థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఎప్పటికో?

author img

By

Published : Aug 17, 2021, 1:30 PM IST

acharya, akhanda

కరోనా కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల బాక్సాఫీస్​ వద్ద సినిమాల సందడి మొదలైంది. అనుకున్నంత స్థాయిలో కాకున్నా ప్రేక్షకులైతే వస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో చిన్న చిత్రాలు థియేటర్లలో అలరిస్తున్నాయి. కానీ తుదిదశకు చేరుకున్న 'ఆచార్య', 'అఖండ', ఇప్పటికే పూర్తయిన 'లవ్‌స్టోరి', 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమాల విడుదల ఎప్పుడనేదే ఇంకా ఖరారు కాలేదు. సినీ వర్గాలు అనుకుంటున్నట్లు వాటి రిలీజ్​ టార్గెట్​ దసరాకేనా? లేదా మరింత వాయిదా పడనున్నాయా? అనే వార్తలు చిత్రసీమలో వినిపిస్తున్నాయి.

ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియదు. కరోనా కల్లోలం ప్రభావం ఫలితమే ఇదంతా. తొలి కాపీతో సిద్ధమైన సినిమాలు కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఇక సెట్స్‌పై ఉన్న సినిమాల సంగతి సరే సరి. వాటి చిత్రీకరణ సజావుగా సాగాలి, విజయవంతంగా పూర్తి కావాలి, విడుదల కోసం థియేటర్ల దగ్గర తగిన ఖాళీ దొరకాలి. అప్పుడు కానీ బొమ్మ తెరపై పడే అవకాశం ఉండదు. అయినా సరే.. సినీ వర్గాలు మాత్రం ఎప్పట్లాగే విడుదల కోసం కట్చీప్‌లు వేయడం మొదలు పెట్టేశాయి. అధిక వ్యయంతో తెరకెక్కిన తారల సినిమాలన్నీ పండగల్ని చూసుకుని తేదీల్ని ప్రకటించాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలేమో.. ఇదే అదను అన్నట్టుగా వారం వారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరికొన్ని ఓటీటీ వేదికల్ని ఎంచుకున్నాయి. మొత్తంగా రెండో దశ కరోనా తర్వాత మళ్లీ విడుదల తేదీలపై ఓ స్పష్టతైతే వచ్చింది. మరి అనుకున్నట్టు విడుదలవుతాయా లేదా అనే సంగతిని మాత్రం కాలమే నిర్ణయించాలి. అయితే ఇంకా కొన్ని కీలకమైన సినిమాలు ఇప్పటికీ విడుదల తేదీల్ని ప్రకటించలేదు. మరి వాటి పయనం ఎటు? ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తాయి?

chiranjeevi acharya and balakrishna akhanda ready for dasara release
ఆచార్య మూవీలో చిరంజీవితో రామ్​చరణ్

వాటికి ముహుర్తం ఎప్పుడు?

దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. టాలీవుడ్‌ ఈ బెర్తులన్నిటినీ ఎప్పుడో నింపేసింది. దసరాకి 'ఆర్‌ఆర్‌ఆర్‌', దీపావళికి 'గని', 'అన్నాత్తే', క్రిస్మస్‌కి 'పుష్ప', 'కె.జి.ఎఫ్‌2', సంక్రాంతికేమో పవన్‌కల్యాణ్‌- రానా 'భీమ్లా నాయక్‌', మహేష్‌బాబు 'సర్కారు వారి పాట', ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌'. ఇలా వచ్చే ఏడాదివరకు బాక్సాఫీసుకి విరామమే కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనేమో అగ్ర తారల సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. టికెట్‌ ధరల సమస్య కొలిక్కి రాలేదు. అందుకే ఈ రెండు నెలల్ని చిన్న సినిమాలకే వదిలేసింది చిత్రసీమ. సెప్టెంబరులో పలు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. కానీ తుదిదశకు చేరుకున్న 'ఆచార్య', 'అఖండ', ఇప్పటికే పూర్తయిన 'లవ్‌స్టోరి', 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సినిమాల విడుదల ఎప్పుడనేదే ఇంకా ఖరారు కాలేదు.

chiranjeevi acharya and balakrishna akhanda ready for dasara release
అఖండలో బాలకృష్ణ

దసరానే లక్ష్యమా?

బలమైన అభిమానగణం ఉన్న అగ్ర తారలు చిరంజీవి, బాలకృష్ణ. వాళ్లు నటించిన 'ఆచార్య', 'అఖండ' తుదిదశకు చేరుకున్నాయి. ఆ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. కానీ ఎప్పుడనేదే ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాల వ్యూహం ఏమిటనేది ఇంకా తేలడం లేదు. పరిశ్రమ వర్గాలు మాత్రం దసరానే వీటి లక్ష్యం అని చెబుతున్నాయి. అక్టోబరు 13న 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల ఖరారైనప్పటికీ, ఆ నెల ప్రథమార్థంపైనే ఈ రెండు సినిమాలు కన్నేశాయనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. ప్రకటించిన సినిమాల విడుదల తేదీలు కూడా అనూహ్యంగా వాయిదా పడుతున్నాయి. వాటి స్థానంలో ఎవరూ ఊహించని చిత్రాలు ముందుకొస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏ సినిమా ఎప్పటికి వాయిదా పడుతుందో, వాటి స్థానంలో ఏ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.

chiranjeevi acharya and balakrishna akhanda ready for dasara release
లవ్​స్టోరీలో నాగచైతన్య

'లవ్‌స్టోరి' ఎదురు చూపులు

chiranjeevi acharya and balakrishna akhanda ready for dasara release
మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​లో అఖిల్​

థియేటర్లలో విడుదల కోసమే ఎప్పట్నుంచో ఎదురు చూస్తోంది 'లవ్‌స్టోరి'. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల సమస్య కొలిక్కి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి సెకండ్‌ షో ప్రదర్శన కష్టం. అన్ని పరిస్థితులు అక్కడ అనుకూలం కాగానే.. ఏ క్షణంలోనైనా 'లవ్‌స్టోరి' విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో వినాయక చవితి సందడి కూడా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. నాగచైతన్య సోదరుడు అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రీకరణ కూడా పూర్తయింది. కానీ విడుదల ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. మరి అది ఓటీటీలోనే విడుదలవుతుందా లేక, థియేటర్లలోనే అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇదీ చదవండి: Shankar Birthday: కథలతో ప్రయోగాలు.. సినిమాలతో సంచలనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.