిగా కనిపించకపోయినా.. కోటి గెల్చుకుంది!

author img

By

Published : Sep 2, 2021, 10:19 AM IST

కళ్లు సరిగా కనిపించకపోయినా.. కోటి గెల్చుకుంది

‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి(KBC season 13)’ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత టీవీ కార్యక్రమాల్లో ఒకటి. దీని 13వ సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. మొదలైiన వారం రోజులకే ఒకామె కోటి రూపాయలు గెల్చుకుంది. ‘గతంలోనూ చాలామంది గెల్చుకున్నారు. కొత్తేముంది?’ అనుకుంటున్నారా! ఆమెకు కళ్లు సరిగా కనిపించవు మరి!

హిమానీ బుందేలా కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్‌-13(KBC season 13)లో కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారుగా నిల్చింది. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి విజయ్‌ సింహ్‌ చిరు వ్యాపారి. తల్లి సరోజ్‌ గృహిణి. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్‌ ఆమెను ఢీకొంది. కాళ్లూ చేతులకు బాగా దెబ్బలు తగిలాయి. ఎముకలేమీ విరగలేదు. దీంతో డాక్టర్‌ దెబ్బలకు కట్లు కట్టి పంపించేశారు. కొన్నిరోజులకు ఆమె తన కళ్లు బాగా మసకబారుతుండటం గమనించింది. హాస్పిటల్‌కి వెళితే ‘రెటీనా పక్కకు తొలిగింది, రెండు రోజుల్లో ఆపరేషన్‌ చేయకపోతే చూపు పోయే ప్రమాదం ఉంద’న్నారు. ఎనిమిది నెలల్లో నాలుగు ఆపరేషన్లు జరిగాయి. మూడో సర్జరీ వరకూ రంగులు సహా స్పష్టంగా చూడగలిగేది. నాలుగో ఆపరేషన్‌ నుంచి పూర్తిగా చూడలేకపోయింది. ఇప్పటికీ వెలుతురు, చీకటి మినహా ఏమీ గుర్తుపట్టలేదు.

కానీ.. తనేమీ కుంగిపోలేదు. లెక్కలంటే ఇష్టం. వాటినే సాధన చేసేది. చిన్నతరగతుల పిల్లలకు మెంటల్‌ మ్యాథ్స్‌ బోధిస్తోంది. ఆగ్రాలోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా చేస్తోంది. కేబీసీ మీద ఉన్న ఆసక్తితో ప్రయత్నించింది.

‘వెళ్లాలన్న తపన ఉంది. కానీ.. మిగతా వాళ్లు నన్నెలా చూస్తారోనన్న భయం ఉండేది. జాలి చూపిస్తారా, తమతో సమానంగా చూస్తారా అన్న సందేహముండేది. పైగా వాళ్లు కంప్యూటర్స్‌ వాడటంలో నాకంటే వేగంగా, ముందుగా ఉంటారు. పోటీ పడగలనా అనుకున్నా. కానీ అందరూ నాతో గౌరవంగా వ్యవహరించారు. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని వివరించింది 25 ఏళ్ల హిమానీ. అమితాబ్‌ బచ్చన్‌ ప్రశ్నలు చదువుతుంటే వాటిని విని, ఆప్షన్లు గుర్తుంచుకుని సమాధానాలిచ్చింది. కోటి రూపాయలు గెల్చుకుంది. ఏడు కోట్ల ప్రశ్ననీ ప్రయత్నించింది కానీ, చెప్పలేక వెనుదిరిగింది.

ఆ బహుమతి మొత్తంతో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వికలాంగులకు సాయపడేందుకు ఓ సంస్థని ప్రారంభిస్తానంటోంది. తనను ప్రోత్సహించిన కుటుంబానికీ కొంత ఇస్తానంటోంది.

ఆద్యంతం చిరునవ్వుతో, ఉత్సాహంగా ఉన్న ఆమెను అమితాబ్‌ ఓ ప్రశ్న అడిగారు. ‘కళ్లు కనిపించకపోయినా ఇంత ఉత్సాహంగా ఎలా?’ అని. ‘జీవితాన్ని సానుకూలంగా తీసుకుంటే ఆనందంతోపాటు విజయాలూ దక్కుతాయి. అలా ఉండగలిగితే చాలు’ అంటోంది హిమానీ. బాగా చెప్పింది కదూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.