ETV Bharat / science-and-technology

50 ఏళ్ల తర్వాత అమెరికా మూన్ మిషన్- ప్రయోగించిన గంటలకే సమస్య- ల్యాండింగ్ కష్టమే!

author img

By PTI

Published : Jan 9, 2024, 7:07 AM IST

US Moon Mission 2024 : చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం 50 ఏళ్ల విరామం తర్వాత అమెరికా చేపట్టిన ప్రయోగం చిక్కుల్లో పడింది. స్పేస్​క్రాఫ్ట్ నుంచి ఇంధనం లీక్ అవ్వడం వల్ల ల్యాండింగ్​పై సందిగ్ధం నెలకొంది.

US Moon Mission 2024
US Moon Mission 2024

US Moon Mission 2024 : 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపైకి ల్యాండర్​ను పంపేందుకు అమెరికా సంస్థ చేపట్టిన ప్రయోగం సందిగ్ధంలో పడింది. లాంఛింగ్​ అయిన గంటలకే స్పేస్​క్రాఫ్ట్​లో ఇంధన లీకేజీ లోపం బయటపడింది. పిట్స్​బర్గ్​కు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి ల్యాండర్​ను పంపింది. ఈ ల్యాండర్ ప్రొపల్షన్ సిస్టమ్​లో వైఫల్యాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫల్సన్ సిస్టమ్​లో లోపం ఉంటే చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం కోల్పోతుంది.

US Moon Mission 2024
సోమవారం ప్రయోగం అనంతరం నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్

ఈ నేపథ్యంలో ప్రయోగం జరిగిన 7 గంటల తర్వాత ల్యాండర్​ను సూర్యుడి దిశగా తిరిగేలా చేశారు. ల్యాండర్​కు కావాల్సిన శక్తి సోలార్ ప్యానెల్ ద్వారా స్వీకరించే విధంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 23న జాబిల్లిపై ల్యాండర్ దిగాల్సి ఉంది. అయితే, చాలా వరకు ఇంధనం వృథా అయిన నేపథ్యంలో ల్యాండింగ్​పై ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లక్ష్యాలను సవరించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమనే విషయంపై అంచనా వేసుకుంటున్నట్లు వివరించారు.

US Moon Mission 2024
ల్యాండర్ సమస్యపై ఆస్ట్రోబోటిక్ విడుదల చేసిన చిత్రం

ప్రైవేటు కంపెనీలకు నాసా భారీగా ఫండింగ్
చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా అవతరించాలని ఆస్ట్రోబోటిక్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగ్రీన్ అనే ల్యాండర్ ద్వారా శాస్త్రీయ పరికరాలను జాబిల్లిపైకి పంపించింది. ఈ పరికరాలు చంద్రుడి ఉపరితలంపై అధ్యయనంచేసి నాసాకు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంది. అటు హ్యూస్టన్ ను చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ త్వరలోనే ల్యాండర్ ప్రయోగం చేపట్టనుంది. జాబిల్లి ప్రయోగాల కోసం ఈ కంపెనీలకు నాసా భారీగా నిధులు సమకూర్చింది.

US Moon Mission 2024
ఆస్ట్రోబోటిక్ ప్రయోగించిన రాకెట్

ఏళ్ల తర్వాత మళ్లీ ప్రయోగాలు
చివరిసారిగా అమెరికా 1972 డిసెంబర్​లో చంద్రుడిపై ల్యాండింగ్ నిర్వహించింది. అపోలో 17 ప్రయోగం ద్వారా వ్యోమగాములు జీన్ సెర్నన్, హారిసన్ ష్మిట్​లను జాబిల్లిపైకి పంపించింది. చంద్రుడిపై నడిచిన 11వ, 12వ వ్యక్తులుగా వీరు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అగ్రరాజ్యం చంద్రుడిపై ల్యాండింగ్ ప్రయోగాలు చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టెమిస్ పేరుతో ప్రయోగాలకు సిద్ధమైంది. వచ్చే కొన్నేళ్లలో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలని నిశ్చయించుకుంది. 2024 చివరి నాటికి నలుగురు వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి తిరిగి భూమి మీదకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

నాసా ఆర్టెమిస్- 1 ప్రయోగం సక్సెస్.. క్షేమంగా భూమికి ఒరాయన్‌

చంద్రుడి మీదికి మళ్లీ.. అక్కడే స్థిరనివాసం.. ఏర్పాట్లు ఎలా చేస్తారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.