ETV Bharat / sitara

Suriya Birthday: సూర్య అసలు పేరేంటో తెలుసా?

author img

By

Published : Jul 23, 2021, 5:34 AM IST

Updated : Jul 23, 2021, 9:59 AM IST

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ బలమైన మార్కెట్ సంపాదించిన హీరో సూర్య. ఈ హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం.

suriya
సూర్య

టాలీవుడ్​లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. శుక్రవారం(జులై 23) ఆయన 46వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక కథనం..

తండ్రి పేరు చెప్పకుండా..

ప్రముఖ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు తొలి సంతానంగా 1975 జులై 23న చెన్నైలో జన్మించారు సూర్య. అసలు పేరు శరవణన్‌ శివకుమార్‌. కోయంబత్తూరులో పెరిగారు. సూర్యకు తమ్ముడు కార్తి, చెల్లెలు బృందా శివకుమార్‌ ఉన్నారు. మద్రాసులోని సెయింట్‌ బేడీ స్కూల్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. చదువయ్యాక ఎనిమిది నెలల పాటు దుస్తుల ఎగుమతి కంపెనీలో పనిచేశారు. అయితే ఆ కంపెనీలో తాను నటుడు శివకుమార్‌ తనయుడు అనే విషయాన్ని సూర్య ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత ఆ కంపెనీ ఓనరే స్వయంగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

Suriya
సూర్య

తొలి అవకాశం అలా!

తొలుత సినిమాలపై అంతగా ఆసక్తి లేని సూర్యకు 'ఆశై' సినిమాలో అవకాశం వచ్చినా తిరస్కరించారు. 1997లో 'నెరుక్కు నెర్‌' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మణిరత్నం నిర్మించిన చిత్రమిది. ఆ తర్వాత 'కాదలే నిమ్మది', 'సందిప్పొమ', 'పెరియన్న', 'పూవెల్లమ్‌ కెట్టుప్పర్‌' తదితర చిత్రాల్లో నటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖ్ తెరకెక్కించిన 'ఫ్రెండ్స్‌'తోనూ, బాల దర్శకత్వం వహించిన 'నందా'తోనూ సూర్య సినీ ప్రయాణం మలుపు తిరిగింది.

తెలుగులోనూ మంచి డిమాండ్

గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన 'కాక్కా కాక్కా' చిత్రం సూర్యకు ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం తెలుగులో 'ఘర్షణ'గా రీమేకై విజయం సాధించింది. బాల దర్శకత్వం వహించిన 'పితామగన్‌' కూడా తమిళంతో పాటు, తెలుగులోనూ అనువాదమై ఆయనకు మంచిపేరు తీసుకొచ్చింది. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గజిని'తో సూర్య సినీ ప్రయాణమే మారిపోయింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పట్నుంచి దాదాపుగా సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'సింగమ్‌' సిరీస్​ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు సూర్య.

Suriya
సూర్య

16ఏళ్ల యువకుడిగా.. 65ఏళ్ల వృద్ధుడిగా

గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' చిత్రంలో 16ఏళ్ల యువకుడిగా, 65 ఏళ్ల వృద్ధుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి వారెవ్వా అనిపించుకున్నారు.

జ్యోతికతో వివాహం

'కాక్కా కాక్కా' చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక జ్యోతికను సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. జ్యోతిక రీఎంట్రీ ఇచ్చిన '36 వయదినిలే' సినిమా కోసం సూర్య నిర్మాతగా మారారు. ఆ తరువాత 'పసంగ2', '24', 'మగలిర్‌ మట్టుమ్‌', 'కడైకుట్టి సింగమ్‌' చిత్రాల్ని నిర్మించారు.

ఆస్కార్​కు సూరారై పొట్రు

సూర్య హీరోగా దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్​లో రూపొందిన 'సూరారై పొట్రు' చిత్రం ఆస్కార్​ రేసులో నిలిచింది. అకాడమీ అవార్డుల స్క్రీనింగ్​ రూమ్​లో ప్రదర్శించనున్న 366 సినిమాల్లో ఈ చిత్రానికి చోటు దక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో ఈ సినిమా పోటీలో నిలిచింది. కానీ తుదిజాబితాలో ఈ సినిమాకు నిరాశే ఎదురైంది.

Suriya
సూర్య

ప్రస్తుతం

ప్రస్తుతం సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ తెరకెక్కుతోంది. అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో 'ఎతర్కుమ్ తునింధవన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు నెట్​ఫ్లిక్స్​ 'నవరస' వెబ్​సిరీస్​లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Last Updated : Jul 23, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.