ETV Bharat / sitara

కం'గన్​': అభినయ 'మణికర్ణిక'.. ఫైర్​బ్రాండ్!​

author img

By

Published : Mar 23, 2021, 8:05 AM IST

Updated : Mar 23, 2021, 8:22 AM IST

టీనేజ్​లోనే నటిగా ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్​ హోదాలో ఉంది నటి కంగనా రనౌత్. మంగళవారం (మార్చి 23) ఆమె పుట్టినరోజు సందర్భంగా కంగన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.

kangana ranaut birthday special story
అభినయ 'మణి'.. ఈ ఫైర్​బ్రాండ్​

ఆ అమ్మాయి అప్పుడే స్కూలు చదువు పూర్తి చేసుకుని, కాలేజీలోకి అడుగుపెట్టింది. అనుకోకుండా రంగుల ప్రపంచం వైపు ఆకర్షితురాలైంది. మోడలింగ్‌ చేస్తానని ఇంట్లో చెబితే వద్దన్నారు. పెద్ద నటిని అవుతానని ఆశ చూపితే అసలు కుదరదన్నారు. అరిచి గోలపెడితే ఎవరూ పట్టించుకోలేదు. తిక్కతిక్కగా ఆలోచిస్తోందని చెప్పి.. పెళ్లి చేసేయాలని ఇంట్లోవాళ్లు నిర్ణయించుకొన్నారు.

ఇక లాభం లేదనుకుని, బ్యాగ్‌ సర్దేసుకొంది. చండీఘఢ్‌లో ఉన్న స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది. అక్కడ్నుంచి దిల్లీ వెళ్లి, బ్రెడ్డు ముక్కలు తింటూ మోడల్‌గా కెరీర్‌ను కొనసాగించింది. ఆ తర్వాత కల సాకారం చేసుకునేందుకు ముంబయి చేరుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ విజేతగా నిలిచింది. ససేమిరా అన్న పెద్దల కళ్లల్లో ఆనందాన్ని చూసింది. తను పుట్టి పెరిగిన ఆ ఊరి జనాలు గర్వపడే స్థాయికి ఎదిగింది. ఆ అమ్మాయే.. ఫైర్​బ్రాండ్ కంగనా రనౌత్‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ చిన్న ఊరు నుంచి.. జాతీయస్థాయి నటిగా ఉన్నత స్థానానికి చేరింది. ఆమె జీవిత ప్రయాణంలోని విశేషాలు మీకోసం

kangana ranaut birthday special story
కంగనా రనౌత్

బాంబ్లా అమ్మాయి

ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలి దగ్గర బాంబ్లా అనే ఊరిలో 1987 మార్చి 23న పుట్టింది కంగన. నాన్న పేరు అమరదీప్‌. వ్యాపారం చేస్తుంటాడు. అమ్మ ఆశ. ఓ స్కూల్‌ టీచర్‌. బాల్యమంతా దేహ్రాదూన్‌లో గడిచింది. అక్కడా డావ్స్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. అప్పట్లోనే ఆటలు ఎక్కువగా ఆడేది. బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌. వ్యాసరచన పోటీల్లోనూ బహుమతులు గెలుచుకుంది. స్కూల్‌ చదువు పూర్తవ్వగానే సిమ్లాలోని ఓ కాలేజీలో చేరింది. అక్కడే మోడలింగ్‌పై ఇష్టం పెంచుకొంది.

కాఫీ షాపులో

దిల్లీలో మోడలింగ్‌ చేస్తూనే థియేటర్‌ ఆర్ట్స్‌పై దృష్టిసారించింది. అరవింద్‌ గౌర్‌కు చెందిన స్మిత థియేటర్‌ గ్రూప్‌లో చేరింది. ఆ బృందంతో కలిసి పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. కథక్‌ నృత్యంతో పాటు పాటలు పాడటమూ నేర్చుకొంది. అక్కడి నుంచే బాలీవుడ్‌ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఫలితం కనిపించలేదు. ముంబయి వచ్చింది. అక్కడే కాఫీ షాపులో అనుకోకుండా అనురాగ్‌ బసు కంటపడటం, ఆ తర్వాత 'గ్యాంగ్‌స్టర్' సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌కు వెళ్లడం, అందులో ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి.

'ఫ్యాషన్'‌ అదరహో

తొలి చిత్రం 'గ్యాంగ్‌స్టర్‌'తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది కంగన. అనంతరం ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె యాక్టింగ్ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. పైపెచ్చు అందాలు ఆరబోయడానికి అడ్డేమి చెప్పలేకపోవడం కంగనకు కలిసొచ్చింది. 'లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో', 'షకలక బూమ్‌ బూమ్‌', 'ఫ్యాషన్‌' సినిమాలతో విజయాలు అందుకొంది. 'ఫ్యాషన్‌'లో ప్రియాంక చోప్రాతో కలిసి నటించింది.

ఇందులో నటనకుగానూ ప్రియాంకకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కితే, ఉత్తమ సహనటిగా కంగనకు జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు అందంపైనే ఆధారపడిందని భావించిన బాలీవుడ్‌ వర్గాలు.. ఆమెలో మంచి నటి ఉందనే విషయాన్ని గుర్తించాయి.

kangana ranaut birthday special story
కంగనా రనౌత్

అదే అనుభవం

అవకాశాలు ఇవ్వమని ఎవరినీ చేయి చాచి అడగలేదని చెబుతుంటుంది కంగన. ఇప్పటివరకు ఆ అవసరం రాలేదని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది. 'ఫ్యాషన్‌' తర్వాత.. 'రాజ్‌', 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి', 'నాక్‌ ఔట్‌', 'నో ప్రాబ్లమ్‌', 'తను వెడ్స్‌ మను', 'రెడీ', 'డబుల్‌ ఢమాల్‌', 'రాస్కెల్స్‌', 'మిలే న మిలే హమ్‌', 'షూట్‌ అవుట్‌ ఎట్‌ వాదాలా', 'క్రిష్‌3', 'ఐ లవ్‌ న్యూయర్‌' - ఇలా ఎప్పటికప్పుడు ప్రాధాన్యమున్న పాత్రలు, చిత్రాల్లో అవకాశాలు సొంతం చేసుకుంది. విజయాలు అందుకొంది.

'ఒకట్రెండు పెద్ద సంస్థలు నాకు సినిమాలు ఇవ్వలేదని ఎప్పుడూ బాధపడను. రాకేశ్ రోషన్, కరణ్‌ జోహార్‌ లాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం చక్కటి అనుభవం' అని చెప్పింది కంగనా. ఈ అమ్మడు తెలుగులో ప్రభాస్‌తో కలిసి 'ఏక్‌ నిరంజన్‌'లో నటించింది.

కంగనా రనౌత్​.. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా రూపొందుతోన్న 'తలైవి' చిత్రంలో నటిస్తుంది. కంగన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆ చిత్ర ట్రైలర్​ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు 'ధాకఢ్​' అనే హిందీ చిత్రంలోనూ నటిస్తోంది.

kangana ranaut birthday special story
కంగనా రనౌత్

పంచోలి పాత్ర?

తొలినాళ్లలో కంగన బాలీవుడ్‌ రంగప్రవేశం వెనుక నటుడు ఆదిత్య పంచోలి ఉన్నాడనే ప్రచారం సాగింది. నటిగా స్థిరపడ్డాక ఆదిత్య పంచోలికి దూరమైందని చెబుతుంటారు. అయితే అదంతా ఉత్తిదేనని అంటోంది కంగన. "నేను ముంబయి రావడం వెనుక ఎవరి ప్రమేయం లేదు. చిన్న వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. సగం తెలిసీ తెలియనీ వయసులో కొన్ని తప్పులు చేశా. అది మానసికంగా శారీరకంగా తీవ్ర నష్టాన్ని కలిగించింది. అన్ని రకాల వ్యక్తులతో కలిసి పోవడం నేను చేసిన పెద్ద తప్పు. అంతకు మించి మరేమి లేదు" అని అంటోంది.

బంధాలు.. పెరిగిన దూరాలు

బాయ్‌ ఫ్రెండ్స్‌ను మార్చడంలో ముందుంటుంది కంగన. ఆ మధ్య కొన్నాళ్లపాటు సల్మాన్‌ఖాన్‌తో సన్నిహితంగా మెలిగింది. మరి కొన్నాళ్లు హాలీవుడ్‌కు చెందిన ఒకరిద్దరు నటులతో స్నేహం చేసింది. ఎవరైనా సరే.. ఆమెతో అనుబంధాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేరనే అభిప్రాయం బాలీవుడ్‌లో వర్గాల నుంచి వినిపిస్తుంటుంది. మరి నిజంగా కంగనకు దగ్గర స్నేహితులు ఎవరూ లేరా? ఆమె మాత్రం.. హృతిక్‌ రోషన్‌ పేరు చెబుతుంటుంది. నా మనసును అర్థం చేసుకున్న వ్యక్తి హృతిక్‌. 'అందరూ వాళ్ల వాళ్ల అభిప్రాయాల్ని నాపై రుద్దేందుకు ప్రయత్నిస్తుంటారు. హృతిక్‌ మాత్రం నన్ను నాలాగే చూస్తారు' అనేది కంగన ఒకప్పటి మనసులోని మాట. కానీ ఇప్పుడు అంతటి అనుబంధం బట్టబయలైంది. ఇప్పుడు ఒకరిపై ఒకరికి సదాభిప్రాయం లేదు.

kangana ranaut birthday special story
కంగనా రనౌత్

డాక్టర్‌ కాదు ..యాక్టర్‌

ఇంట్లో అందరూ డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కాలేజీలో చేరేంతవరకూ కంగన లక్ష్యమూ అదే. అందుకే సైన్స్ గ్రూప్‌ తీసుకుంది. కాలేజీలోకి అడుగుపెట్టాకే లక్ష్యం మారింది. మోడల్‌గా, నటిగా కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇంట్లోవారికి ఇష్టం లేకపోయినా, తనకు నచ్చిన దారిలోనే ప్రయాణం చేసింది. తన కలను తొందరగా సాకారం చేసుకొంది. 'నటిగా నేను కన్న కల సాకారమైంది. మా ఊరి నుంచి ఎంతోమంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఆ విషయం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. అయితే జీవితంలో చాలా కోల్పోయాను. ప్రేమలేఖలు రాయాల్సిన వయసులో రేయింబవళ్లు కష్టపడ్డాను. అయినా జీవితంలో ఓ వ్యక్తికి అన్నీ సంపూర్ణంగా దొరకాలంటే కష్టమే కదా' అని చెబుతోంది కంగన.

సినిమాలు..అవార్డులు

'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ'లో రాణీ లక్ష్మిబాయ్‌గా నటించి మెప్పించింది కంగనా. ఈమెకు వివాదాలు ఎక్కువే. ఈ చిత్రాన్ని మొదట దర్శకత్వం చేసింది క్రిష్‌. ఈ విజయం నాదంటే నాది అంటూ ఇద్దరూ పోటీపడ్డారు. 'గ్యాంగ్‌స్టర్‌', 'లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో', 'తను వెడ్స్‌ మను' లాంటి చిత్రాలకు ఉత్తమ నటిగా అవార్డు పొందింది.

15ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటికే మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న కంగనా.. ఇప్పుడు తన కీర్తి కిరీటంలో మరో జాతీయ అవార్డును పొదువుకుంది. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. 'మణికర్ణిక', 'పంగా' చిత్రాల్లోని నటనకుగానూ ఉత్తమ నటిగా మరో జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది.

ఇదీ చూడండి: జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్​

Last Updated :Mar 23, 2021, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.