ETV Bharat / sitara

ముద్దుగుమ్మల మది దోచుకున్న రొమాంటిక్​ హీరో!

author img

By

Published : Sep 4, 2020, 5:29 AM IST

Rishi Kapoor
రిషి కపూర్

రొమాంటిక్​ హీరోగా మగువల మనసు దోచారు బాలీవుడ్​ దిగ్గజం రిషి కపూర్​. నేడు ఆయన 69వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

'పృథ్వీరాజ్‌ థియేటర్స్‌' వ్యవస్థాపకులు పృథ్వీరాజ్‌ కపూర్‌ది ఒక గొప్ప కళాకారుల ఖాందాన్‌. మూకీ యుగం నుంచి టాకీ యుగం దాకా నలభై ఏళ్లకు పైగా హిందీ చలనచిత్ర సీమకు మార్గదర్శిగా ఉంటూ, ఏకచత్రాధిపత్యం వహించిన చలనచిత్ర పితామహుడు ఆయన. ఆ ఒరవడిని పెద్ద కుమారుడు రాజ్‌కపూర్‌ చేతబూని, ఆర్‌.కె.స్టూడియోస్‌ నిర్మించి గొప్పచిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడుగా రాణించి ది గ్రేటెస్ట్‌ షో మ్యాన్ ఆఫ్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్నారు. రాజ్‌కపూర్‌ తమ్ముళ్లు షమ్మికపూర్, శశికపూర్‌లు కూడా హిందీ చలనచిత్ర పరిశ్రమలో నటులుగా, చిత్ర సమర్పకులుగా బహుముఖ సేవలు అందించారు. పృథ్వీరాజ్‌ తనయులందరికీ ‘పద్మ’ పురస్కారాలు లభించాయి. రాజ్‌కపూర్‌ తనయులు రణధీర్‌ కపూర్, రిషికపూర్‌లు కూడా బాలీవుడ్​కు మూడవ తరం వరంగా మారి మంచి నటులుగా, దర్శకులుగా కూడా రాణించారు. వారిలో రిషి కపూర్‌ది అద్వితీయ రికార్డు. నూట ముప్పై సినిమాలకు పైగా హీరోగా, క్యారెక్టర్‌ నటుడిగా రాణిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించడమే కాకుండా, నాలుగో తరానికి తన కుమారుడైన రణబీర్‌ కపూర్‌ని ఒక మంచి హీరోగా తీర్చిదిద్ది కపూర్‌ వంశపాలనను కొనసాగిస్తున్నారు. ఈ రోజు రిషి కపూర్‌ (సెప్టెంబర్‌ 4) జయంతి. చింటూ అనే ముద్దుపేరుతో పిలిపించుకునే రిషి‌ గురించి ప్రత్యేక కథనం మీ కోసం..

Rishi Kapoor
రిషి కపూర్

బాబీతో ప్రభంజనం..

రాజ్‌కపూర్‌ సినిమాలకు ఎదురులేకుండా ఉన్న రోజుల్లో ఒక గట్టి ఎదురుదెబ్బ తగలడం జీర్ణించుకోలేని విషయం. నటజీవిత చరమాంకంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేరా నామ్‌ జోకర్‌ (1970) సినిమా బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్‌ కావడమే కాదు, సినిమా నిర్మాణానికి ఆరు సంవత్సరాలు పట్టడం వల్ల రాజ్‌కపూర్‌ ఆస్తులు మొత్తం హరించాయి. ఒకరకంగా రాజ్‌ ఆత్మకథగా చెప్పుకునే ఈ సినిమా ఏకంగా నాలుగు గంటల పదిహేను నిమిషాల నిడివి, రెండు ఇంటర్వెల్స్‌తో నడవడం వల్ల ప్రేక్షకులు విసుగు చెందారు. దాంతో రాజ్‌కపూర్‌కు ప్రేక్షకుల నాడి ఎలాంటిదో బోధపడింది. ఆయనలో కసి పెరిగింది. బలమైన సినిమా తీసి విజయం సాధించాలని ఒక టీనేజి ప్రేమకథను రూపొందించారు. అదే సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా బాబీ (1973). టీనేజి ప్రేమికులు పారిపోయి ప్రాణ త్యాగానికి సాహసించడం వంటి ఎన్నెన్నో మలుపులతో సాగిపోయే ఈ ప్రేమకావ్యాన్ని సెల్యూలాయిడ్‌ మీదకు తనదైన శైలిలో ఎక్కించడం రాజ్‌కపూర్‌కు నల్లేరు మీద బండి నడకలా సాగింది! తొలిసారి హీరోగా రిషి కపూర్‌ 'బాబీ' సినిమాలో డింపుల్‌ కపాడియా సరసన నటించారు. బాబీ పాత్ర కొత్తరకంగా ఉండడం యువతరానికి ఎంతగానో నచ్చింది. ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. రాత్రికి రాత్రే రిషికపూర్‌ స్టార్‌ అయిపోయారు. తర్వాత రిషికపూర్‌ బాలీవుడ్‌ ప్లే బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు.

బాబీ అనంతరం 2000 సంవత్సరం వరకు 40 సినిమాల్లో హీరోగా నటించారు రిషి. వాటిలో లైలా మజ్ను, రఫూ చక్కర్‌, కర్జ్’, ప్రేమ్‌ రోగ్‌, నగినా, హనీమూన్ ‌2, చాందిని వంటి సినిమాలు సూపర్‌ హిట్లయ్యాయి. అదే కాలంలో 13 మల్టీస్టారర్​ సినిమాల్లో సహాయ హీరోగా నటించారు. వాటిలో ఖేల్‌ ఖేల్‌ మే, కభి కభి, హమ్‌ కిసీ సే కమ్‌ నహీ, బదల్తే రిష్తే, ఆప్‌ కే దీవానే, సాగర్‌ సహా పలు సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి.

Rishi Kapoor
రిషి కపూర్

సహాయ నటుడిగా మారి...

90వ శకం చివర్లో రిషి కపూర్‌ హీరోగా నటించిన సినిమాలు రాణించలేదు. దీంతో రిషి తన పంథా మార్చుకుని సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. పైగా ఆయన వయసు యాభై ఏళ్లకు చేరడం కూడా ఒక ప్రతికూల అంశంగా మారింది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన 'ఏ హై జల్వా' (2000) సినిమాలో రిషి..‌ సల్మాన్​కు తండ్రిగా నటించారు. సైఫ్‌ అలీ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతిని అందించిన 'హమ్‌ తుమ్' (2004) సినిమాలో అతని తండ్రిగా రిషి మెప్పించారు. తర్వాత 'ఫనా'లో జుల్ఫీకర్‌ ఆలి బేగ్‌గా, 'నమస్తే లండన్'‌లో మన్మోహన్‌ మల్హోత్రాగా, 'లవ్‌ ఆజ్‌ కల్​'లో సైఫ్‌ అలీ తండ్రి వీర్‌ సింగ్‌గా, 'పాటియాలా హౌస్'‌లో బావూజీగా మంచి పాత్రలు పోషించారు.

చాలా ఏళ్ల తరువాత భార్య నీతూ సింగ్​తో 'దో దూని చార్'‌లో దంపతులుగా నటించారు. రిషికపూర్‌ నీతూసింగ్‌ని జనవరి 20, 1980న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి జంటగా 15 సినిమాల్లో నటించారు. యువ హీరో రణ్‌బీర్‌ కపూర్, రిద్ధిమా వీరి సంతానం. 2009లో రష్యన్‌ ప్రభుత్వం రిషికపూర్‌ సినీపరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఘనంగా సన్మానించింది. నీతూసింగ్‌-రిషికపూర్లను ఉత్తమ జోడీగా నిర్ణయించి జీ సినీ అవార్డుల సంస్థ ఘనంగా సత్కరించింది. స్కీన్ర్, ఫిలింఫేర్‌ సంస్థలు రిషికపూర్‌కు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశాయి. ఇవి కాకుండా మరెన్నో సంస్థలు రిషికి ఉత్తమ సహాయ నటుడి బహుమతులు అనేకసార్లు అందజేశాయి.

Rishi Kapoor
రిషి కపూర్

మరిన్ని విశేషాలు...

  • రిషి కపూర్‌కు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం అలవాటు. ఆ మధ్య రిషికపూర్‌ చేసిన ట్వీట్‌ కొందరి అనుమానాలకు తావిచ్చింది. డింపుల్‌-రాజేష్‌ ఖన్నా కూతురు ట్వింకిల్‌కు రిషి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ "బేబీ...బాబీ సినిమాలో ‘అక్సర్‌ కోయి లడకీ ఇస్‌ హాల్‌ మే, కిసీ లడకే సే సోలహ్వే సాల్‌ మే పాటను చిత్రీకరిస్తున్న సమయంలో నువ్వు మూడు నెలల పసికందుగా నీ తల్లి గర్భంలో ఆ పాటను ఆలకిస్తూ ఉన్నావు. నీకు జన్మదిన శుభాకాంక్షలు" ట్వీట్‌ చేశారు. ఈ సందేశాన్ని ఆసరాగా తీసుకొని, ట్వింకిల్‌ ఖన్నా పుట్టింది రాజేష్‌ ఖన్నాతో పెళ్లయాకా, లేక ముందుగానేనా అంటూ కొందరు తుంటరివాళ్లు ప్రశ్నించారు. రిషికి కోపమొచ్చింది. "బాబీ సినిమా నిర్మాణ దశలో డింపుల్‌ టీనేజిలో ఉండగానే రాజేష్‌ ఖన్నా కాకాతో మార్చి 73లో ఆమెకు పెళ్లయింది. దీంతో చిత్ర నిర్మాణానికి అంతరాయం కలిగింది. బాబీ సినిమా 28 సెప్టెంబరు 1973న విడుదలైంది. ట్వింకిల్‌ బేటీ 29, డిసెంబరు 1973న జన్మించింది" అంటూ ఆ తుంటరులకు గట్టి సమాధానమిచ్చారు.
  • ఆ రోజుల్లో మీరు మంచి యువ రొమాంటిక్‌ హీరో కదా అని ఎవరో అడిగిన ప్రశ్నకు... "సినిమాల్లో రొమాన్స్‌ చేసేవాళ్లు, హీరోయిన్‌తో పాటలు పాడేవారు, విలన్లతో ఫైటింగులు చేసేవారు హీరోలు కాలేరు. అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, రక్షణ పోలీసులు, వైద్యులే నిజమైన హీరోలు" అంటూ అద్భుతమైన జవాబిచ్చారు.
  • 2007లో రిషి 'డోంట్‌ స్టాప్‌ డ్రీమింగ్‌' అనే ఇంగ్లీష్‌ చిత్రంలో నటించారు. షమ్మి కపూర్‌ కుమారుడు ఆదిత్య రాజ్‌కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్‌ హీరోగా రిషికపూర్‌ నటించినన్ని హిందీ సినిమాల్లో మరే నటుడూ నటించలేదు. ఆయన నటించిన నూట ముప్ఫైకి పైగా చిత్రాల్లో వందకు పైగా చిత్రాలు రొమాంటిక్‌ హీరోగానే. రొమాంటిక్‌ హీరోగా రిషి నటించిన ఆఖరి సినిమా 'ది బిజినెస్‌ ఆఫ్‌ లవ్'‌. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా 2000 సంవత్సరం దాకా విడుదలకు నోచుకోలేదు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • కరణ్‌ జోహర్‌ నిర్మించిన 'అగ్నిపీఠ' సినిమాలో రిషి విద్రోహకారుడిగా నటించారు. తొంభయ్యవ దశకం చివర్లో రిషి నటించిన సినిమాలు పరాజయం చవి చూశాయి. దాంతో 2000 తరవాత సహాయక పాత్రల పోషణకు రిషి పరిమితమయ్యారు. రిషికపూర్‌ హీరోగా నటించిన 'హెన్నా' అనే చిత్రం రాజ్‌కపూర్‌ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా. రాజ్‌కపూర్‌ మరణంతో ఆ సినిమాను రిషి అన్న రణధీర్‌ కపూర్‌ పూర్తిచేశారు. 'మేరా నామ్‌ జోకర్‌' సినిమాకు ముందే రిషి కెమెరా ముందుకు వచ్చారు.
  • రాజ్​ కపూర్‌ నిర్మించిన శ్రీ 420 సినిమాలో ప్యార్‌ హువా ఇకరార్‌ హువా పాటలో చిన్నపిల్లాడిగా తప్పటడుగులు వేస్తూ కనిపిస్తారు రిషి. ఖేల్‌ ఖేల్‌ మే, కభి కభి, అమర్‌ అక్బర్‌ ఆంథోని, దూస్రా ఆద్మీ వంటి సినిమాల్లో రిషి‌ సరసన హీరోయిన్‌గా నీతూసింగ్‌ నటించింది. తరువాత 1980లో రిషికపూర్‌ హీరోయిన్‌ నీతూసింగ్‌ను ప్రేమించి పెళ్లాడారు. అప్పుడు రిషి వయసు 29 ఏళ్లు. తను నీతూని వివాహమాడాలనుకుంటునట్లు చెప్పేందుకు నీతూ తల్లిదండ్రుల ఇంటికి పూర్తి జ్వరంతో ఉండగా వెళ్లారు. నీతూ తల్లిదండ్రులు ఆ స్థితిలో వచ్చిన రిషి ప్రేమకు ఫిదా అయిపోయి పెళ్లికి ఒప్పేసుకున్నారు.
  • తండ్రి రాజ్‌కపూర్, సోదరుడు రణ్‌ధీర్ ‌కపూర్‌లాగే తను కూడా దర్శకుడిగా రాణించాలని అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యా రాయ్‌లతో 1999లో 'ఆబ్‌ లౌట్‌ చలే' అనే సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నారు రిషి. తరవాత దర్శకత్వం జోలికి వెళ్లలేదు.

ఇదీ చూడండి భన్సాలీతో రణ్​వీర్ కాదు రణ్​బీర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.